జర్మనీ కెప్టెన్ లామ్ రిటైర్మెంట్
బెర్లిన్: జర్మనీ ఫుట్‌బాల్ జట్టును విశ్వ విజేతగా నిలిపిన కెప్టెన్ ఫిలిప్ లామ్ అంతర్జాతీయ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 30 ఏళ్ల డిఫెండర్ లామ్ 113 మ్యాచ్‌ల్లో పాల్గొని ఐదు గోల్స్ చేశాడు. ‘బ్రెజిల్ ఫుట్‌బాల్ ప్రపంచకప్ నా కెరీర్‌కు చివరిదని ముందే నిర్ణయించుకున్నాను. ఇక చాంపియన్‌గా నిలిచిన అనంతరం ఇదే సరైన నిర్ణయమనిపించింది’ అని లామ్ పేర్కొన్నాడు. అయితే ఈ స్టార్ ఆటగాడు బేయర్న్ మ్యూనిచ్ తరఫున క్లబ్ ఫుట్‌బాల్ ఆడనున్నాడు.
గూగుల్ సెర్చ్‌లో మెస్సీ, రొనాల్డో టాప్
న్యూఢిల్లీ: ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీ సందర్భంగా గూగుల్‌లో అత్యధిక మంది అభిమానులు ‘సెర్చ్’ చేసిన ఆటగాళ్లలో అర్జెంటీనా స్టార్ స్ట్రయికర్ లియోనల్ మెస్సీ, పోర్చుగల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో టాప్‌లో నిలిచారు. అలాగే టోర్నీకి సంబంధించిన వివరాల గురించి 210 కోట్ల మంది ఆన్లైన్లో సెర్చ్ చేసినట్టు గూగుల్ తెలిపింది. గోల్ కీపర్లలో అమెరికాకు చెందిన టిమ్ హోవర్డ్ అగ్రస్థానంలో నిలిచాడు.