'మన క్రికెటర్లు పూర్తిగా సన్నద్ధం కాలేదు'
టెస్టు క్రికెట్.. బ్యాట్స్మన్, బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తుందని మాజీ క్రికెటర్ వెంకటపతి రాజు అన్నాడు. విజయం సాధించాలంటే ఆటగాళ్లు సహనం కలిగిఉండాలని సూచించాడు. కాగా మన ఆటగాళ్లు టెస్టు క్రికెట్కు తగినంతగా సన్నద్ధం కాలేదని రాజు చెప్పాడు.
వెంకటపతి రాజు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. టెస్టు క్రికెట్లో భారత్ వైఫల్యాలకు గల కారణాలను వెల్లడించాడు. 'సచిన్, ద్రావిడ్, గంగూలీ వంటి దిగ్గజ ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్కు సమయం కేటాయించేవారు. ఈ రోజుల్లో టీమిండియా ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్ తక్కువగా ఆడుతున్నారు. తీరికలేని అంతర్జాతీయ షెడ్యూల్, ఐపీఎల్ దీనికి కారణం కావచ్చు. టెస్టు క్రికెట్ ఆడటంలో ప్రస్తుత భారత జట్టుకు అనుభవం తక్కువ. టీమిండియా ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్కు సమయం కేటాయించేలా బీసీసీఐ దృష్టిసారించాలి' అని వెంకటపతి రాజు అన్నాడు.