nests
-
Pudami Sakshiga :పక్షిగూడు గురించి ఈ ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసా?
“ఋతుపవనాలు అడవుల గుండా పయనిస్తున్నపుడు మన ప్రపంచంలోనే ఉన్న మరో చిన్న ప్రపంచంలోని ఆకర్షణ, రమ్యత చూసే కనులు పరవశమొందే హృదయం ఉన్న ఎవరినైనా మంత్రముగ్ధులను చేస్తుంది." - Dr. Salim Ali, eminant Ornithologist నిజమేనండి, పక్షుల ప్రపంచం ఎంతో అద్భుతమైనది. కొంచెం పరికించి చూస్తే ఆ చిన్ని ప్రపంచం లోని వింతలు విడ్డూరాలు మనకు సంభ్రమాశ్చర్యాలను కలిగిస్తాయి. పక్షులు చిన్నగా కనిపించినప్పటికీ అవి నివసించే తీరు వాటి జీవన విధానం మనకందరికీ ఎంతో ఆదర్శప్రాయం. ఆ చిన్ని గూటిలో ఎదుగుతున్న ఆకలితో ఉన్న పిల్లలు తమలో తాము సామరస్యంగా సర్దుబాటు చేసుకునే విధానం నిజంగా ఆశ్చర్యకరం. కుటుంబంలోని ఈ ఇచ్చి పుచ్చుకోవడం మనందరం అలవర్చుకోవాల్సిన ఒక మంచి పాఠం. ఆ పక్షి ప్రపంచంలోకి వెళ్ళి అవి గూడు కట్టుకునే విధానం గురించిన కొన్ని విశేషాలని తెలుసుకుందామా! గూడు (ఇల్లు) మనందరి మౌళిక అవసరం. సాయంత్రమైతే చాలు ఎప్పుడు ఇంటికి చేరి కొంత సేదదీరుదామా అని మనమందరం ఎదురు చూస్తాం. కొన్ని రోజులు ఇంటికి దూరంగా ఉన్నామంటే చాలు బెంగ పట్టుకుంటుంది. ఎప్పుడెప్పుడు ఇంటికి చేరతామా అని మనసు గొడవ పెడుతూ ఉంటుంది. మరి పక్షులు సాయంత్రమైతే ఎక్కడికి వెళ్తాయి? ఇదేం ప్రశ్న గూటికి పోతాయి అనుకుంటున్నారు కదూ, అలా అనుకుంటున్నారంటే మీరు పప్పులో కాలేసినట్లే. పక్షులు జతకట్టి, గుడ్లు పెట్టి, పిల్లలను సాకే కాలంలోనే గూళ్ళు కట్టుకుంటాయి. మిగతా సమయాలలో గుబురుగా పెరిగిన పొదలలోనో, బొరియలు చెట్టు తొర్రలలోనో, కొమ్మ వంచలలో శత్రువుల బారిన పడకుండా ఉండేలా చూసుకుని పడుకుంటాయి. సంతానోత్పత్తి కాలంలో రకరకాల పక్షులు వివిధ రకాలుగా గూళ్లను కట్టుకుంటాయి. కొన్ని గడ్డి పరకలను అల్లిగూడు కడితే, కొన్ని ఆకులను కుట్టి గూటిని కడతాయి. పుల్లలు, పుడకలు, బూజు, గరిక, మట్టి వంటి వాటితో ఎలాంటి సివిల్ ఇంజనీరు సాయం లేకుండా తమంతట తామే గూటిని నిర్మించుకుంటాయి. కొన్ని చెట్ల కాండాలపై రంధ్రాలు చేసి గూడును కడితే, కొన్ని నేలలో బొరియలను తవ్వి గూటిని నిర్మించుకుంటాయి. నీళ్ళపై తేలియాడే గూళ్ళు, వేలాడే గూళ్ళు అబ్బో ఎన్నో రకాల గూళ్ళు. కొన్ని కప్పు లాగా ఉంటే మరికొన్ని సాసర్ లా. ఇంకొన్ని గూళ్లయితే నేల మీదే. ఇలా పక్షులు కట్టుకునే గూళ్లను గురించిన మరిన్ని విశేషాలను తెలుసుకుందామనుకుంటుంటే చదవడం కొనసాగించండి మరి. ►తీతువ, తెల్ల బొర్ర నీటి కోడి వంటి నీటి పక్షులు నీటి అంచుకు దగ్గరగా ఆకులు, గడ్డితో నేల మీదే గూళ్ళు కట్టుకుంటాయి. గుడ్ల రంగు వాటిపై ఉండే మచ్చలు నేల, గడ్డి రంగులతో కలిసిపోయి శత్రువుల బారిన పడకుండా ఉంటాయి. కబోద పక్షి( నైట్ జార్) రాలిన ఆకులలోనే గుడ్లు పెడుతుంది. ► కాకులు, కొంగలు, గ్రద్దలు, పావురాలు పుల్లలతో గూడును నిర్మించుకుంటాయి. గూడు లోపల మెత్తని పీచు వంటి వాటిని పరిచి గుడ్లను పెడతాయి. ► చెట్ల తొర్రలలో గుడ్లగూబలు, కొమ్ముకసిరి (హార్న్ బిల్), చిలకలు, మైనాలు గూటిని ఏర్పాటు చేసుకుంటాయి. కంసాలి పిట్ట,వడ్రంగి పిట్టలు మొదట చెట్లకు రంధ్రాలు చేసి గూటిని నిర్మించుకుంటే, తరువాత చిలుకలు, మైనాలు వాటిని తమకు అనువుగా మార్చుకుంటాయి. మనం పాత ఇంటిని రీ మోడలింగ్ చేసుకున్నట్లు. ► కొమ్ము కసిరి గూడు కట్టుకుని పిల్లలను సాకే విధానం చాలా విభిన్నంగా ఉంటుంది. ఆడ మగ పక్షులు జతకట్టి గూటిని ఎంచుకోగానే ఆడ పక్షి ఆ తొర్రలో చేరి తన ముక్కు పట్టేంత ఖాళీ మాత్రం ఉంచి