హైదరాబాద్ చేరుకున్న మారిషస్ ప్రెసిడెంట్
హైదరాబాద్: రెండు రోజుల పర్యటన కోసం మారిషాస్ అధ్యక్షురాలు బీబీ అమీనా ఫిర్ దౌస్ గురిబ్ ఫాఖిమ్ మంగళవారం మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న ఆమెకు తెలంగాణ మంత్రి కేటీఆర్, పలువులు అధికారులు స్వాగతం పలికారు. అనంతరం ఆమె శంషాబాద్ నుంచి ఫలక్ నుమా ఫ్యాలెస్ కు బయల్దేరి వెళ్లారు.
కాగా రెండు రోజులపాటు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నాయి. మారిషస్ అధ్యక్షురాలు నగరాన్ని సందర్శించనున్న నేపథ్యంలో జంట కమిషనరేట్ల పరిథిలో పలు చోట్ల ట్రాఫిక్ పరిమితులు, దారి మళ్లింపులు ఉండనున్నట్లు నగర పోలీసు కమిషనర్ ఎం మహేందర్ రెడ్డి తెలిపారు. ఈ విషయాన్ని నగర పౌరులు దృష్టిలో ఉంచుకొని నేడు, రేపు(బుధవారం) సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ట్రాఫిక్ మళ్లింపు ఉండే ప్రాంతాలు...
8.12.2015(మంగళవారం)
రాజీవ్ గాంధీ విమానాశ్రయం నుంచి హోటల్ తాజ్ ఫలక్ నుమా ప్యాలెస్ వైపు ఉండే ప్రాంతాల్లో మధ్యాహ్నం 12 గంటల నుంచి 1గంట మధ్య, హోటల్ ఫలక్ నుమా నుంచి గోల్కొండ వెళ్లే మార్గంలో మధ్యాహ్నం 2.45 నుంచి 3.30 గంటల మధ్య, గోల్కొండ కోట నుంచి ఫలక్ నుమా ప్యాలెస్ మార్గంలో సాయంత్రం 4.15 నుంచి 5.00 గంటల మధ్య, ఫలక్ నుమా ప్యాలెస్ నుంచి చౌమహల్లా ప్యాలెస్ వెళ్లే మార్గంలో 6.30 నుంచి 19.15 గంటల మధ్య ట్రాఫిక్ పరిమితులు, దారి మళ్లింపులు ఉంటాయి.
9.12.2015( బుధవారం)
హోటల్ ఫలక్ నుమా ప్యాలెస్ నుంచి చార్మినార్ వెళ్లే మార్గంలో ఉదయం 10.45 గంటల నుంచి 11.30 మధ్య, చార్మినార్ నుంచి సాలార్జంగ్ మ్యూజియం దారిలో ఉదయం 11.30 గంటల నుంచి 11.45 మధ్య, సాలార్జంగ్ మ్యూజియం నుంచి తాజ్ ఫలక్ నుమా ప్యాలెస్ కు వెళ్లే మార్గంలో 12.15 నుంచి 1.00 గంటల మధ్య, ఫలక్ నుమా ప్యాలెస్ నుంచి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే మార్గంలో 3.45 నుంచి 4.30 మధ్యకాలంలో ట్రాపిక్ ఆంక్షలు ఉంటాయని మహేందర్ రెడ్డి తెలిపారు.
మరో వైపు మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు మారిషస్ అధ్యక్షురాలు గోల్కొండ కోటను సందర్శించనున్న నేపధ్యంలో సందర్శకులను నిలిపివేయనున్నారు. సాయంత్రం 5 గంటల వరకు కోటలోకి సందర్శకులను అనుమతించరని అధికారులు తెలిపారు.