pedestrian
-
మూగజీవి సమయస్ఫూర్తి.. మనిషిని ఎలా సాయమడిగిందో చూడండి..
జన సంచారం తక్కువగా ఉన్న ఒక వంతెన పైన రెండు కుక్కలు ఆడుకుంటూ ఉండగా ఒక కుక్క పొరపాటున పక్కనే ఉన్న సంపులో పడిపోయింది. దీంతో రెండో కుక్కకు ఏమి చెయ్యాలో పాలుపోక, తన సోదరుడిని ఎలా కాపాడుకోవాలో అర్ధం కాక సహాయం కోసం చుట్టూ చూసింది. సంయమనంతో అలోచించి సమయస్ఫూర్తితో వ్యవహరించి ఓ మనిషిని సాయం కోరింది. అటుగా వెళ్తోన్న ఒక వ్యక్తిని అడ్డుకుని మొరుగుతూ.. తోక ఆడిస్తూ.. తన సమస్యని చెప్పే ప్రయత్నం చేసింది ఆ శునకం. మొదట అదేమీ పట్టించుకోని ఆ వ్యక్తి అలాగే ముందుకు నడుచుకుంటూ పోతుండగా ఆ కుక్క మాత్రం పట్టిన పట్టు విడవకుండా అతడిని వెంబడించింది. దీంతో ఎదో జరిగిందని గ్రహించిన ఆ వ్యక్తి అక్కడే ఆగి వెనక్కు చూశాడు. వెంటనే ఆ కుక్క అతడిని ఆ సంపు వద్దకు తీసుకుని వెళ్లగా మానవత్వంతో ప్రమాదంలో చిక్కుకున్న కుక్కని బయటకు తీసి రక్షించాడు. అనంతరం సంపు పైన మూతను అమర్చి తన దారిన వెళ్తున్న ఆ వ్యక్తిని రెండు కుక్కలు కృతఙ్ఞతలు చెబుతూ వెంబడించాయి. థాంక్ యూ మనిషి.. ఈ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి.. "తన సోదరుడిని కాపాడుకునేందుకు మనిషి సాయం కోరిన కుక్క.. మీరు చేసిన సహాయానికి కృతఙ్ఞతలు.. థాంక్ యూ మనిషి.. " అని మూగజీవాల ధృక్కోణంలో కృతఙ్ఞతలు తెలిపాడు. ఈ వీడియోకి సోషల్ మీడియాలో విశేష స్పందన లభిస్తోంది. Dog seeks help from a random person to rescue his brother. They were happy and grateful for the help. Thank you, hooman...🙏❤️ pic.twitter.com/v0FHIIgZXd — 𝕐o̴g̴ (@Yoda4ever) June 30, 2023 ఇది కూడా చదవండి: వాగ్నర్ గ్రూపులోని 21000 మందిని మట్టుబెట్టాం.. జెలెన్స్కీ -
పాదచారీ.. నీకో దారి!