ద్వారాన్ని తన విసర్జకాలు, మట్టితో మెత్తి మూసేస్తుంది. ► గుడ్లు పెట్టి, పొదిగి, పిల్లలకు కనీసం ఒక వారం వయసు వచ్చే వరకు ఆడ పక్షి అలా నిర్భందం లోనే ఉండిపోతుంది. ఈ నిర్భందం సమయంలో మగ పక్షే ఆహారాన్ని అందిస్తుంది. పిల్లలకు కనీసం వారం వయసు వచ్చాకకట్టిన గోడను ముక్కుతో పొడుచుకుని ఆడ పక్షి బయటకు వచ్చి, మరలా అడ్డుగోడను కట్టేస్తుంది. అక్కడి నుంచి అమ్మానాన్నలిద్దరు పిల్లలను సాకడంలో నిమగ్నమైపోతారు. ► పసరిక పిట్టలు (బీ ఈటర్స్), లకుముకి పిట్ట (కింగ్ ఫిషర్), కూకూడు పిట్ట (హూపో) వంటి పక్షులు కొంచెం ఎత్తైన నేల మీద మట్టిలో బొరియలు చేసుకుని లేదా కొండ అంచులలో బొరియలు తవ్వి గూడు కట్టుకుంటాయి. ► పికిలి పిట్టలు (బుల్బుల్), పిచ్చుకలు, వంగ పండు (గోల్డెన్ ఓరియల్), పసుపు జిట్ట (ఐయోర) వంటి పక్షులు కొమ్మ వంచలలో దొన్నె లాంటి గూటిని కట్టుకుంటాయి. ► చుక్కల జీనువాయి (మునియ) గడ్డితో గుండ్రటి బంతి లాంటి గూటిని కట్టుకుంటుంది. ఆకుల పోతడు (దర్జీ పిట్ట) ఆకుల అంచులను కలిపి గొట్టంలా కుట్టి గూడు పెడుతుంది. ► తేనె పిట్టలు ఆకులు, గడ్డి, బూజును వాడి వేలాడే గూటిని కడితే, గిజిగాడు (బాయా వీవర్) గడ్డి పోచలతో వేలాడే అందమైన గూటిని అల్లుతుంది. గిజిగాడు నీటి అంచులలో ఉన్న చెట్లపై బాగా వాలి ఉన్న కొమ్మల చివర గడ్డితో గూటిని అల్లుతుంది. ► మొదట గడ్డితో ముడి వేసి, చట్రాన్ని అల్లి మిగిలిన గూటిని అల్లుతుంది. ఇదంతా మగ పక్షి మాత్రమే చేస్తుంది. ఇలా అల్లిన గూటిని ఆడ పక్షి పరిశీలించి నచ్చితే జతకట్టి గూటిని నిర్మించడం కొనసాగిస్తాయి. ఆడపక్షి గుడ్లు పెట్టిన తర్వాత మగ పక్షి మరో గూటిని కట్టడం మొదలు పెడుతుంది. ఇలా సంతానోత్పత్తి కాలంలో రెండు నుండీ మూడు గూళ్లను కడుతుంది. ఒక వేళ ఆడపక్షికి గూడు నచ్చక పోతే పని మళ్ళీ మొదటికే, ఆ గూటిని పీకి కొత్త గూటిని అల్లాల్సిందే. ఈ గూటిని కట్టడానికి వెయ్యి దాకా గడ్డి పోచలు అవసరపడతాయట. గూడు పచ్చగా ఉన్నపుడే ఆడ పక్షి పరిశీలించేది, గూడు అల్లటం ఆలస్యం అయినా కధ మళ్ళీ మొదటికే. ఇంతే కాదు, నీటికాకులు, కొంగలు, పసరిక పిట్టలు, అడవి పిచ్చుకలు, వలస పక్షులు కలిసికట్టుగా కాలనీలుగా గూళ్ళు నిర్మించుకుంటాయి. పిల్లలను శత్రువుల బారినుండి సంరక్షించుకునేందుకు కాలనీ సహాయపడుతుంది. ఇక్కడ తమంతట తాము గూటిని నిర్మించుకోలేని కోకిల జాతి పక్షులను గురించి కూడా కొంచెం చెప్పుకోవాలి. కోకిల సొంతంగా గూటిని కట్టుకోలేదు, కాకి గూటిలోనో, బొంత పిచ్చుకల గూటిలోనో గుడ్లను పెడుతుంది. పిల్ల పెరిగి పెద్దదయిన తర్వాత గాని పెంచిన తల్లిదండ్రులకు తెలియదు. ఇలా పక్షులు రకరకాలుగా గూటిని నిర్మించుకునే విశేషాలు భలే గమ్మత్తుగా ఉన్నాయి కదూ! చాలా వరకు పక్షులు మే నుంచి సెప్టెంబరు లోపు అంటే వానలు పడి పురుగులు, గడ్డి, గడ్డి గింజలు, పళ్ళు ఎక్కువగా దొరికే కాలంలో గూటిని కట్టుకుని సంతానోత్పత్తిని చేస్తాయి. మీరు కొంచెం బద్దకం వీడి నాలుగడుగులు వేసి మీ చుట్టుపక్కల పరిశీలిస్తే తప్పకుండా ఒకటి రెండు గూళ్లను చూసే అవకాశం దక్కించుకోవచ్చు. ఏమిటి లేచే ప్రయత్నం చేస్తున్నారా? రచయిత : రవి కుమార్ ద్వాదశి, ravikumardwadasi@gmail.com తెలుగులో ప్రకృతి గురించి రాయాలనుకునే వారు ఈ ఫారమ్ను నింపండి- bit.ly/naturewriters పుడమి సాక్షిగా అనే కార్యక్రమం సాక్షి మీడియా గ్రూప్ చేపట్టిన పర్యావరణ హిత క్యాంపెయిన్. దీని గురించి మరింత 'సమాచారం తెలుసుకోవడానికి విజిట్ చేయండి. www.pudamisakshiga.com -
కింగ్ కోబ్రాలు గూడు కట్టి.. గుడ్లు పెట్టి..
