పథకం గొప్ప.. ఫలితం దిబ్బ
► సత్ఫలితాలివ్వని డిజిటల్ సిటిజన్ సర్వీసెస్
► ప్రచార లోపమే ప్రధాన కారణం
► గ్రామీణ పౌరులకు అందని సేవలు
పల్లెలు దేశ ప్రగతికి పట్టుగొమ్మలు. అలాంటి పల్లె వాసులకు సేవలు అందించడానికి డిజిటల్ సిటిజన్ సర్వీసెస్ పథకాన్ని ప్రారంభించారు. దీనికి సరైన ప్రచారం కల్పించకపోవడంతో ఆశించిన ఫలితం ఇవ్వడం లేదు. ఒకటి, రెండు మినహా మిగిలిన సేవలు అందని ద్రాక్షగానే మారాయి.
చిత్తూరు (కార్పొరేషన్): పంచాయతీల్లో ఆన్లైన్ పౌరసేవలు అందించేందుకు ప్రభుత్వం డిజిటల్ సిటిజన్ సర్వీసెస్ పథకాన్ని ప్రారంభించింది. దీని ద్వారా భవన అనుమతులు, ఇంటి పన్నులు, మ్యూటేషన్ (పేర్లు మార్పు), లే అవుట్ల అనుమతి, వివాహ ధ్రువీకరణ పత్రాలు, ఎన్వోసీ, ఆస్తి విలువ, ట్రేడ్ లెసైన్స్, ప్రయివేటు కొళాయి కనెక్షన్స్, ప్రాపర్టీ వాల్యుయేషన్ ఇలా 9 రకాల సేవలను ఆన్లైన్ ద్వారా ఇవ్వడానికి ఈ విధానం ప్రవేశపెట్టారు. జిల్లాలో మొదటి విడతగా 33 మండలాల పరిధిలోని పంచాయతీల్లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు.
అయితే దీని గురించి తగిన స్థాయిలో ప్రచారం చేయలేదు. కేవలం 20 నుంచి 30 శాతం మంది పౌరులకు మాత్రమే దీని గురించి తెలుసు అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 70 నుంచి 80 శాతం మందికి ఇలాంటిది ఒకటి ఉంది అని తెలియకపోవడంతో ఆ సేవలు ఆశించిన స్థాయిలో ఉపయోగంలోకి రావడం లేదు. హౌస్ ట్యాక్స్, బిల్డింగ్ అనుమతులు, లే అవుట్లు మినహా మిగిలిన సేవలు ఆశించిన స్థాయిలో అందడం లేదు.