సాక్షి, సిటీబ్యూరో: రోడ్డు దాటే సమయంలో పాదచారులు ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు నిర్మించ తలపెట్టిన ఫుట్ ఓవర్ బ్రిడ్జిల్లో (ఎఫ్ఓబీ) అయిదింటిని త్వరలో ప్రారంభించేందుకు రంగం సిద్ధమైంది. వీటి అంచనా వ్యయం దాదాపు రూ.16 కోట్లు. వీటిలో రెండింటికి ఎస్కలేటర్ల సదుపాయం కూడా ఉంది. ఇవి వినియోగంలోకి వస్తే రోడ్డు దాటేందుకు పాదచారుల బాధలు తప్పుతాయి. అయిదు ఎఫ్‌ఓబీల్లో పంజగుట్ట హైదరాబాద్ సెంట్రల్‌మాల్, సికింద్రాబాద్ సెయింట్‌ఆన్స్ స్కూల్‌వద్ద నిర్మించినవి ఎస్కలేటర్లు కలిగి ఉన్నాయి. ఈ రెండింటిని బహుశా వారం రోజుల్లో ప్రారంభించే అవకాశం ఉందని జీహెచ్ఎంసీ ఈఎన్సీ జియావుద్దీన్ తెలిపారు. వీటితోపాటు నేరేడ్మెట్ బస్టాప్, రాజేంద్రనగర్ సర్కిల్లోని స్వప్న థియేటర్, బాలానగర్‌లో మరో మూడు ఎఫ్ఓబీల పనులు పూర్తయ్యాయన్నారు. ఎర్రగడ్డ ఈఎస్ఐ హాస్పిటల్ దగ్గరి ఎఫ్ఓబీ పనులు తుదిదశలో ఉన్నాయని తెలిపారు. నగరంలో ప్రధాన రహదారుల మార్గాల్లో రోడ్లు దాటేందుకు అవస్థలు పడుతున్న పాదచారుల ఇబ్బందులు తొలగించేందుకు వంద ప్రాంతాల్లో ఎఫ్‌ఓబీలు నిర్మించాలనుకున్నప్పటికీ, అంతిమంగా ఇరవై ప్రాంతాల్లో పనులు చేపట్టగా, ఇప్పటికే రెండు అందుబాటులోకి వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. మిగతావి వివిధ దశల్లో ఉన్నాయి. నగరంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో పాదచారులు ఎక్కువగా క్షతగాత్రులవుతున్నారు. ఒక స్వచ్ఛందసంస్థ అధ్యయనం మేరకు రోడ్డు ప్రమాదాల్లో 52 శాతం రోడ్లు దాటుతుండగా జరిగినవే. ఎఫ్‌ఓబీలతో ఈ ప్రమాదాలు తగ్గగలవన్నారు. పురోగతిలో పనులు.. కూకట్పల్లి జోన్ రంగభుజంగ థియేటర్, ఖైరతాబాద్ జోన్లో బంజారాహిల్స్‌లోని జీవీకే వన్, ఎల్బీనగర్ జోన్లో సరూర్‌నగర్ స్టేడియం, దిల్సుఖ్నగర్ బస్టాప్, మల్లాపూర్ నోమా ఫంక్షన్ హాల్, చార్మినార్ జోన్లో శాలిమార్ హోటల్, రక్షాపురం క్రాస్‌రోడ్స్, శేరిలింగంపల్లి జోన్లో ఖాజాగూడ జంక్షన్ తదితర ప్రాంతాల్లో ఎఫ్ఓబీల పనులు పురోగతిలో ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. -
ఇక రోడ్లపై పాదచారులకు ప్రాధాన్యత
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్ కారణంగా కేంద్ర ప్రభుత్వం ఓ విషయాన్ని స్పష్టంగా తెలుసుకుంది. వీధులన్నీ కాలుష్యం వాయువులతో ఎలా కమ్ముకుపోతున్నాయో, అలాంటి కాలుష్యాన్ని నివారించాల్సిన అవసరం ఉందన్న విషయంలో కేంద్రానికి స్పష్టత వచ్చింది. పట్టణాల్లో పాదచారులకు, సైకిళ్లకు మరిన్ని సదుపాయాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రతి నగరం, పట్టణంలో పాదచారులకు అనువుగా ఉండేటట్లు కనీసం మూడు మార్కెట్లను అభివృద్ధి చేయాలని, అందుకు రోడ్లపై తగిన ఫుట్‌పాత్‌లు ఉండాలని, సైకిళ్ల కోసం పట్టణాలు, నగరాల్లో మరిన్ని సైకిల్ ట్రాక్‌లు నిర్మించాలని గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి వ్యవహారాల శాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది. వీటికి సంబంధించి అభివృద్ధి చేయాల్సిన చెరువులను జూన్ 30వ తేదీ నాటికి గుర్తించాలని, అక్టోబర్ ఒకటవ తేదీ నుంచి పనులను పారంభించాలని మంత్రిత్వ శాఖ సూచించింది. (‘బాయ్ కాట్ చైనా’ సాధ్యమేనా?) వీధులను ప్రజలకు అనువైన విధంగా మార్చడానికి కరోనా సమయమే సానుకూలమని మంత్రిత్వ శాఖ కార్యదర్శి దుర్గా శంకర్ మిశ్రా వ్యాఖ్యానించారు. ప్రపంచ వ్యాప్తంగా లాక్డౌన్ సమయాన్ని ఉపయోగించుకొని ఫుట్‌పాత్‌లను, సైకిల్ వేలను అభివృద్ధి చేస్తున్నాయి. ‘వరల్డ్ ఏర్ క్వాలిటీ రిపోర్ట్’ ప్రకారం ప్రపంచంలోని పది కాలుష్య నగరాలు భారత్‌లోనే ఉన్నాయి. ఈ కారణంగా రోడ్ల విస్తరణకు, వాహనాల కుదింపునకు భారత ప్రభుత్వం ఎక్కువ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. (భారత్- చైనా సరిహద్దు ‘చిచ్చు’కు కారణం?) -
భోజనం కోసం ప్రతిరోజూ 25 కిలోమీటర్లు..
పిఠాపురం: కూటి కోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు.. ఒకరిపై ఆధార పడకూడదనుకున్న వారు తమ కాళ్లపై తాము నిలబడి బతికున్నంత కాలం తనకు వచ్చిన రీతిలో పొట్ట నింపుకుంటారు. ఆ కోవకే చెందిన వాడే కొత్తపల్లి మండలం ఉప్పాడకు చెందిన పెంకే రామకృష్ణ (70). ఆయన కుటుంబం పూర్వం చాలా ఉన్నత కుటుంబమైనా కాలగర్భంలో ఆస్తులన్ని కరిగిపోగా కన్నవారు ఉన్న వారు దూరమవ్వడంతో రామకృష్ణ ఒంటరిగా మిగిలి పోయాడు. తోబుట్టువులున్నా ఎవరి దారి వారు చూసుకోగా అవివాహితుడిగా ఉండిపోయిన రామకృష్ణ కాయకష్టం చేసుకుని జీవించేవాడు. స్థానికంగా ఖాళీగా ఉండే అరుగులే ఆయన నివాస స్థావరాలు. కాగా చిన్న చిన్న పనులు చేస్తు వచ్చిన దానితో పొట్ట నింపుకునే ఆయనకు అన్నదాతగా పిఠాపురంలోని గోపాల్‌బాబా ఆశ్రమం ఆసరాగా నిలిచింది. సుమారు పదేళ్ల క్రితం ఇక్కడ ఆశ్రమం స్థాపించిన నాటి నుంచి ఇక్కడ జరిగే ఉచిత అన్నదానంకు రామకృష్ణ వెళ్లడం ప్రారంభించాడు. ఉప్పాడ నుంచి పన్నెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న పిఠాపురంలో గోపాల్‌బాబా ఆశ్రమానికి ఆయన ప్రతిరోజు నడిచి వెళ్లి భోజనం చేసి తిరిగి నడిచి ఉప్పాడ చేరుకుంటుండడం నిత్యకృత్యంగా మారింది. ఉదయం ఆరు గంటలకు ఉప్పాడలో టీ తాగి చిన్న చేతి కర్ర సాయంతో కాలి నడకన బయలు దేరే మధ్యాహా్ననికి పిఠాపురం చేరుకుని ఆశ్రమంలో భోజనం చేసి మళ్లీ కాలి నడకన సాయంత్రానికి ఉప్పాడ చేరుకుని ఒక అరుగుపై రాత్రి బస చేస్తుంటాడు. రోజూ అంత దూరం నడిచే బదులు ఆశ్రమంలోనే తలదాచుకోవచ్చు కదా అని ఎవరైనా అడిగితే సాయంత్రానికి తన పుట్టిన ఊరు చేరుకోపోతే తనకు నిద్ర పట్టదంటూ చెప్పడం విశేషం. ఎంత ఎండ కాసినా వర్షం వచ్చినా అతని కాలినడక మాత్రం ఆగదు. ఇదో రకం జీవన పోరాటం. -
బాటసారికి బాసట!
