‘మున్సిపోల్స్’ కథ మళ్లీ మొదటికి!?
విజయనగరం మున్సిపాలిటీ , న్యూస్‌లైన్ : రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల ప్రకటన తేదీపై మళ్లీ సందిగ్ధత నెలకొంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాల ప్రకటనపై సుప్రీంకోర్టు స్టే విధించడంతో అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాను ఈ నెల 9న ప్రకటించేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చిన విషయం విదితమే.
అయితే త్వరలో శాసనసభ, లోక్‌సభ ఎన్నికలు జరగనుండటంతో మున్సిపల్ ఎన్నికల ఫలితాల ప్రభావం వాటిపై పడే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో ఫలితాలను వాయిదా వేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను శుక్రవారం విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు.. హైకోర్టు తీర్పుపై తాత్కాలిక స్టే విధించినట్లు తెలిసింది. ఫలితాలు వెలువడించకుండా ఎక్కువ కాలం ఉంచడం సాధ్యం కాదని ఎన్నికల సంఘం తెలపగా.. ఎందుకు ఉంచలేరని న్యాయస్థానం ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
దీనిపై సమగ్ర వివరణ ఇవ్వాలంటూ కేసును ఈ నెల 7వ తేదీకి వాయిదా వేసింది. దీంతో బరిలో ఉన్న అభ్యర్థులతోపాటు, అన్ని రాజకీయ పార్టీల్లోనూ ఉత్కంఠ నెలకొంది. ఫలితాల కోసం ఇంకెన్ని రోజులు వేచి ఉండాలన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సుప్రీంకోర్టులో కేసు ఉన్న నేపథ్యంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీల ఫలితాల మాదిరి గానే మున్సిపల్ ఫలి తాలు వాయిదా పడవచ్చనే వాదనలు బ లంగా వినిపిస్తున్నాయి.
నరాలు తెగే ఉత్కంఠ
మున్సిపల్ ఫలితాల ప్రకటనపై సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలు కావడంతో అభ్యర్థులు కంగుతిన్నారు. గెలుపో, ఓటమో ఏదో ఒకటి తొందరగా తేలిపోతే ప్రశాంతంగా ఉండొచ్చని, లేకపోతే ఈ టెన్షన్ భరించలేమని వాపోతున్నారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో మొత్తం 129 వార్డు కౌన్సిలర్ స్థానాలకు గత నెల 30న ఎన్నికలు జరిగిన విషయం విదితమే. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఈ నెల 2న ఫలితాలు ప్రకటించాల్సి ఉంది.అయితే త్వరలో శాసనసభ, లోక్‌సభ ఎన్నికలు జరగనుండటంతో మున్సిపల్ ఎన్నికల ఫలితాల ప్రభావం వాటిపై పడే అవకాశం ఉందని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
వాదనలు విన్న న్యాయమూర్తి ఈ నెల 9న ఫలితాలు ప్రకటించాలని తేల్చిచెప్పింది. దీంతో పిటీషనర్ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో కథ మొదటికి వచ్చినట్లైంది. ఫలితాల ప్రకటనపై రోజుకో వార్త వినాల్సి వస్తుండడంతో అభ్యర్థులు అయోమయానికి గురవుతున్నారు. మరి కొందరు ఉత్కంఠను తట్టుకోలేకపోతున్నారు. అయితే ప్రధాన రాజకీయ పార్టీలు మాత్రం ఫలితాలను వాయిదా వేస్తేనే మంచిదన్న భావనను వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.