క్యాబ్ డ్రైవర్‌గా మారిన కంపెనీ సీఈవో!
ఒకప్పుడు అతను ఓ ప్రముఖ కంపెనీ సీఈవోగా ఉన్నాడు. అయితే ఇప్పుడు మాత్రం ఉబర్ క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. బండ్లు ఓడలు.. ఓడలు బండ్లవడం అంటే ఇదేనేమో అనుకోకండి. అతనేమీ బిజినెస్‌లో నష్టపోయి క్యాబ్ డ్రైవర్‌గా పనిచేయటం లేదు. మరో కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడానికి కావాల్సిన బ్యాక్‌గ్రౌండ్ రెడీ చేసుకుంటున్నాడంతే.
ఫ్లైట్లకు సంబంధించిన సమాచారంతో పాటు విహార యాత్రలకు సంబంధించిన.. హోటల్స్ తదితర సేవలు అందించే 'కాయక్' వెబ్సైట్ కో ఫౌండర్ పాల్ ఇంగ్లిష్.. 2012లో సుమారు 1400 కోట్లకు కాయక్‌ను ప్రిన్స్లైన్ సంస్థకు అమ్మేశాడు. ఆ తరువాత ఉబర్ సంస్థలో క్యాబ్ డ్రైవర్‌గా చేరాడు. అయితే క్యాబ్ డ్రైవర్ డ్రెస్‌లో ఉన్నా ఇంగ్లిష్‌ను మాత్రం కస్టమర్లు ఈజీగానే గుర్తుపడుతున్నారట. అంతేకాదు.. క్యాబ్ డ్రైవర్‌గా కస్టమర్లకు ఎంత బాగా సేవలందించినా ఫైవ్ స్టార్ రేటింగ్ రాలేదని వాపోతున్నాడు. 4.97 స్టార్ రేటింగ్ క్యాబ్ డ్రైవర్‌గా ఉన్న ఇంగ్లిష్.. తనకు ఫైవ్ స్టార్ రేటింగ్ ఇవ్వని కస్టమర్ ఎందుకు అసంతృప్తితో ఉన్నాడా అని ఆలోచిస్తున్నాడట.
పాల్ ఇంగ్లిష్ ఇటీవలే ఓ కొత్త సంస్థను ప్రారంభించారు. లోలా పేరుతో ప్రారంభించిన ఆ వెంచర్లో ట్రావెల్ బుకింగ్ సేవలను అందుబాటులోకి తెచ్చారు. ట్రావెల్ బుకింగ్ విధానాన్ని సులభతరం చేసేందుకు లోలా ఉపయోగపడుతోందని ఇంగ్లిష్ వెల్లడించారు. దీని కోసం ఇంగ్లిష్ స్వయంగా క్యాబ్ డ్రైవర్ అవతారం ఎత్తి మరీ వినియోగదారుల అభిప్రాయాలను తెలుసుకోవడానికి ప్రాజెక్ట్ వర్క్ చేశాడన్నమాట.