సాక్షి, సిటీబ్యూరో: ‘పెడస్ట్రియన్ ఈజ్ కింగ్ ఆఫ్ ది రోడ్’ ఈ అంతర్జాతీయ నానుడి నగరంలో మాత్రం అమలు కావట్లేదు. పాదచారులను ఎవరూ ‘పట్టించుకోకపోవడంతో’ నిత్యం ప్రమాదాల బారినపడుతున్నారు. నగరంలో ఏటా రోడ్డు ప్రమాదాల్లో మరణించే వారిలో పాదచారులది రెండో స్థానం. గత ఏడాది నగరంలో జరిగిన ప్రమాదాల్లో బాధితులుగా మారిన వారిలో పాదచారులు 36 శాతానికి పైగా ఉన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని నగర ట్రాఫిక్ చీఫ్ అనిల్‌కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పాదచారులతో పాటు వారి హక్కులపై వాహనచోదకుల్లోనూ అవగాహన పెంపొందించడానికి చర్యలు తీసుకోనున్నారు. ఇందులో భాగంగా మొట్టమొదటిసారిగా ‘పెడస్ట్రియన్ అవేర్నెస్ వీక్’ పేరిట ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. త్వరలో వీటిని ప్రారంభించనున్నట్లు సిటీ ట్రాఫిక్ అదనపు కమిషనర్ అనిల్‌కుమార్ ‘సాక్షి’కి తెలిపారు. ఏటా పదుల సంఖ్యలో మృత్యువాత... నగర ట్రాఫిక్ పోలీసులు ఏటా ప్రమాదాలపై విశ్లేషణ జరుపుతారు. ప్రమాదాలకు కారణమవుతున్న వాహనాలు, బాధితులుగా/మృతులుగా మారుతున్న వారిపై గణాంకాల ఆధారంగా జాబితాలు రూపొందిస్తారు. 2018 గణాంకాల మేరకు నగరంలో చోటు చేసుకున్న ప్రమాదాలు రెండు వేలకు పైనే ఉన్నాయి. రోడ్డు ప్రమాదాల్లో బాధితులుగా మారుతున్న వారిలో ద్విచక్ర వాహనచోదకులు తొలిస్థానంలో ఉండగా... రెండో స్థానం పాదచారులదే. గత కొన్నేళ్లుగా నమోదైన గణాంకాల్లోనూ రోడ్డు ప్రమాద బాధితుల్లో పాదచారులే ఎక్కువగా ఉన్నారు. సిటీలో గత ఏడాది మొత్తం 2540 ప్రమాదాలు చోటు చేసుకోగా... 2550 మంది బాధితులుగా మారారు. వీటిలో ప్రమాదాలబారిన పడిన పాదచారుల సంఖ్య 924 మంది. మొత్తమ్మీద రోడ్డు ప్రమాద బాధితుల్లో 36 శాతం, మృతుల్లో 43 శాతం పాదచారులే ఉంటున్నారని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. నిబంధనలు, చట్టంపై అవగాహన... పెడస్ట్రియన్ అవేర్నెస్ వీక్‌లో భాగంగా అందరిలో అవగాహన పెంచడానికి ప్రాధాన్యం ఇవ్వాలని ట్రాఫిక్ చీఫ్ భావిస్తున్నారు. పాదచారుల భద్రతకు పెద్దపీట వేస్తూ చట్టంలోనే కొన్ని కఠిన నిర్ణయాలు ఉన్నాయి. సాధారణ పరిస్థితుల్లో వాహనం నడుపుతూ ఎక్కడైనా పాదచారిని ఢీ కొంటే అది బెయిలబుల్ కేసు. ఇలాంటి ప్రమాదాల్లో పోలీసులు స్టేషన్ నుంచే జామీనుపై పంపే అవకాశం ఉంటుంది. అదే జీబ్రా క్రాసింగ్‌పై పాదచారిని ఢీ కొన్న కేసుల్ని నాన్–బెయిలబుల్‌గా చట్టం పరిగణిస్తుంది. ఇలాంటి విషయాలు