పెనమలూరు సీఐ సస్పెన్షన్
విజయవాడ సిటీ: ఓ మహిళ కేసుకు సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించిన కృష్ణా జిల్లా పెనమలూరు సీఐ జగన్మోహనరావు సస్పెన్షన్‌కు గురయ్యారు. ఈమేరకు మంగళవారం నగర పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్ ఆదేశాలు జారీ చేశారు. వివరాల్లోకి వెళితే... యనమలకుదురు భగత్సింగ్నగర్కి చెందిన దాసరి లక్ష్మీ మాధవి తన భర్త జగన్మోహనరావు మరో వివాహం చేసుకొని వేధిస్తున్నట్టు పెనమలూరు పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదును సీఐ జగన్మోహన్ పట్టించుకోలేదు.
దీంతో గత శనివారం ఆమె నగర పోలీసు కమిషనర్ గౌతం సవాంగ్‌ను కలిసి జరిగిన విషయాన్ని పేర్కొంది. ఆమె ఫిర్యాదుపై స్పందించిన పోలీస్ కమిషనర్ తూర్పుజోన్ ఏసీపీని కలవాలంటూ సూచించారు. అక్కడ న్యాయం జరగని పక్షంలో తనను మరోసారి కలవాలంటూ చెప్పగా అప్పటికే పురుగుల మందు తాగి వచ్చిన ఆమె కమిషనరేట్ నుంచి బయటకు వెళుతూ పడిపోయింది. దీంతో పోలీసులు హుటాహుటిన ఆమెను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆమె కేసు విషయంలో పెనమలూరు సీఐ జగన్మోహన్ రావు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు భావించిన పోలీస్ కమిషనర్ విచారణ జరిపి సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు.