ఏపీలో ఫోర్త్ జనరేషన్ టెక్నాలజీ పార్కు
ప్రధాని మోదీ, మలేసియా ప్రధాని సమక్షంలో అవగాహన ఒప్పందం
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో ఫోర్త్ జనరేషన్ టెక్నాలజీ పార్కును ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం, మలేసియా ప్రభుత్వాల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. శనివారం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీ, మలేసియా ప్రధాని నజీబ్ రజాక్ల సమక్షంలో ఏపీ ఎకనమిక్ డెవలప్మెంట్ బోర్డు, మలేసియా ఇండస్ట్రీ గవర్నమెంట్ ఫర్ హై టెక్నాలజీ (మైట్)కు చెందిన ఎంటీఎన్ సంస్థ అధికారులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.
ఈ సందర్భంగా ఏపీ ఎకనమిక్ డెవలెప్మెంట్ బోర్డ్ సీఈవో కృష్ణకిశోర్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆహ్వానం మేరకు రాష్ట్రంలో ఫోర్త్ జనరేషన్ పార్కు ఏర్పాటు చేయడానికి మలేసియా ప్రభుత్వరంగ సంస్థ మందుకొచ్చిందని చెప్పారు. ఈ పార్కు ఏర్పాటులో భాగంగా మొదటి విడతలో రూ.400 కోట్ల పెట్టుబడులతో బియ్యం, జొన్న, చెరుకు వ్యర్థాలను ఉపయోగించి ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా బయో డిగ్రేడబుల్ వస్తువుల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. రెండో విడతలో రూ. 1,500 కోట్ల పెట్టుబడులతో క్లీన్ టెక్నాలజీ, రోబోటిక్స్, డిజిటల్ ప్లాట్‌ఫాం, బిగ్ డేటా మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్టు ఆయన తెలిపారు.