అనేక మంది వాహనచోదకులకు తెలియవు. ఫలితంగానే సిగ్నల్ వద్ద రెడ్‌లైట్ పడినప్పుడు, పాదచారులు జీబ్రా క్రాసింగ్ ద్వారా రోడ్డు దాటుతున్నప్పుడు దూసుకుపోతుంటారు. ఇలాంటి క్లిష్టమైన నిబంధనలు, చట్టాలపై అవగాహన కల్పించేందుకు ఈ అవేర్నెస్ వీక్‌లో ప్రాధాన్యం ఇవ్వనున్నారు. వాహనచోదకులతో పాటు ఫుట్‌పాత్‌లను ఆక్రమిస్తున్న చిరు వ్యాపారాలు, బడా మాల్స్ తదితర వ్యాపార సంస్థలకూ ఫుట్‌పాత్ ఉద్దేశం, వాటిని ఆక్రమిస్తే తీసుకు నే చర్యలపై ప్రచారం చేయాలని నిర్ణయించారు. పాదచారులకూ సూచనలు... సిటీలో పాదచారులకు అవసరమైన మౌళిక వసతుల కొరత ఉన్నది వాస్తవమేనని పోలీసులే అంగీకరిస్తున్నారు. జనాభాకు అవసరమైన స్థాయిలో కాలిబాటలు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, సబ్–వేలు, పెలికాన్ సిగ్నల్స్ లేనప్పటికీ ఉన్న వాటినీ పాదచారులు వినియోగించుకోవట్లేదని అధికారులు భావిస్తున్నారు. ఈ అవేర్నెస్ వీక్‌లో భాగంగా ఫుట్‌పాత్‌లు కేవలం పాదచారులు నడవడానికి మాత్రమే అనే దానిపై పెడస్ట్రియన్స్కూ అవగాహన కల్పించడంతో పాటు అది కచ్చితంగా అమలు అయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. పెడస్ట్రియన్లు సైతం ఎక్కడపడితే అక్కడ రోడ్డు దాటేందుకు ప్రయత్నించి ప్రమాదాల బారినపడకుండా చేయాలని యోచిస్తున్నారు. రోడ్డు దాటేందుకు జీబ్రా క్రాసింగ్స్ లేదా పెలికాన్ సిగ్నల్స్ ఉన్న ప్రాంతాలనే ఎంచుకునేలా ప్రచారం చేయనున్నారు. ఐటీఎంఎస్ ప్రాజెక్టులో భాగంగా పాదచారుల కోసం సిగ్నలింగ్ వ్యవస్థలో అందుబాటులోకి వస్తున్న విధానం, ఇప్పటికే అందుబాటులో ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌ల వినియోగం తదితరాల పై అవగాహన కల్పించనున్నారు. పాదచారుల భద్రతే లక్ష్యం ఏటా నగరంలో చోటు చేసుకుంటున్న రోడ్డు ప్రమాదాల్లో బాధితులుగా మారుతున్న పాదచారుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. జీహెచ్ఎంసీ అధికారుల సహకారంతో ఇప్పటికే కొన్ని కీలక చర్యలు తీసుకోవడం ద్వారా రోడ్డు ప్రమాదాల్లో పాదచారుల మరణాలను కొంత వరకు తగ్గించగలిగాం. సిటీలో వీలున్నంత వరకు పెడస్ట్రియన్ యాక్సిడెంట్స్ లేకుండా చేయాలని నిర్ణయించాం. ఇందులో భాగంగానే అవేర్నెస్ వీక్ నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నాం. దీని విధి విధానాలను మరో వారంలో ఖరారు చేసిత్వరలో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నాం. – అనిల్‌కుమార్, సిటీ ట్రాఫిక్ చీఫ్ -
2 గంటలు.. 5 కిలోమీటర్లు..
