‘ఉస్మానియా’ తరలింపు మళ్లీ మొదటికి
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రి పాత భవనంలోని రోగుల తరలింపు వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది. ముందస్తు ప్రణాళిక లేకుండా ఆగమేఘాల మీద రోగుల తరలింపు ప్రక్రియను చేపట్టిన ప్రభుత్వం తీరా కొంత మంది వైద్యులు, రోగుల నుంచి తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం కావడంతో మళ్లీ పునరాలోచనలో పడింది. తాజాగా శుక్రవారం మంత్రి సి.లక్ష్మారెడ్డి ఉస్మానియాకు వచ్చిన వైద్యాధికారులతో విస్తృతంగా చర్చించారు. సుల్తాన్ బజార్ ప్రసూతి ఆస్పత్రి వైద్యుల నుంచి నిరసన వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఆ ఆస్పత్రిని అక్కడి నుంచి పేట్లబురుజుకు తరలించకపోవడమే మంచిదనే భావనకు వచ్చినట్లు తెలిసింది.
అయితే పాత భవనంలోని రోగులను పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రి మూడు, నాలుగో అంతస్తుకు తరలించాలా? లేక ప్రస్తుత ఓపీ బ్లాక్‌లోనే సర్దుబాటు చేయా లా? అంశంపై తర్జన భర్జన పడుతున్నారు.
సూపర్‌స్పెషాలిటీ విభాగాలపై చర్చ...
ఆస్పత్రికి అవుట్ పేషంట్ విభాగానికి ప్రతి రోజూ 1500-2000 మంది రోగులు వస్తుంటారు. వీరిలో 90 శాతం మంది రోగులు జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్ బాధితులే. కేవలం 10 శాతం మంది మాత్రమే సూపర్ స్పెషాలిటీ బాధితులు ఉంటారు. రోగుల ఒత్తిడి ఎక్కువగా ఉన్న జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్ విభాగాలను ఓపీ బ్లాక్, కులీకుతుబ్‌షా బ్లాక్‌లో సర్దుబాటు చేసి, అక్కడ ఉన్న బర్నింగ్ వార్డు సహా నెఫ్రాలజీ, పాథాలజీ, కార్డియాలజీ విభాగాలను తరలిస్తే ఎలా ఉంటుందనే ప్రతిపాదన కూడా వచ్చింది. భవిష్యత్తులో వైద్యుల మధ్య విభేదాలు తలెత్తకుండా ఉండేందుకు ఆయా విభాగాల వైద్యులను సంప్రదించి వారీ అంగీకారం మేరకు నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది.
భారీగా తగ్గిన ఓపీ రోగులు
ఉస్మానియా తరలింపు నేపథ్యంలో ఆస్పత్రి అవుట్ పేషంట్ విభాగానికి వస్తున్న రోగుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. సాధారణ రోజుల్లో ప్రతి రోజూ 1500-2000 మంది రోగులు వస్తే.. ప్రస్తుతం ఆ సంఖ్య 700-800కు తగ్గింది. ఇన్‌పేషంట్ల సంఖ్య కూడా బాగా తగ్గింది. తరలింపుపై వైద్యుల మధ్య భేదాభిప్రాయాలు తలెత్తడంతో ఈ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేయడం కొసమెరుపు.