సాక్షి, అమరావతి: ప్రపంచంలోనే అత్యంత అరుదైన జాతికి చెందిన కింగ్ కోబ్రాలు గుడ్లు పెట్టేందుకు దిబ్బల మాదిరిగా నేలపై గూళ్లు కడతాయి. ఇందుకోసం ఆడ కింగ్ కోబ్రా గర్భం దాల్చిన వెంటనే ఎండిపోయిన వెదురు ఆకులను సేకరించి గూట్లో గుడ్లు పెట్టేందుకు అనువుగా సర్దుతుంది. అందులో 30 నుంచి 40 గుడ్లు పెట్టి పొదుగుతుంది. ఆ సమయంలో నెల నుంచి నెలన్నర పాటు ఆహారం మానేసి గూట్లోనే ఉండిపోతుంది. ఆ తరువాత 15 నుంచి 30 రోజుల్లో గుడ్ల నుంచి పిల్లలు వస్తాయనగా తల్లిపాము గూడు విడిచి వెళ్లిపోతుంది. ఆ గూళ్లను అడవి పందులు, ముంగిసలు ఇతర జంతువులు తవ్వి గుడ్లను తినేస్తాయి. ఫలితంగా కింగ్ కోబ్రాల జాతి అంతరించిపోయే స్థితికి చేరుకుంది. ఎలా రక్షిస్తున్నారంటే.. మన రాష్ట్రంలో వెదురు పొదలు ఎక్కువగా ఉండే చోట కింగ్ కోబ్రా గూళ్లు ఎక్కువగా పెడుతున్నట్టు తూర్పు కనుమల వైల్డ్ లైఫ్ సొసైటీ, అటవీ శాఖ గుర్తించాయి. పిల్లలు బయటకు వచ్చేంత వరకు వీటి గుడ్లను సంరక్షించేందుకు వైల్డ్ లైఫ్ సొసైటీ, అటవీ శాఖ ప్రయోగాత్మకంగా చర్యలు చేపట్టాయి. గిరి నాగులు గుడ్లు పెట్టే దశ మార్చిలో ప్రారంభమై జూలై, ఆగస్టులో ముగుస్తుంది. ఆగస్టు నెలలో గుడ్లలోంచి పిల్లలు బయటకు వస్తాయి. ఆ గూళ్లను రక్షించడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం అనకాపల్లి జిల్లా మాడుగులలో మొదటిసారి ఒక గూడును పరిరక్షించి గుడ్లలోంచి పిల్లలు వచ్చాక వాటిని అడవిలో వదిలేశారు. విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో ఈ గూళ్లపై సర్వే పూర్తి చేయగా.. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ప్రస్తుతం ఈ కార్యక్రమం కొనసాగుతోంది. ఆడ గిరి నాగులు గుడ్లు పెట్టిన గూళ్లను వదిలి వెళ్లిపోయిన తరువాత గూళ్ల చుట్టూ వెదురు బొంగుల్ని పాతి ఇతర జీవులేవీ గుడ్లను తాకలేని విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆపై గూళ్ల చుట్టూ దోమ తెరలను ఆమరుస్తున్నారు. గుడ్లలోంచి గిరి నాగు పిల్లలు బయటకు వచ్చిన తరువాత వెదురు బొంగులు, దోమ తెరలను తొలగించి.. ఆ పిల్లల్ని స్వేచ్ఛగా అడవిలో వదిలేస్తున్నారు. వీటిని ఎందుకు కాపాడుకోవాలంటే.. కింగ్ కోబ్రా ఆహార గొలుసులో అగ్ర స్థానంలో ఉంటుంది. అంటే గిరి నాగులు ఇతర అన్ని రకాల పాముల్ని ఆహారంగా తీసుకుంటాయి. వీటి వల్ల ఇతర పాముల జనాభా నియంత్రణలో ఉంటుంది. పర్యావరణంలో కింగ్ కోబ్రాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. గిరి నాగులు ఉన్నచోట జీవ వైవిధ్యం ఎక్కువగా ఉన్నట్టు లెక్కిస్తారు. సాధారణంగా ఇవి మనుషులు వస్తే.. తప్పించుకుని పోతాయి. ఈ పాముల కాటు వల్ల మనుషులు చనిపోయిన సందర్భాలు తక్కువ. కింగ్ కోబ్రాల రక్షణ కోసం పని చేస్తున్నాం ఐదారేళ్ల క్రితం వరకు గిరి నాగుల్ని స్థానికులు ఎక్కువగా చంపేసేవారు. ఆ సమయంలో అటవీ శాఖతో కలిసి కింగ్ కోబ్రా కన్జర్వేషన్ ప్రాజెక్టును మొదలుపెట్టాం. వాటి సంరక్షణ, ఇతర పాము జాతులపై అధ్యయనం, పాము కాటు నివారణే లక్ష్యంగా పని చేశాం. మేం చేపట్టిన చర్యలు ఫలించి గిరి నాగుల్ని చంపడం చాలా వరకూ తగ్గిపోయింది. ప్రస్తుతం వాటి గూళ్లు, వాటి సంతతి పరిరక్షణ కోసం చర్యలు చేపడుతున్నాం. – కంఠిమహంతి మూర్తి, అధ్యక్షుడు, తూర్పు కనుమల వైల్డ్ సొసైటీ -
ఇల్లు చూపి ఇల్లాలిని చేసుకునే ఓ ‘పిట్ట’ కథ