సిద్దిపేట జోన్: ఉదయం ఆరు గంటల సమయం.. ఇంకా చీకటి తెరలు తొలగిపోలేదు.. అంతలో మూడు వాహనాలు రాజీవ్ రహదారి పక్కన ఉన్న చెట్ల మధ్యకు దూసుకెళ్లాయి. వాహనంలో నుంచి దిగిన నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు అక్కడి నుంచి 2 గంటల పాటు 5 కిలోమీటర్ల మేర కాలినడకన ముందుకు సాగారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం సిద్దిపేట పట్టణం నాగులబండ శివారులో ఏర్పాటు చేస్తున్న అర్బన్ పార్క్‌ను పరిశీలించారు. నిధుల అవసరం, మొక్కల పెంపకంపై ఆయన వెంట వెంటనున్న డీఎఫ్‌వో శ్రీధర్‌రావును అడిగి తెలుసుకున్నారు. ఆక్సిజన్ పార్క్, అర్బన్ పార్క్ పనులపై ఆరా తీశారు. -
పాదచారిని బెదిరించి నగదు దోపిడి
శంషాబాద్: రంగారెడ్డిజిల్లా శంషాబాద్ ఎయిర్‌పోర్టు పోలీసు స్టేషన్ పరిధిలోని గగన్‌పహాడ్‌లో ఓ వ్యక్తిని దుండగులు కత్తులతో బెదిరించి నగదు దోచుకెళ్లారు. నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని రెండు బైకులపై వచ్చిన గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు కత్తులతో బెదిరించారు. అతని వద్ద ఉన్న రూ.8,500 నగదు, సెల్‌ఫోన్‌ను ఎత్తుకెళ్లారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ప్రాంతంలో దుండగుల ఆగడాలు పెరిగిపోతున్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. బాధితుడు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. -
పోకేమాన్ ఆడుతూ గుద్దేశాడు
టోక్యో: పోకేమాన్ వీడియో గేమ్ పిచ్చి ముదిరిపోతోంది. పోకేమాన్ గేమ్ ఆడుతూ జపాన్ లో ఓ ట్రక్కు డ్రైవర్ మహిళ మరణానికి కారకుడయ్యాడు. పోకేమాన్ గేమ్ లో మునిగిపోయి నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి తన వాహనంతో ఇద్దరు మహిళలను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఓ మహిళ మరణించగా, మరొకరికి గాయాలయ్యాయి. డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నట్టు తుకుషిమా పోలీసు అధికార ప్రతినిధి తెలిపారు. మృతురాలి కుటుంబానికి నింటెండో సంస్థ సంతాపం తెలిపింది. వినియోగదారులు పోకేమాన్ వీడియో గేమ్ ఆడేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. డ్రైవింగ్ లో ఉన్నప్పుడు గేమ్ ఆడకుండా ఉండేందుకు పాప్-అప్ ను జోడించనున్నట్టు వెల్లడించారు. పోకేమాన్ గేమ్ కారణంగా ప్రమాదాలు పెరుగుతుండం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో పలు దేశాలు పోకేమాన్ ఆడొద్దంటూ హెచ్చరికలు జారీ చేశాయి. -
కాల ‘చక్రం’ గిర్రున తిరిగింది...
