old offender arrested
-
పాత నేరస్తుడి నుంచి భారీగా సొత్తు స్వాధీనం
హైదరాబాద్ : జైలు జీవితం గడిపినా తిరిగి చోరీల బాటపట్టిన పాత నేరస్తుడిని ఎల్బీనగర్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. అతని నుంచి రూ.16 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. రాచకొండ కమిషనరేట్ క్రైం అడిషనల్ డీసీపీ జానకితో కలిసి ఎల్బీనగర్ డీసీపీ తఫ్సీర్ ఇక్బాల్ తెలిపిన వివరాలివీ.. గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండలం సొలాస గ్రామానికి చెందిన చెరుకుమల్లి కోటేశ్వరరావు అలియాస్ చెరుకూరి విశ్వనాధ రఘురాం (36) డిగ్రీ వరకు చదువుకున్నాడు. అనంతరం డ్రైవర్‌గా పనిచేస్తూ 1999లో గుంటూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో పలు దొంగతనాలకు పాల్పడి జైలుకెళ్లాడు. 2008లో హైదరాబాద్‌లో పనిచేస్తూ నిజామాబాద్‌కు చెందిన సుచరితను వివాహం చేసుకున్నాడు. వచ్చే డబ్బు సరిపోకపోవడంతో 2013లో హయత్‌నగర్, వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలోని పలు ఇళ్లలో దొంగతనాలకు పాల్పడి మళ్లీ జైలు పాలయ్యాడు. బెయిలుపై వచ్చిన అనంతరం అతను కుటుంబాన్ని గుంటూరుకు తరలించాడు. ప్రతి రోజూ గుంటూరు నుంచి హైదరాబాద్‌కు వచ్చి తాళం వేసిన ఇళ్లను ఎంచుకుని చోరీలకు రాత్రి వేళ దొంగతనాలు చేసుకుని ఉదయాన్నే తిరిగి వెళ్లేవాడు. ఈ క్రమంలో ఎల్బీనగర్, సరూర్‌నగర్, కుషాయిగూడ పోలీస్స్టేషన్ల పరిధిలో రాత్రి వేళల్లో పలు దొంగతనాలకు పాల్పడ్డాడు. ఇతనిపై ప్రత్యేక దృష్టి పెట్టిన ఎల్బీనగర్ సీసీఎస్ పోలీసులు 9వ తేదీన రాత్రి చింతలకుంటలోని శ్రీ బాలాజీ లాడ్జి వద్దకు రాగా మాటు వేసిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో దొంగతనాలను ఒప్పుకున్నాడు. అతని వద్ద నుంచి రూ.52.8 తులాల బంగారు ఆభరణాలు, 650 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. -
పాతనేరస్తుడు అరెస్టు
పీఎంపాలెం : ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడుతున్న దొంగను పీఎం పాలెం పోలీసులు అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఎండాడ ఏసీపీ కార్యాలయంలో ఏసీపీ దాసరి రవిబాబు శనివారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. సాలూరు మండలం మామిడిపల్లికి చెందిన చేబ్రోలు విజయకుమార్ ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడి పలుమార్లు జైలు శిక్ష అనుభవించాడు. కొంతకాలం పోలీస్ ఇన్ఫార్మర్గా కూడా పనిచేశాడు. పీఎం పాలెం ప్రాంతంలో ఇటీవల జరిగిన దొంగతనాల దర్యాప్తులో భాగంగా సీఐ అప్పలరాజు ప్రత్యేక బృందాన్ని నియమించారు. శనివారం ఉదయం కొమ్మాది కూడలి వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న విజయకుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో పీఎంపాలెం, ఎంవీపీ జోన్, ఆరిలోవ ప్రాంతాల్లో పలు ఇళ్లల్లో దొంగతనాలు చేసినట్టు అంగీకరించాడు. అతని వద్ద నుంచి నాలుగున్నర కిలోల వెండి వస్తువులు, 45 గ్రాముల బంగారు ఆభరణాలు, సెల్‌ఫోన్, కెమెరాను స్వాధీనం చేసుకున్నారు. నేరస్తుడ్ని పట్టుకున్న క్రైమ్ ఎస్ఐ రామకృష్ణ, హెచ్‌సీ సత్యనారాయణ, సిబ్బందిని ఏసీపీ అభినందించారు.