ఆత్మకూరు రూరల్(నంద్యాల జిల్లా): అందమైన ప్రేమరాణి చెయ్యి తగిలితే సత్తురేకు కూడా స్వర్ణమేలే అన్నాడో కవి.. ఆమె ఓర చూపే మోక్ష మార్గం అని కూడా వర్ణించాడు. ప్రేయసి కోసం మనుషులు ఇలా కవిత్వాన్ని ఆశ్రయిస్తే.. ఓ పక్షి మాత్రం గూడుకట్టి తన గుండె స్పందనను తెలుపుతోంది. ప్రేమ కోసం తన అద్భుత నైపుణ్యాన్ని ప్రదరిస్తున్న అందరికీ తెలిసిన ‘పిట్ట’ కథ ఇదీ.. చదవండి: రెస్టారెంట్లో బిర్యానీ తింటున్నారా?.. అయితే మీకో చేదు వార్త ఏటి ఒడ్డునో, చెరువు గట్టునో ఈత, తుమ్మ వంటి చెట్ల చిటారు కొమ్మలకు వేలాడుతూ గిజిగాళ్లు నిర్మించిన గూళ్లు కనపడుతుంటాయి. వీటి నిర్మాణ శైలి అద్భుతంగా ఉంటుంది. ఈతనారను జాగ్రత్తగా సేకరించే మగ పక్షులు అద్భుతమైన నైపుణ్యంతో గూళ్లు నిర్మిస్తాయి. తమకు ప్రమాదకరమైన పాములు, కాకులు వంటి వాటి నుంచి రక్షించుకునేందుకు ఏటినీళ్ల పైన వేలాడే విధంగా, గట్టుపైన ఉండే చెట్ల కొమ్మలు నీటిపై వేలాడే చోట గూళ్లు కడతాయి. తిరగవేసిన కిరోసిన్ దీపం చిమ్నిలా ఈ గూళ్లలో ప్రత్యేకమైన గదులు, మెత్తటి పాన్పులాంటి నిర్మాణాలుంటాయి. నల్లమల అటవీ సమీప గ్రామాలు, పరిసర ప్రాంతాల్లో గిజిగాడి గూళ్లు విరివిగా కనిపిస్తుంటాయి. ప్రేమకోసం.. ఆంగ్లంలో వీవర్ బర్డ్గా ఈ పక్షిని పిలుస్తారు. ఆత్మకూరు పరిసర ప్రాంతాల ప్రజలు వీటిని పిట్టలుగానే గుర్తిస్తారు. మగపక్షి గూడును నిర్మించి ఆడపక్షిని ఆకర్షిస్తుంది. గూడు చూపి ఆడపక్షితో జతకట్టేందుకు ఆహ్వానిస్తుంది. ఇల్లును చూసి ఇల్లాలి నైజం గ్రహించ వచ్చని పెద్దలు చెబుతుంటారు. అయితే గిజిగాడి పక్షుల్లో మాత్రం ఇల్లాలి కోసం మగ పక్షి ఇల్లు(గూడు) కడుతుంది. సగం గూడు నిర్మించే మగ పక్షి అటు వెళ్లే ఆడపక్షులకు తన గూడును చూడరమ్మని ఆహ్వానిస్తున్నట్లుగా గూటిపై వాలి రెక్కలల్లారుస్తూ కువకువలాడుతుంది. ఈ దృశ్యం చూడముచ్చటగా ఉంటుంది. గూడు నచ్చితే ఆడపక్షి మగపక్షితో జతకట్టేందుకు అంగీకరిస్తుంది. గూడు నచ్చక ఆడపక్షి ‘నో ’ చెబితే అసంపూర్ణ నిర్మాణాన్ని (గూడు) వదలి మరోచోట మరో గూడు కట్టేందుకు మగ పక్షి సిద్ధమవుతుంది. ఆడపక్షి గూడు నచ్చి అంగీకారం వ్యక్తపరచగానే మగపక్షి మిగిలిన గూడు నిర్మాణం పూర్తి చేస్తుంది. ఆడపక్షి గూటిలో గుడ్లు పెడితే వాటి సంరక్షణ మగపక్షి చూసుకుంటుంది. పిల్లలు గుడ్లనుంచి బయటికి రాగానే వాటి పోషణ భారం మాత్రం ఆడపక్షే మోస్తుంది. ఒక్కో ప్రదేశంలో గిజిగాళ్లు రెండు వందల వరకు సామూహికంగా గూళ్లు నిర్మించుకుని సామాజిక జీవనం గడుపుతాయి. శత్రువులు దాడి చేసినపుడు మూకుమ్మడిగా పెద్దగా అరుస్తూ తమ పిల్లలను, గూళ్లలోని గుడ్లను రక్షించుకునే ప్రయత్నం చేస్తాయి. గిజిగాడిపై ఖండకావ్యం గిజిగాళ్లు జీవిత కాలం 10 నుంచి 15 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇవి కీటకాలు, వివిధ రకాల విత్తనాలను తిని బతుకుతుంటాయి. ఎంత వర్షం వచ్చినా, సుడిగాలి వీచినా గూడు చెదరకుండా, తడవకుండా బలంగా నిర్మించుకుంటాయి. గిజిగాడి నైపుణ్యానికి మెచ్చి మహాకవి గుర్రం జాషువా ఖండ కావ్యాన్ని రచించారు. ‘‘తేలిక గడ్డి పోచలను దెచ్చి, రచించెదవీవు తూగుటు య్యేల గృహంబు’’ అంటూ తన పద్యంలో ‘‘బంగారువన్నెగల దుస్తులు ధరించి, నీ భార్యా పిల్లలు నీ పొదిగిట నిద్రిస్తుండగా, హాయిగా వీచే పిల్లగాలులు మీరున్న ఊయల గృహాన్ని ఊపుతూ ఉండగా, ఏమాత్రం భయంలేకుండా ప్రశాంతంగా నిద్రిస్తుంటావు. నీకున్న ఆ గొప్ప సుఖం మాకెక్కడుందిరా గిజిగా! అసలు మాకేమిటిరా.. ఏ మహరాజుకైనా అంతటి సుఖం ఉంటుందంటావా?’’ అంటూ ఆ గిజిగాని వైభవాన్ని కీర్తించారు. -
ప్రాణం పోయినా సరే ‘తల’పెడితే.. తగ్గేదేలే!.. ఇతరులకు నో ఎంట్రీ!
