సొంత అజెండాతోనే ఇంటర్వ్యూలు: మోదీ
న్యూఢిల్లీ: ఇంటర్వ్యూలలో మీడియా ప్రతినిధులు ప్రశ్నలడిగే తీరుపై ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం పలు విమర్శలు గుప్పించారు. మీడియా ప్రతినిధి ముందే తన మనసులో ఒక అజెండాతో సిద్ధమవుతారని, తను ప్రశ్నించే వ్యక్తినుంచి, తాను ఆశిస్తున్న సమాధానం రాబట్టేందుకే ప్రయత్నిస్తారని, ఇది తమకు అనుభవపూర్వకంగా తెలిసిన విషయమని ప్రధాని వ్యాఖ్యానించారు. చాలా సందర్భాల్లో మీడియా ప్రతినిధి తనకు కావాల్సిన జవాబు ఏమిటో ముందే నిర్ణయించుకుని ఉంటారని, తనకు కావాల్సిన సమాధానం వచ్చేవరకూ తాను ఇంటర్వ్యూచేసే వ్యక్తిని వదిలి పెట్టబోరని అన్నారు. ‘ఇండియా టీవీ’ టీవీ ఛానల్ ద్వారా ప్రముఖ జర్నలిస్ట్ రజత్ శర్మ సమర్పణలో ‘ఆప్ కీ అదాలత్’ కార్యక్రమం 21సంవత్సరాలుగా ప్రసారమవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ, ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టతకు ‘ఆప్ కీ అదాలత్’ వంటి కార్యక్రమాలు ఎంతో దోహద పడతాయన్నారు.