‘ఏమండీ రేపు ఊరెళదాం,అని పెళ్లాం’ అంటే బస్సా? రైలా? కార్లో వెళదామా అని ఆలోచిస్తాం. కానీ అప్పట్లో కాశీకి పోవాలన్నా మనోళ్లు నడిచే వెళ్లేవారు! అమ్మో అంత దూరం.. అదీ నడిచా? అని మనం ఇప్పుడు నోరెళ్లబెట్టొచ్చేమోగాని.. అప్పట్లో విమానాలు, రైళ్లు, కార్లు సామాన్యులకు అందుబాటులో ఉండేవి కావు. చాలా మంది దగ్గర సైకిళ్లు ఉంటే.. కొంత మంది దగ్గర గుర్రపు బగ్గీలు, ఎద్దుల బళ్లు, మోటార్ సైకిళ్లు ఉండేవి. బాగా ధనవంతులు మాత్రమే కార్లలో, రైళ్లలో తిరిగేవారు. ఇక విమానాలంటే మామూలు మాట కాదు!! ♦ నిజానికి అప్పట్లో కొందరు కారు ఉన్నా కూడా ఎక్కువ దూరం పోవాలంటే నడిచే వెళ్లేవారు. కారణంపెట్రోలు ఇప్పటిలా ఎక్కడబడితే అక్కడ దొరికేది కాదు! అయితే దేశం మొత్తాన్నీ కాలినడకనే చుట్టివచ్చిన వారూ ఉన్నారు. ♦ నడక తర్వాత అందరూ ఎక్కువగా ఉపయోగించేది సైకిలే! ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడా సైకిల్‌కు లెసైన్స్ లేకపోవచ్చేమోగాని.. అప్పట్లో సైకిల్‌కు లెసైన్సు ఉండేదని, అలాగే సైకిల్‌కు లైటు లేకపోతే పోలీసులు ఫైన్ వేసేవారని తెలిస్తే ఆశ్చర్యపోక తప్పదు మరి! ♦ అప్పట్లో సైకిల్ సామాన్యుడి వాహనమైతే.. ఇప్పుడు శ్రీమంతుడి వాహనం కూడా! అదే కొత్త ఛేంజ్! ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ నడవడమో, సైకిల్ తొక్కడమో చేయాల్సిందేనని డాక్టర్లు చెబుతుంటే అందరూ మళ్లీ ఫ్లాష్ బ్యాక్ ‘చక్రాల్లోకి’ వెళ్లక తప్పడం లేదు. ♦ ఇక స్కూటర్ల విషయానికొస్తే అప్పట్లో బజాజ్, రాయల్ ఎన్ఫీల్డ్ వంటివి ప్రధానంగా అందుబాటులో ఉండేవి. ♦ ఇక తాజాగా వచ్చిన బ్యాలెన్సింగ్ స్కూటర్ చూశారా? జూనియర్ ఎన్టీఆర్ ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలో రెండు చక్రాల బుల్లి వాహనంపై తిరుగుతూ ఉన్నాడే అదే! ఇలాంటిదొకటి వస్తుందని అప్పుడు ఎవరూ ఊహించి కూడా ఉండరు!! -
కారు అద్దం పగులగొట్టి హీరో అయ్యాడు..
ఒంటారియో: పార్కింగ్‌లో ఉన్న ఓ కారు అద్దాన్ని బండరాయితో పగులగొట్టి, ఓ వ్యక్తి హీరో అయ్యాడు. ఈ సంఘటన కెనడాలో ఒంటారియోలోని గ్రాండ్ బెండ్లో చోటు చేసుకుంది. గ్రాండ్ బెండ్ లో జరుగుతున్న ఓ ఫెస్ట్‌కు చాలా మంది వచ్చారు. అక్కడికి వచ్చిన ఇద్దరు దంపతులు తమ కుక్కను కారులోనే వదిలేసి వెళ్లారు. లాక్ చేసి ఉన్న కారులోనే ఆ కుక్క చాలా సమయం నుంచి ఉంది. అక్కడ ఉష్ణోగ్రతలు కూడా అధికంగా ఉండటంతో అప్పటికే ఆ శునకం నీరసించిపోయింది. అయితే కుక్క కారులో ఉందని, యజమానులు రావల్సిందిగా ముందుగా ఓ అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చారు. అక్కడికి ఎవరూ రాకపోవడంతో చివరకు అక్కడే ఉన్న బండ సాయంతో కారు అద్దం పగులగొట్టి కుక్కను బయటకు తీశాడు ఓ బాటసారి. 'ఆ కుక్క పరిస్థితి చూసి చాలా జాలేసింది. బయట ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటంతో కారులో మరింత వేడికి కుక్క మగ్గిపోయింది. కారు అద్దాలు పగుల గొట్టిన మరో గంట వరకు అక్కడికి కారు యజమానులు రాలేదు. ఒక వేళ ఆ వ్యక్తి అలా చేసి ఉండకపోతే కుక్క పరిస్థితి మరింత విషమంగా మారేది..'