వెల్లువెత్తిన గద్వాల జిల్లా ఆకాంక్ష
– రెండోరోజు బంద్ సక్సెస్
గద్వాల న్యూటౌన్ : గద్వాల జిల్లా ఆకాంక్ష వెల్లువెత్తింది. జిల్లా ఏర్పాటునకు డిమాండ్ చేస్తూ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన 72గంటల బంద్ రెండోరోజు శనివారం సక్సెస్ అయింది. ప్రజలు, వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ పాటించి పాల్గొన్నారు. సినిమా థియేటర్లు, పాఠశాలలు, పెట్రోల్ బంక్‌లు, వాణిజ్య సముదాయాలు మూతబడ్డాయి. తెల్లవారుజామున నుంచే జేఏసీ నాయకులు బైక్‌లపై పట్టణంలో తిరుగుతూ బంద్‌కు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే డీకే అరుణ జేఏసీ నాయకులతో కలిసి పట్టణంలో తిరిగి, కష్ణవేణి చౌక్ వద్ద నిర్వహించిన మానవహారంలో పాల్గొన్నారు. డీకే అరుణ మాట్లాడుతూ ప్రభుత్వం అశాస్త్రీయంగా జిల్లాల విభజన చేపట్టిందని ఆరోపించారు. జనాభా దామాషా ప్రకారం చేపట్టలేదని, కనీస నిబంధనలు, ప్రమాణాలు పాటించలేదని, ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోలేదని దుయ్యబడ్డారు. ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరించిన ప్రభుత్వానికి ప్రజలంతా కలిసికట్టుగా వ్యవహరించి బుద్ది చెప్పాలన్నారు. జేఏసీ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలకు భిన్నంగా కొత్తజిల్లాల నోటిఫికేషన్ విడుదల చేసిందని ఆరోపించారు. గద్వాల జిల్లా సాధించేవరకు ఉద్యమిస్తామని తేల్చి చెప్పారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు నాగర్‌దొడ్డి వెంకట్రాములు, వీరభద్రప్ప, వెంకటరాజారెడ్డి, రాజవర్దన్‌రెడ్డి, నాగరాజు, రాజశేఖర్‌రెడ్డి, అతికూర్‌రహ్మన్, మున్నాబాష, గంజిపేట రాములు, గడ్డంకష్ణారెడ్డి, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
టీఆర్ఎస్ ఆధ్వర్యంలో..
టీఆర్ఎస్ నాయకులు గద్వాల జిల్లా కోసం నదిఅగ్రహారం రోడ్డు మార్గంలోని ఆంజనేయస్వామి ఆలయంలో, జమ్మిచేడులోని జములమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ సుభాన్, బీఎస్ కేశవ్, వంశీ, మహిమూద్, మురళీ, కోటేష్, విజయ్, మధు, కార్యకర్తలు పాల్గొన్నారు.