చీమా.. చీమా.. ఏమిటలా కుట్టావ్ అంటే.. నా పుట్టలో వేలుపెడితే కుట్టనా? అంటుందట. కానీ ఈ చీమ కుట్టకున్నా.. తమ గూట్లో మాత్రం వేలు పెట్టనివ్వదు. తన తలను పణంగా పెట్టి మరీ గూడును కాపాడేస్తుంది. ప్రాణం పోయినా సరే.. తగ్గేదే లేదంటూ నిలబడుతుంది. ఏమిటీ.. ఓ చీమ గురించి ఇంత ఉపోద్ఘాతమేంటి అనిపిస్తోందా? దాని గురించి తెలిస్తే.. భలే ఉందిలే అనుకోకుండా ఉండలేరు. మరి ఆ చీమ ఏమిటి? దాని ప్రత్యేకతలేమిటో తెలుసుకుందామా? – సాక్షి సెంట్రల్ డెస్క్ గూటికి తగినట్టుగా తల.. సాధారణంగా ఇంటిని కాపాడటానికి గేట్లు, తలుపులు పెట్టుకుంటాం. అవసరమైతే తీసి, మళ్లీ వేసేస్తుంటాం. కానీ చెట్ల కాండంపై రంధ్రాల్లో జీవించే ‘డోర్ హెడ్’ చీమలు మాత్రం స్పెషల్. అవి తమ గూటిని కాపాడుకునేందుకు తలనే అడ్డుపెట్టి చేసే పోరు మరీ స్పెషల్.‘సెఫలోట్స్/సెరెబరా’ జాతికి చెందిన ఈ చీమల తలపై భాగం బల్లపరుపుగా, గుండ్రంగా ఉంటుంది. అంతేకాదు.. దాదాపుగా తమ గూడు రంధ్రానికి సరిపడే పరిమాణంలో ఉంటుంది. ఈ చీమలు ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు.. గూటి లోపలికి వెళ్లి.. తమ తలను గూటి రంధ్రానికి అడ్డు పెట్టేస్తుంటాయి. అందుకే వీటిని ‘లివింగ్ డోర్స్’ అని కూడా పిలుస్తుంటారు. సాధారణంగా బీటిల్స్ (ఒకరకం చిన్నసైజు పురుగులు) చెట్ల కాండాలపై గుహల్లా రంధ్రాలు చేస్తుంటాయని.. వీటినే తమ గూడుగా చేసుకుని జీవిస్తుస్తున్న ఒకరకం చీమలు.. వాటిల్లోకి ప్రవేశించే రంధ్రాల వద్ద ‘డోర్హెడ్’ చీమలను కాపలాగా ఉంచుతాయని అమెరికాలోని లూయిస్విల్లే యూనివర్సిటీ పరిశోధకుడు స్టీవ్ యనోవిక్ తెలిపారు. ఈ చీమలపై ఆయన విస్తృత పరిశోధన చేశారు. ‘డోర్హెడ్’ చీమలు తమ చీమలనే లోనికి రానిస్తాయని.. చెట్లపై తిరిగే చిన్న పురుగులు, కీటకాలు వంటివి గూడులోకి వెళ్లకుండా అడ్డుకుంటాయని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా చాలాచోట్ల ఈ తరహా ‘డోర్ హెడ్’ చీమలు ఉన్నాయన్నారు. చెట్ల కాండాల్లో బీటిల్స్ చేసే రంధ్రాలకు సమాన సైజులో ‘డోర్ హెడ్’ చీమల తల సైజు ఉండటం విశేషమని.. లక్షల ఏళ్ల పరిణామ క్రమంలో ఇలా అభివృద్ధి చెంది ఉంటాయని పేర్కొన్నారు. ప్రాణం పోయినా.. తగ్గేదే లే.. చీమల్లో చాలా రకాలు కుడతాయి. ఇందుకోసం వాటికి ప్రత్యేకంగా గొట్టంవంటి నిర్మాణం (స్టింగ్) ఉంటుంది. కానీ ‘డోర్ హెడ్’ చీమలకు స్టింగ్ ఉండదు. దాంతో కుట్టలేవు. కానీ శత్రు పురుగులు, కీటకాలు గూడులోకి వెళ్లకుండా అడ్డుకునేందుకు ప్రాణాలనైనా పణంగా పెడతాయని.. పురుగులు ఈ చీమల తలపై గట్టిగా దాడి చేసినా, కుట్టినా వెనక్కితగ్గవని స్టీవ్ యనోవిక్ చెప్పారు. తాము పరిశీలించిన ‘డోర్ హెడ్’ చీమల్లో చాలా వాటికి తలపై గాయాల గుర్తులు ఉన్నాయని వివరించారు. చీమల గూడు నిరంతరం మూసేసి ఉండదని.. ఏదైనా ప్రమాదం వస్తున్న సంకేతాలు కనబడగానే ‘డోర్హెడ్’ చీమలు ద్వారానికి తలుపులా తమ తలను అడ్డుపెట్టేస్తాయని తెలిపారు. -
ప్రాణాలకు తెగించి చేసే దొంగతనానికి గుర్తింపు!