అని ప్రత్యక్ష సాక్షి విల్ కోస్టా తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కుక్క యజామానులను స్టేషన్ కు తీసుకువెళ్లారు. బాటసారి కారు అద్దం పగులగొడుతున్న సంఘటనను అక్కడే ఉన్న వారు వీడియో తీసి ఇంటర్నెట్లో పెట్టడంతో అతన్ని అందరూ పొగడ్తలతో ముంచెత్తారు. ఇప్పడు ఆ వీడియో ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా యజమానుల నిర్లక్ష్య ధోరణితో ఎన్నో పెంపుడు శునకాలు కార్లలోనే వదిలి వెళ్లడంతో వేడిమికి, ఊపిరాడక బలవుతున్నాయి. ఇలాంటి వాళ్లను కఠినంగా శిక్షించాలని జంతుప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు. -
జీపు ఢీకొని వ్యక్తి మృతి
బెల్లంపల్లి: జీపు అదుపుతప్పి ఢీకొనడంతో ఓ వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి మండలం కాంట చౌరస్తాలో ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. మృతి చెందిన వ్యక్తిని భీమిని మండలం వీరాపూర్ గ్రామానికి చెందిన జిల్లెల శంకర్‌గౌడ్ (55)గా గుర్తించారు. భార్యా, పిల్లలతో కలసి ఆటోలో వెళ్లాల్సిన శంకర్‌గౌడ్ ఏదో వస్తువు తీసుకువస్తానని చెప్పి ఆటో స్టాండ్ నుంచి పక్కకు వెళ్లాడు. అంతలోనే అదుపుతప్పి వచ్చిన జీపు అతన్ని ఢీకొంది. బలమైన గాయాలు కావడంతో అతడు అక్కడే ప్రాణాలు విడిచాడు. -
పాదచారులపైకి దూసుకెళ్లిన స్కార్పియో
విశాఖపట్టణం(హుకుంపేట): విశాఖ జిల్లాలో ఓ స్కార్పియో వాహనం అదుపుతప్పి పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటన జిల్లాలోని హుకుంపేటలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. హుకుంపేట మండలం కొట్నపల్లి సమీపంలోని పాడేరు- అరకు మార్గంలో రోడ్డు లో రాజమండ్రి వెళ్తున్న స్కార్పియో వాహనం అదుపుతప్పి పాదచారులపైకి దూసుకెళ్లింది. దీంతో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాధితుల వివరాలు తెలియాల్సి ఉంది. -
పాదచారులపైకి దూసుకెళ్లిన జీపు, ఒకరి మృతి
పశ్చిమగోదావరి: పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలం ఎడ్లగూడెంలో పాదచారులపైకి గురువారం పోలీసు జీపు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందారు. అయితే పోలీసు జీపు నడిపిన హోంగార్డు రాంబాబు మద్యం సేవించినట్టు తెలిసింది. దాంతో హోంగార్డు రాంబాబుపైనా పోలీసు అధికారులు సస్పెన్షన్ వేటు వేసినట్టు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
లారీ ఢీకొని వ్యక్తి మృతి
తూర్పుగోదావరి: వేగంగా వస్తున్న లారీ ఢీకొని పాదచారి మృతిచెందిన సంఘటన తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండలం ముక్కామాల గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. ఇదే మండలం పసుపల్లి గ్రామానికి చెందిన దాకారపు దుర్గారావు అనే వ్యక్తి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో అటుగా వస్తున్న లారీ ఆయనను ఢీకొట్టింది. దీంతో దుర్గారావు అక్కడికక్కడే మృతిచెందాడు.