81 బస్తాల పప్పుశనగ పట్టివేత
రాజకీయ ఒత్తిళ్లతో వదిలేసిన వైనం
పామిడి:
మండలంలోని ఓబుళాపురంలో టీడీపీకి చెందిన వెంకటేశు అనే వ్యక్తి ఇంట్లో అక్రమంగా దాచి ఉంచిన 81 బస్తాల విత్తన పప్పుశనగను సోమవారం మండల వ్యవసాయాధికారి మల్లీశ్వరి గుర్తించారు.
వీటిని అధికార పార్టీకి చెందిన గుంతకల్లు మండల స్థాయి ప్రజాప్రతినిధి ఒకరు అక్రమంగా దాచి ఉంచారని తెలుస్తోంది. విత్తనాన్ని సీజ్ చేశారన్న విషయం వెలుగు చూడడంతో అధికార పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగారు. నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధి కూడా ఫోన్ చేశారని తెలిసింది. దీంతో అధికారులు పట్టుబడిన విత్తనం రైతులదని ప్రకటించారు. ఏఓ మల్లీశ్వరి మాట్లాడుతూ స్వాధీనం చేసుకున్న బస్తాలు తమవేనని రైతులు తెలిపారన్నారు. స్థలాభావంతో అక్కడ నిల్వ ఉంచినట్లు రాతపూర్వకంగా తెలిపారన్నారు. దీంతో పప్పుశనగ బస్తాలను తిరిగి అప్పగించామన్నారు. ఎస్ఐ రవిశంకర్రెడ్డిని విచారించగా.. ఏఓ సమాచారం మేరకు ఓబుళాపురానికి పోలీసులను పంపినట్లు చెప్పారు. అంతకుమించి తనకేమీ తెలియదన్నారు. ఈ వ్యవహారం ఏఓకు సంబంధించిన విషయమని ఆయన దాటవేశారు.