ఈ ప్రకృతిలో జీవుల మధ్య మనుగడ పోరాటం చాలా వైవిధ్యంగా సాగుతుంటుంది. సాధారణంగా పక్షుల్లో చాలా రకాలు గూడు కట్టుకోవడం కోసం చాలా కష్టపడుతుంటాయి. గడ్డి పోచలు, ఆకులతో పాటు చిన్న కట్టెపుల్లలను ఉపయోగించుకుంటాయి. అలాగే ఇంకొన్ని పక్షులు జంతువుల నుంచి జుట్టును తస్కరిస్తుంటాయి. ఈ క్రమంలో వాటి చేతిలో గాయపడడమో లేదంటే చనిపోవడమో జరుగుతుంది కూడా. సైంటిఫిక్గా ఈ చర్యకు ఇన్నాళ్లూ ఓ పేరంటూ లేదు. తాజాగా పక్షులు చేసే ఈ సాహసోపేతమైన చర్యకు ఓ పదం, అర్థం ఇచ్చారు సైంటిస్టులు. అసాధారణమైన ఈ ప్రవర్తనకు ‘క్లెప్టోట్రిచి’ అని పేరు పెట్టారు. ఇది ఒక గ్రీకు పదం.. దానికి దొంగిలించడం లేదా జుట్టు అనే రెండు అర్థాలూ వస్తాయి. అందుకే పక్షుల చర్యకు సరిపోతుందనే ఉద్దేశంతో ఆ పేరు పెట్టారు. జులై 27న ఎకాలజీ(జీవావరణ శాస్త్రం)లో ఈ పదం చేర్చినట్లు ఇల్లినాయిస్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఆగష్టు 11న ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భయపెడతాయి.. నిజానికి చలి ప్రాంతాల్లో పక్షులు ఎక్కువగా ఇలా జంతువుల వెంట్రుకలతో గూడులను నిర్మించుకుంటాయి. అంతేకాదు తెలివిని ప్రదర్శించి.. తమ శత్రువులను ఈ గూడుల ద్వారా భయపెడతాయి కూడా. ఎలాగంటే.. వేటాడే వాటికి ఈ గూడును ఏదో భయంకరమైన ప్రాణిగా కనిపించే రీతిలో తీర్చిదిద్దుతాయి ఆ పక్షులు. కుక్కలు, పిల్లులు, నక్కలు, రకూన్లు, ఆఖరికి మనుషుల నుంచి కూడా కొన్ని పక్షులు వెంట్రుకల్ని సేకరిస్తుంటాయి. పడుకున్నప్పుడో లేదంటే తింటున్నప్పుడో.. అదనుచూసి వెంట్రుకల్ని లాగేస్తాయి పక్షులు. ఇది చదవండి: కిడ్నీ మార్పిడిలో పాతవి ఎందుకు తీసేయరంటే.. క్లెప్టోట్రిచిలో భాగంగా.. దక్షిణ అమెరికాలో పామ్ స్విఫ్ట్ పక్షులైతే పావురాలు, చిలుకల నుంచి రెక్కలు దొంగిలించడం విశేషం. ఆస్రే్టలియాలో హనీఈటర్ బర్డ్.. కోవాలాల నుంచి వెంట్రుకలు దొంగతనం చేస్తాయి. ఇలాంటి ప్రవర్తనకు కారణం.. పక్షులు ఈ సేకరణను సులువైన మార్గంగా భావించడమేనని, కానీ, ప్రమాదాలను అంచనా వేయకుండా ఒక్కోసారి అవి ప్రాణాలను పొగొట్టుకుంటాయని యానిమల్ బిహేవియరిస్ట్ మార్క్ హౌబర్ చెప్తున్నారు. -
Gijigadu : టాలెంట్ ఉంటేనే ఆడ పక్షుల ప్రేమ..
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: సృష్టిలో పశుపక్ష్యాదులు తమదైన శైలిలో ప్రత్యేకతను చాటుతాయి. పక్షిజాతుల్లో విభిన్నమైన, వైవిధ్యతను చాటే పక్షి గిజిగాడు. ఈ పక్షులు పాలమూరు యూనివర్సిటీలోని అడ్మిన్ భవనం వద్ద ఉన్న ఓ బావిలో ఇటీవల గూడు కట్టుకుంటున్నాయి. మగ, ఆడ పక్షుల మధ్య ఉండే సంబంధాల్లో కొన్ని ఆసక్తికర విషయాలను యూనివర్సిటీ జంతుశాస్త్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ ‘సాక్షి’తో పంచుకున్నారు. లేత పసుపు రంగులో ఉండే మగపక్షి నాణ్యతగా గూడు కట్టి ఆడపక్షిని మెప్పించగలిగితే.. ఆ ఆడ పక్షి గూడు కట్టిన మగపక్షితో జత కడుతుంది. గాలి, వాన, చలి, వేడికి కూడా చెక్కు చెదరకుండా పక్షి పిల్లలకు ఆ గూడు రక్షణ ఇవ్వాలి. అలా మెప్పించలేని మగ పక్షులు ఏడాది పాటు ఒంటరిగా ఉండాల్సిందేనట. ప్రతిభ ఉన్న మగ పక్షులే ఆడ పక్షుల ప్రేమను పొందుతాయట. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఎంతో ఆసక్తిగా అనిపిస్తుంది. చదవండి: పాముకే విషమిచ్చి చంపేస్తే!! -
లవ్బర్డ్.. ఇలా చేయడం ఎప్పుడూ చూసి ఉండరు!
