కూతురు పెళ్లికి కాలిఫోర్నియా వెళ్లి కనుమరుగు..
న్యూయార్క్: అమెరికాలో కూతురు పెళ్లికి వెళ్లి కనిపించకుండాపోయాడు ఓ భారతీయ తండ్రి. అతడికోసం విస్తృతంగా గాలింపులు చేపట్టిన పోలీసులు చివరకు చేతులెత్తేశారు. ఈ ఘటన కాలిఫోర్నియాలో చోటుచేసుకుంది. ఉత్తర కాలిఫోర్నియాలో జరుగుతున్న తన కుమార్తె పెళ్లి కోసం ప్రసాద్ మోపర్తి (55) అనే వ్యక్తి గత జనవరిలో కాలిఫోర్నియాకు వెళ్లాడు.
అక్కడ నుంచి తన కూతురు పెళ్లి జరిగే సాక్రమెంటో డెల్టాకు చేరుకుని కార్యక్రమానికి హాజరయ్యాడు. కానీ, ఈ వివాహం నేపథ్యంలో కాస్తంత ఒత్తిడికి గురైనట్లు కనిపించిన ప్రసాద్ శనివారం బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదంటూ పోలీసులకు సమాచారం అందించారు.
ఈ నేపథ్యంలో దాదాపు నాలుగు రోజులపాటు వివాహ కార్యక్రమం జరిగిన ప్రాంతం చుట్టుపక్కల అన్ని చోట్ల గాలింపులు జరిపిన పోలీసులు చివరకు చేతులెత్తేశారు. అతడి మిస్సింగ్‌కు సంబంధించి చిన్న క్లూ కూడా లభ్యంకాలేదని స్పష్టం చేశారు. ఒక వేళ కుటుంబ సభ్యులు ఏవైనా కపటనాటకాలు ఆడుతున్నారా అని ఆలోచించినా ఆ ఆధారాలు కూడా లభ్యం కావడం లేదని అంటున్నారు.