నేడు విద్యాసంస్థల బంద్
సంగారెడ్డి మున్సిపాలిటీ: మాసాయిపేట శివారులో జరిగిన దుర్ఘటనలో విద్యార్థుల మృతికి కారణమైన పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం విద్యా సంస్థల బంద్ నిర్వహిస్తున్నట్లు ఏబీవీపీ జిల్లా కన్వీనర్ హరికాంత్‌రెడ్డి, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రవి వేర్వే రు ప్రకటనల్లో తెలిపారు. పాఠశాల యాజమాన్యం అర్హత లేని డ్రైవర్లను నియమించడం వల్లనే ఈ సంఘటన జరిగిందన్నారు. ఆర్టీఓ అధికారులు లెసైన్స్ లేని డ్రైవర్ల పట్ల కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యంవల్లే ప్రమాదం- కేవీపీఎస్
కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అడివయ్య ఒక ప్రకటనలో ఆరోపించారు. బస్ డ్రైవర్, రైల్వేశాఖ నిర్లక్ష్యం వలన విద్యార్థులు బలయ్యారన్నారు. ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థులకు రూ.20లక్షల ఎక్స్‌గ్రేషియాతో పాటు గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలను అందించాలని, ప్రమాదానికి బాధ్యులైన కాకతీయ టెక్నో స్కూల్ యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
రికగ్నైజ్డ్ పాఠశాలల ఆధ్వర్యంలో..
రైలు ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థులకు సంతాప సూచకంగా శుక్రవారం జిల్లావ్యాప్తంగా ప్రైవేటు రికగ్నైజ్డ్ పాఠశాలల యాజమాన్యం ఆధ్వర్యంలో శుక్రవారం పాఠశాలల బంద్ నిర్వహిస్తున్నట్లు జిల్లా రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ జిల్లా కన్వీనర్ లింగాగౌడ్, కోశాధికారి ఆంథోనీరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థుల ఆత్మకు శాంతి కలగాలని సెయింట్ ఆంథోని పాఠశాల విద్యార్థులు కొవ్వొత్తులతో నివాళులర్పించారు.
రైల్వే మంత్రి దిష్టిబొమ్మ దహనం
కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే 21 మంది విద్యార్థులు మృతి చెందారని, ఇందుకు రైల్వేశాఖ నిర్లక్ష్య వైఖరే కారణమంటూ రైల్వే శాఖ మంత్రి దిష్టిబొమ్మను సీపీఎం ఆధ్వర్యంలో పట్టణంలోని కొత్త బస్టాండ్ ఎదుట దహనం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మల్లేశం మాట్లాడుతూ మాసాయిపేట గ్రామ ప్రజలు అనేకమార్లు రైల్వే గేటును ఏర్పాటు చేయాలని ధర్నాలు చేపట్టినా స్పందించకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందన్నారు. మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు రూ.20లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు.
పాఠశాల యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు
మాసాయిపేట దుర్ఘటనకు పాఠశాల యాజమాన్యాన్ని బాధ్యులను చేసి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వెంకట్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి దయానంద్‌రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం సంఘటన స్థలాన్ని సీపీఐ ప్రతినిధి బృందం సందర్శించిన అనంతరం వారు స్థానిక విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైల్వే చార్జీల పెంపుపై పెట్టిన దృష్టి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవడంలో విఫలమైందన్నారు.
రైల్వే క్రాసింగ్ వద్ద గేట్లను ఏర్పాటు చేయకపోవడం వలన అభంశుభం తెలియని 25 మంది విద్యార్థులు మృత్యువాత పడ్డారన్నారు. కాగా ప్రమాదానికి బాధ్యులైన పాఠశాల యాజమాన్యం, రైల్వే శాఖ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి హైమద్, ఉపాధ్యక్షుడు అశోక్ డిమాండ్ చేశారు.
రూ. 20లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి
మాసాయిపేట ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు రూ.20లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, ప్రమాదానికి కేంద్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి చుక్కా రాములు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో సంతాపం
రైలుప్రమాదంలో మృతి చెందిన విద్యార్థులకు వివిధ ఉపాధ్యాయ సంఘాలు వేర్వేరు ప్రకటనల్లో సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు తెలంగాణ టీచర్స్ ఫెడరేషన్ మైనార్టీ సెల్ రాష్ట్ర కన్వీనర్ జాకిర్ హుస్సేన్, తెలంగాణ పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణుగోపాలస్వామి, జిల్లా అధ్యక్షుడు కృష్ణమూర్తి, తెలంగాణ యూటీఎఫ్ అధ్యక్ష, కార్యదర్శులు లక్ష్మారెడ్డి, సాయిలు వేర్వేరు ప్రకటనల్లో సంతాపం వ్యక్తం చేశారు.బీఎస్ఎన్ఎల్ ఉద్యోగుల సంతాపంరైలు ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థులకు బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు సంతాపం ప్రకటించారు.