హోం.. స్వీట్ హోం.. ఎవరికైనా ఇళ్లంటే ఇష్టమే. పందిరి ఇంటి నుంచి పదంస్తుల మేడ వరకు ఏదైనా సరే ఒక ఇళ్లు కలిగి ఉండాలని అంతా కోరకుంటాం. పక్షులు కూడా అంతే గుడ్లు పెట్టే సమయంలో కచ్చితంగా గూడు కట్టుకుంటాయి. అందుకోసం ఎంతగానో శ్రమిస్తాయి. చెట్లు, మొక్కల నుంచి రకరకాల పదార్థాలు సేకరించి... వాటిని అల్లి చిత్రవిచ్రితంగా గూళ్లు కడుతుంటాయి. అయితే ఫారెస్ట్ ఆఫీసర్ సుశాంతనంద ట్విట్టర్లో షేర్ చేసిన పోస్టులో ఉన్న లవ్బర్డ్ చాలా స్మార్ట్. ఎంతో నేర్పుగా ఆకులోని మధ్య ఈనెను తొలచి వేస్తుంది. అలా తొగించిన వాటిని ఈకల్లో దాచిపెట్టుకుంటోంది. మాములుగా అయితే నోటితో పట్టుకుని.. గూడు నిర్మించే చోటుకి వాటిని తరలించాలి. ఒక్కోసారి ఒక్కోటి పట్టుకుని వెళితే సమయం, శ్రమ ఎక్కువ అవుతుందని ఆలోచించిన లవ్బర్డ్ ఈనెలను ఈకల్లో దాచుకోవడమే ఇక్క ‘స్మార్ట్’. ఇక లవ్బర్డ్ తెలివైన పనిని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఫారెస్ట్ ఆఫీసర్ సుశాంతనంద దానిని షేర్ చేయగా వైరల్ అయింది. ఈ వీడియో చూసిన వారు పక్షి తెలివి తేటలకి తెగ ముచ్చటపడుతున్నారు. Just amazing... Love bird rips the mid vein of leaves, tucks it in the feather & flies to build its nest when it has enough. Not flying each time. Efficiency👌 From Channa Prakash pic.twitter.com/ddJaEuFJ39 — Susanta Nanda IFS (@susantananda3) June 22, 2021 చదవండి : కార్బెట్ రిజర్వ్లో తెల్ల నెమలి.. 85 ఏళ్లలో ఇదే తొలిసారి -
వీడియో వైరల్: ఏనుగులు చేసిన పనికి ఫిదా కావాల్సిందే
చెన్నె: భారీ ఆకారం.. ఎన్ని టన్నులైనా ఎత్తగల శక్తిసామర్థ్యం ఉన్న గజరాజుకు కోపమొస్తే ఇక అంతే సంగతులు. అని అందరికీ తెలిసిన విషయమే. కానీ వాటికి మనసు ఉంటుంది.. మానవత్వం ఉంటుంది. భారీ గజరాజులకు సున్నిత మనస్తత్వం కలదని ఓ సంఘటన నిరూపించింది. ఏనుగులు చేసిన పనికి అందరూ ఫిదా అవుతున్నారు. మానవత్వంతో ఏనుగులు చేసిన పని సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తమిళనాడులోని ఓ గ్రామంలో శుక్రవారం అరటి తోటలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. అరటి తోటను ధ్వంసం చేశాయి. అరటి చెట్లను పారవేస్తూ.. అరటిగేలలను తింటూ తోటలో నానా హంగామా చేసి వెళ్లాయి. ఏనుగుల దాడిలో నష్టపోయామంటూ రైతులు లబోదిబోమన్నారు. ఈ సందర్భంగా పంట ను పరిశీలించేందుకు తోటలోకి వెళ్లి చూడగా ఒకచోట ఆశ్చర్యం కలిగేలా ఓ దృశ్యం కనిపించింది. తోటంతా నాశనం చేసిన ఏనుగులు ఒక్క అరటి చెట్టును మాత్రమే తొలగించకుండా వెళ్లిపోయాయి. ఎందుకంటే వాటిపైన పక్షిగూడు ఉంది. వాటిలో అప్పుడే పుట్టిన బుజ్జి పక్షులు ఉన్నాయి. వాటిపై ఏనుగులు మానవత్వం చూపాయి. పక్షులతో కూడిన గూడు ఉన్న చెట్టును నాశనం చేయకుండా ఏనుగులు మిగిల్చి వెళ్లాయి. వీటిని రైతులు ఆసక్తిగా గమనించారు. పంట నష్టం అంచనా వేయడానికి వచ్చిన అధికారులు చూసి కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అటవీ శాఖ అధికారి సుశాంత నంద ఆ దృశ్యాన్ని చూసి ఆనందించారు. తోటి జీవులను ఏనుగులు కాపాడాయి అని తెలిపారు. ‘ఒక్క పక్షులున్న ఒక్క చెట్టు తప్ప మొత్తం అరటి తోటను నాశనం చేశాయి. అందుకే అంటారు గజరాజులను సున్నిత మనస్తత్వం కలవి’ అని చెబుతూ సుశాంత నంద ట్వీట్ చేశారు. చెట్టుపై ఉన్న పక్షులతో కూడిన ఉన్న గూడు వీడియోను పంచుకున్నారు. ఈ వీడియో చూసి వావ్.. సో క్యూట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏనుగులు నిజంగా ఎంత మంచివో అని పేర్కొంటున్నారు. చదవండి:కొత్త సీఎం స్టాలిన్: తొలి ఐదు సంతకాలు వీటిపైనే.. చదవండి: ‘వ్యవస్థ కాదు.. ప్రధాని మోదీ ఓడిపోయాడు’ This is the reason as to why elephants are called gentle giants. Destroyed all the banana trees , except the one having nests. Gods amazing Nature🙏 (Shared by @Gowrishankar005) pic.twitter.com/iK2MkOuvaM — Susanta Nanda IFS (@susantananda3) May 7, 2021 -
నేచురల్ ఇంజనీర్స్
యాదగిరిగుట్ట : ఒక్కో గడ్డిపోచను నేర్పుతూ, పేర్చుతూ అందాల గూళ్లను పిచ్చుకలు అళ్లుతున్న తీరు అద్భుతం. వాటిది నేచురల్ ఇంజనీరింగ్. హోరుగాలికి, జోరువానకు సైతం తట్టుకునేలా గూడు కట్టుకుంటున్న వాటి నైపుణ్యం అబ్బురపర్చుతుంది. బంగారు వర్ణంలో తళతళలాడుతూ చూడముచ్చట గొలిపే ఈ పిచ్చుకలు గూళ్లు అళ్లుతున్న దృశ్యాలు యాదగిరిగుట్ట మండలం దాతా రుపల్లి, రాళ్లజనగాం గ్రామాల్లోన్ని వ్యవసాయ బావుల వద్ద కనిపించాయి. చూపరులకు కనువిందు చేస్తున్నాయి. -
చెట్టునే నేలకు దించే పక్షి గూళ్లు..
