కేజ్రివాల్‌కు కాయకల్ప చికిత్స
న్యూఢిల్లీ: అధిక రక్తపోటు, మధుమేహం, తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్న ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధ్యక్షుడు అరవింద్ కేజ్రివాల్ చికిత్స కోసం బెంగుళూరులోని జిందాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నేచరోపతి ఆస్పత్రికి తన తల్లిదండ్రులతో సహా తరలివెళ్లారు. గజియాబాద్ ప్రాంతంలోని కౌషాంబి ఇంటి నుంచి ఆయన గురువారం ఉదయం ఎనిమిది గంటలకు బయల్దేరి వెళ్లారు. చికిత్స నిమిత్తం ఆయన పదిరోజులు అక్కడే ఉంటారు. ఈ కారణంగా అంతవరకు పాలనాపగ్గాలను ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు అప్పగించారు.
సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సలహా మేరకు ఆయన బెంగుళూరులోని జిందాల్ ప్రకృతి వైద్యశాలకు వెళ్లడం గమనార్హం. ఢిల్లీలో జరిగిన 'ఎట్‌హోం' విందు కార్యక్రమంలో కేజ్రివాల్ దగ్గుతో బాధపడుతున్న విషయాన్ని గమనించిన మోదీ ఈ సలహా ఇచ్చారు. కేజ్రివాల్ తన తల్లిదండ్రులతో జిందాల్ ఆస్పత్రిలో పది రోజులు ఉండేందుకు పాతిక నుంచి మూప్పై వేల రూపాయలు మాత్రమే ఖర్చవుతాయని ఢిల్లీ అధికారవర్గాలు తెలియజేశాయి. ఆయన ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడం వల్ల అంత తక్కువగా తీసుకుంటున్నారా లేక ఖర్చే అంత తక్కువవుతుందా? అన్నది వారికే తెలియాలి.
జిందాల్ ప్రకృతి వైద్యశాల విశేషాలు
సువిశాలమైన రమణీయమైన ప్రాంగణంలో ఈ ఆస్పత్రి ఉంటుంది. ఎటూచూసిన ఆకుపచ్చని తోటలతో కళకళలాడే ఈ నందనవనంలోకి అడుగుపెడుతూనే రోగులకు సగం జబ్బు నయమైన భావన కలుగుతుంది. అక్కడ ప్రాకృతిక, ఆయుర్వేద వైద్యాలతోపాటు రోగుల పరిస్థితినిబట్టి ఆలోపతి వైద్యం కూడా అందుబాటులో ఉంటుంది. రకారకాల వ్యయామాలు, యోగాసనాలు, నీరు, బురదతో చేసే రకరకాల థెరపీలు, మసాజ్‌లు అందుబాటులో ఉంటాయి. ఆక్రోబయాటిక్ వ్యాయామాలే కాకుండా చైనా ఆక్యుపంక్చర్ వైద్య విధానం కూడా అందుబాటులో ఉంటుంది. రోగుల ఆరోగ్య పరిస్థితిని బట్టి చికిత్స విధానం ఉంటుంది.
ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు రోగులకు రకరకాల చికిత్సలు చేస్తారు. సేంద్రీయ ఎరువులతో ప్రకృతిసిద్ధంగా పండించిన కూరగాయాలనే రోగులకు అందజేస్తారు. వాటిని కూడా ఆస్ప్రత్రి ప్రాంగణంలోని పొలాల్లోనే పండిస్తారు. చికిత్స విధానం మాత్రం కఠినంగా ఉంటుందని, క్రమశిక్షణతో వైద్యులు చెప్పినట్టుగా నడుచుకోవాల్సిందేనని అక్కడ చికిత్స పొందిన వాళ్లు తెలిపారు. రెండు రౌండ్లు పరుగెత్తి నాలుగు రౌండ్లు పరుగెత్తామంటే కుదరదని, ఏక్, దో, తీన్ అంటూ మనకు తెలియకుండానే మన రౌండ్లను లెక్కపెట్టే వారుంటారని వాళ్లు స్వానుభవంతో చెబుతున్నారు.