నవ్యాంధ్ర నవరసాల రాజధాని కావాలి
గజల్ శ్రీనివాస్ ఆకాంక్ష
కొత్తపేట :
నవ్యాంధ్రలో వివిధ కళా సంస్థలు ఏర్పాటు చేసి నవరసాల రాజధానిగా రూపుదిద్దాలని గజల్ గాయకుడు డాక్టర్ గజల్ శ్రీనివాస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాజధాని అమరావతి అభివృద్ది ఎంత అవసరమో కళలకు ప్రోత్సాహం కూడా అంతే అవసరమన్నారు. శాస్త్రీయ సంగీతం, నాట్యం, శిల్పం తదితర కళలను ప్రోత్సహించాలని కోరారు. ప్రముఖ వాగ్గేయకారుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ పంచలోహ విగ్రహాన్ని నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) సౌజన్యంతో గజల్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మంగళంపల్లి స్వగ్రామమైన రాజోలు నియోజకవర్గం శంకరగుప్తంలో నెలకొల్పనున్నారు. కొత్తపేటలో ప్రముఖ శిల్పి రాజ్‌కుమార్‌వుడయార్ రూపొందిస్తున్న విగ్రహం నమూనాను గురువారం సాయంత్రం శ్రీనివాస్ పరిశీలించారు. అచ్చం బాలమురళీకృష్ణ సంగీతం ఆలపిస్తున్నట్టుగానే విగ్రహాన్ని మలిచారని రాజ్‌కుమార్‌ను అభినందించారు. రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు పర్యవేక్షణలో మార్చి 3న జరిగే మంగళంపల్లి గుడి, విగ్రహావిష్కరణ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, నాట్స్ అధ్యక్షుడు మోహ¯ŒS మన్వా ముఖ్యఅతిథులుగా పాల్గొంటారని శ్రీనివాస్ విలేకరులకు చెప్పారు. అదే రోజు నాట్స్–గజల్ శ్రీనివాస్ కళాపరిషత్‌ల ఆధ్వర్యంలో బాలమురళీకృష్ణ సంగీత ఆరాధనోత్సవాలు నిర్వహిస్తామన్నారు.
మార్చి 5న వకుళమాత ఆలయ శంకుస్థాపన
తిరుపతి సమీపంలోని పేరూరులో వెంకటేశ్వరస్వామి తల్లి వకుళమాత ఆలయం పునర్నిర్మాణానికి చర్యలు చేపట్టినట్టు సేవ్ టెంపుల్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న శ్రీనివాస్ తెలిపారు. ఆ దిశగా 40 ఎకరాలు సేకరించగా టీటీడీ రూ.4 కోట్ల విడుదలకు సంసిద్ధత వ్యక్తం చేసిందన్నారు. మార్చి 5న పరిపూర్ణానందస్వామి పర్యవేక్షణలో జరిగే శంకుస్థాపనలో ఏపీ, తెలంగాణ, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల్లో పీఠాధిపతులు పాల్గొంటారన్నారు.
ర్యాలి ప్రసాద్‌కు పురస్కారద్వయం
కాకినాడ కల్చరల్ : ప్రముఖ కవి, ‘నవరసం’ వెబ్ పత్రిక సంపాదకుడు ర్యాలి ప్రసాద్ రెండు పురస్కారాలు అందుకోనున్నారు. ఆయన రాసిన ‘అతను’ కవిత విజయవాడ నుంచి వెలువడే ‘ఉపాధ్యాయ’ మాసపత్రిక వార్షిక కవితా పురస్కారానికి ఎంపిక కాగా..‘పరివర్తనం’ కవిత హైదరాబాద్ ఏజీ ఆఫీస్ ఏటా జాతీయస్థాయిలో నిర్వహించే వచన కవితా పోటీల్లో పురస్కారానికి ఎంపికైంది. ప్రసాద్ గతంలో ‘పునాసనీడ, తదనంతరం, కుంకుమరేఖ, మట్టి’ వంటి కవితా సంకలనాలు వెలువరించారు. అక్షరానికి పసనూ, పరిమళాన్నీ సంతరిస్తూ ఆయన రాసిన అనేక కవితలు ఎన్నో పోటీల్లో బహుమతులను అందుకున్నాయి. ప్రశంసలు పొందాయి. తాజాగా మరో రెండు పురస్కారాలు అందుకోనున్న సందర్భంగా ఆయనను పలువురు సాహితీవేత్తలూ కవిత్వాభిమానులూ అభినందించారు.