సమస్యలపై ఉద్యమ కార్యాచరణ
కేంద్ర సంఘం అధ్యక్షుడు జ్ఞానేశ్వర్
ముకరంపుర: నాలుగో తరగతి ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలంగాణ నాలుగో తరగతి ఉద్యోగుల కేంద్ర సంఘం అధ్యక్షుడు జి.జ్ఞానేశ్వర్ తెలిపారు. శుక్రవారం కరీంనగర్లోని సంఘ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కె.రామస్వామి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో నూతనంగా నాలుగోతరగతి ఉద్యోగులను నియమించి ఉన్న ఉద్యోగుల పనిభారాన్ని తగ్గించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కరువు భత్యం బకాలతోపాటు వేతన సవరణ ద్వారా ఉద్యోగ పెన్షన్ బకాయిలు విడుదల చేయాలని కోరారు. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో నాలుగో తరగతి ఉద్యోగులు నలిగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో పనిచేస్తున్న ఆంధ్రాకు చెందిన నాలుగో తరగతి ఉద్యోగులను వెనక్కి పంపించాలని డిమాండ్ చేశారు. పొరుగు రాష్ట్రంలో పనిచేస్తున్న వారిని ఇక్కడికి రప్పించాలన్నారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా నూతన అధ్యక్షుడు కె.రామస్వామిని సన్మానించారు. సమావేశంలో కేంద్ర సంఘం నాయకులు విజయలక్ష్మి, ఆఫీసు కార్యదర్శి తొర్తి నర్సయ్య, రాష్ట్ర సంఘం నాయకులు రాజేందర్, ధన్రాజ్, ఖాదర్, జిల్లా అధ్యక్షుడు రామస్వామి, కార్యదర్శి కొమురయ్య, పబ్లిసిటీ సెక్రటరీ బండారి భూమేశ్, పట్టణ అ«ధ్యక్షుడు మర్రి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.