నెట్లో అశ్లీలతను అడ్డుకుంటాం
ఐటీ చట్టాలనూ కఠినతరం చేస్తాం రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్
సిటీబ్యూరో: మహిళలు, పిల్లలపై పెరుగుతున్న నేరాలను అరికట్టేందుకు ఐటీ చట్టాలను మరింత కఠినతరం చేస్తామని రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్లలో అశ్లీలతను వీలైనంత వరకు తగ్గించాల్సి ఉందన్నారు. ఇందుకోసం ఐటీ నిపుణులు, పోలీసు అధికారులు కృషి చేయాలన్నారు. మహిళలు, పిల్లల భద్రత, రక్షణ చర్యలపై గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో శనివారం ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. హోంశాఖ అదనపు కార్యదర్శి సౌమ్యామిశ్రా, ఐటీ కార్యదర్శి హరిప్రీత్‌సింగ్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, ప్రముఖ ఐటీ నిపుణులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళా భద్రతా కమిటీ చైర్పర్సన్ పూనం మాలకొండయ్య సిఫార్సులను అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
ప్రత్యేక యాప్ ద్వారా నివారణ..
స్మార్ట్ ఫోన్లలో అశ్లీలత వెబ్సైట్లను అరికట్టేందుకు ప్రత్యేక యాప్‌ను రూపొందిస్తున్నామని సైబరాబాద్ సీపీ ఆనంద్ తెలిపారు. ఇందుకు సెల్‌ఫోన్ తయారీదారుల సహాయాన్ని కోరుతున్నామన్నారు. అశ్లీలతను నిరోధించడానికి మీడియాను కూడా భాగస్వామ్యం చేస్తామన్నారు. సమావేశంలో డీసీపీలు రమారాజేశ్వరీ, కార్తీకేయ, ఇన్స్పెక్టర్ రమేశ్‌కుమార్ పాల్గొన్నారు.