చిన్న చిన్న పుల్లలు, ఎండిపోయిన ఆకులు, ఇతరత్రా ఉపయోగించి పక్షులు ఎంతో నేర్పుగా చిన్నపాటి గూళ్లను నిర్మించుకుంటాయి. ఈ గూళ్లను గుడ్లు పెట్టేందుకు, నివాసం ఉండేందుకు అల్లుకుంటాయి. ఇలా నిర్మించే గూళ్లు చూడటానికి చాలా చిన్నవిగా.. అందంగా ఉండటంతోపాటు చాలా దృఢంగా ఉంటాయి. అయితే దక్షిణాఫ్రికాలో సోషల్ వేవర్స్(ఫిలేతైరస్ సోషియస్) అనే పక్షి జాతి ఒకటుంది. ఈ పక్షి కూడా గుడ్లు, తన పిల్లలు నివాసముండేందుకు గూళ్లు నిర్మించుకుంటుంది. అయితే ఈ పక్షి నిర్మించే గూళ్లకు చాలా అంటే.. చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. సాధారణంగా మనం చూసే పక్షి గూళ్ల మాదిరిగా కాకుండా ఇవి పెద్దవిగా ఉంటాయి. ఎంత పెద్దగా అంటే.. ఏ చెట్టుపై అయితే ఈ గూళ్లను నిర్మిస్తాయో ఆ చెట్టును సైతం నేలకు దించేంత పెద్దవిగా, బరువుగా ఉంటాయి. ఒక్కో గూడు బరువు సుమారు టన్నుకుపైగానే ఉంటుంది. 20 అడుగుల వెడల్పు, 10 అడుగుల పొడవుతో సుమారు 100కు పైగా విడివిడి గదులతో చూడటానికి చాలా అద్భుతంగా అనిపిస్తుంది. గూటిలోకి ప్రవేశించే ద్వారాన్ని 10 అంగుళాల పొడవు, అంగుళం వెడల్పు ఉండేలా అల్లుకుంటాయి. ఈ గూళ్లు వందేళ్లు దాటినా కూడా చెక్కు చెదరకుండా పటిష్టంగా ఉంటాయి. ఒకసారి నిర్మించిన గూటినే ఈ జాతి పక్షులు తరతరాలుగా ఉపయోగించుకుంటాయి. ఇంతటి భారీ గూడు నిర్మాణమే పక్షులను ఎండ, వాన, కరువు, ఇతర ప్రకృతి ప్రమాదాల నుంచి తేలికగా కాపాడుతుందని వీటిని సందర్శించిన మియామీ యూనివర్సిటీకి చెందిన బయాలజిస్ట్ గెవిన్ లైటన్ తెలిపారు. -
కిలకిలలు..
జంగారెడ్డిగూడెం రూరల్ :శబ్ద కాలుష్యం, రేడియేషన్ ప్రభావంతో చెట్టుకొకటి, పుట్టకొకటిగా చెల్లాచెదురైపోయిన పిచ్చుకమ్మలు ఇదిగో ఇలా అక్కడక్కడ కనువిందుచేస్తున్నాయి. చావైనా.. బతుకైనా కలిసే అన్నట్టుగా ఒకే చెట్టుకు గూడులల్లుకుని గుంపులుగా జీవిస్తున్నాయి. కిలకిలరావాలతో సందడి చేస్తున్నాయి. జంగారెడ్డిగూడెం మండలం కొంగువారిగూడెం కేకేఎం ఎర్రకాలువ జలాశయం గట్లపై ఇదిగో ఇలా ఆవాసాలు ఏర్పాటు చేసుకుని కనువిందు చేస్తున్నాయి. -
పిట్ట గూడు.. దాని అందం చూడు
వానా కాలం వచ్చేసింది... వర్షం కురిస్తే మానవులు తడవని ప్రాంతానికి వెళ్లి తలదాచుకుంటారు... మరి పక్షులు ఏం చేస్తాయి అంటే... ఇప్పటి పిల్లలు, పట్టణ, నగర ప్రాంతాల్లో పెరిగిన పెద్దలూ టకీమని సమాధానం చెప్పడం కొంత కష్టమే... ఈ చిత్రాలను చూస్తే అర్థమవుతోంది కదూ.. పక్షులు గూళ్లు పెట్టుకుంటున్నాయని.. ఇవే వాటికి ఇళ్లు... వర్షం వస్తే వీటిలోకి వెళ్తాయి... ఇదంతా ఒక కోణం అయితే, మరో కోణంలో పక్షుల గూళ్లు అందంగా ఉంటాయి... చూడ ముచ్చటగా ఉంటాయి... ఇవి పల్లె ప్రాంతాలు, చెట్లు ఎక్కువ ఉన్న చోట్ల విరివిగా ఉంటాయి... సిద్దవటం మండలంలోని మాచుపల్లె పొలాల్లో పిచ్చుకలు గూళ్లు పెట్టుకుంటూ కనిపించాయి... ఈ అపు‘రూప’ దృశ్యాలను ‘సాక్షి’ తన కెమెరాలో గురువారం బంధించింది. - ఫొటోలు : - రమేష్ తీట్ల, సాక్షి, ఫొటో గ్రాఫర్