కాళహస్తీశ్వరా.. కరుణించు!
శ్రీకాళహస్తి ట్రస్టుబోర్డు చైర్మన్గిరికిచతుర్ముఖ పోటీ
రేసులో బీజేపీ నేతలు
ఆందోళనలో తెలుగు తమ్ముళ్లు
తిరుపతి సిటీ: తెలుగుదేశం ప్రభుత్వం నామినేటెడ్ పదవుల భర్తీకి రంగం సిద్ధం చేసింది. జిల్లాలోని ఆరు దేవాల యాల పాలకమండ ళ్లకు దరఖాస్తులను ఆహ్వానించింది. దీంతో పదవిని ఆశిస్తున్న వారు నేతల ఆశీస్సుల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అన్ని దేవాలయాల పరిస్థితి ఎలా ఉన్నా శ్రీకాళహస్తి ట్రస్టుబోర్డుకు తీవ్రపోటీ ఏర్పడింది. తెలుగుదేశం నుంచే కాకుండా బీజేపీ నాయకులు కూడా ఈ దఫా చైర్మన్ పదవి కోసం పట్టుబట్టే అవకాశం ఉంది. అధ్యక్ష పదవిని ఆశిస్తున్న నేతలు ఇప్పటికే తమప్రయత్నాల్లో మునిగిపోయారు. ఎలాగైనా పదవిని దక్కించుకోవాలనే లక్ష్యంతో ఉన్నారు.
ఇప్పటికే తమ అభిప్రాయాలను నేతల వద్ద ఏకరువు పెట్టారు. ఇంత కాలంగా పార్టీని నమ్ముకుని ఉన్నవారికే ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నారు. అయితే ఇక్కడ తీవ్రపోటీ నెలకొనడంతో పదవులు ఆశిస్త్తున్న వారు ఆందోళనకు గురవుతున్నారు. ఎన్నికల సమయంలో ఒకరికి హామీ ఇచ్చి తీరా నోటిఫికేషన్ వెలువడ్డాక మరొకరి వైపు మొగ్గుచూపుతున్నారంటూ కొందరు టీడీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మొన్నటి వరకు కొండుగారి శ్రీరాంమూర్తి పాలక మండలి చైర్మన్ అంటూ ప్రచారం సాగింది. ఈయన 2005 నుంచి ఈ పదవిని ఆశిస్తున్నారు. అయితే అప్పటి రాజకీయ పరిస్థితుల కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. 2009లో బొజ్జల ఇక్కడి నుంచి గెలవడంతో కచ్చితంగా పాలకమండలి చైర్మన్ అవుతారని భావిం చారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నామినే టెడ్ పదవుల భర్తీకి సుముఖత వ్యక్తం చేయకపోవడంతో శ్రీకాళహస్తి ట్రస్టు బోర్డు అటకెక్కింది. ప్రస్తుతం ప్రభుత్వం పాలకమండళ్ల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వడంతో పోటీలో ఆయన ముందున్నారు.
పార్టీలో సీనియర్ నేతగా ఉన్న పోతుగుంట గురవయ్య నాయుడు కూడా ట్రస్టుబోర్డుపై ఆశలు పెట్టుకున్నారు. పార్టీకి కీలక నేతగా వ్యవహరిస్తున్న ఈయన తొలుత తుడా ఆశించారు. ప్రస్తుత పరిస్థితుల్లో తుడా నియామకం వాయిదా పడడంతో ట్రస్టుబోర్డుపై ఆశలు పెం చుకున్నారు. మున్సిపల్ చైర్మన్గా నామినేషన్ వేసిన సమయంలో పార్టీ తనకు హామీ ఇచ్చిందని అందుకే ట్రస్టుబోర్డు తనకే వరిస్తుందనే ఆశతో ఉన్నారు.
ఇక సిపాయి సుబ్రమణ్యం విషయానికి వస్తే ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. బొజ్జల గెలుపులో ఈయన పాత్ర కూడా ఉంది. దీంతో ఈయన కూడా ట్రస్టుబోర్డుపై ఆశ పెట్టుకొన్నారు.
ఈ ముగ్గురి మధ్య పోటీ నడుస్తుంటే బీజేపీ కూడా శ్రీకాళహస్తి ట్రస్టుబోర్డు తమ పార్టీ వారికే కేటాయించాలని పట్టుబడుతున్నట్టు సమాచారం. జిల్లాలో పార్టీని గ్రామస్థాయికి తీసుకెళ్లాలంటే ఈ పదవి అవసరమని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే శ్రీకాళహస్తి ట్రస్టుబోర్డుకు కోలా ఆనంద్ పేరు తెరమీదకు వచ్చే అవకాశం ఉంది.
దేవాదాయశాఖ మంత్రి బీజేపీకి చెందిన వారు కావడంతో ట్రస్టుబోర్డు నియామకం రసవత్తరంగా మారుతోంది. మొత్తానికి 2010 నుంచి నాయకుల మధ్య సయోధ్య కుదరక పోవడంతో శ్రీకాళహస్తి దేవస్థానం పాలక మండలి వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పుడైనా అందరి మధ్య సయోధ్య కుదిరి పాలన గాడిలో పడుతుందని స్థానికులు భావిస్తున్నారు.