రామతీర్థంలో ఘనంగా శోభయాత్ర
రామతీర్ధం(నెల్లిమర్ల): ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థానికి శ్రీత్రిదండి రామానుజ చినజీయరుస్వామి శుక్రవారం రాత్రి వచ్చారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, పెద్ద ఎత్తున భక్తులు ఆయనకు సాదర స్వాగతం పలికారు. శ్రీకాకుళంనుంచి వచ్చిన ఆయనకు దేవుని నెలివాడవద్ద నెల్లిమర్ల ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామినాయుడు, ఆలయ ఈఓ బాబూరావు, టీడీపీ అధికార ప్రతినిధి సువ్వాడ రవిశేఖర్, గ్రామసర్పంచ్ కోటపాటి పద్మలత, నేతలు తిరుపతిరావు, గురాన అసిరినాయుడు తదితరులు స్వాగతం పలికారు. అక్కడినుంచి పెద్ద ఎత్తున భక్తులతో శోభయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా జై శ్రీమన్నారాయణ నామస్మరణతో రామతీర్థం పురవీధులు మార్మోగాయి. ఈ శోభయాత్ర ఆలయం వరకు కొనసాగింది. అనంతరం అలయంవద్ద అర్చకులు పూర్ణకుంభంతో చినజీయరుస్వామికి స్వాగతం పలికారు.
ఆలయంలో ప్రదక్షిణ అనంతరం ఆయన శ్రీరాముడ్ని దర్శించుకుని ప్రత్యేకపూజలు జరిపించారు. అలాగే రామచంద్రప్రభువు సన్నిధిలో సువర్ణ శ్రీరామయంత్ర సమర్పణకార్యక్రమ సంకల్పం నిర్వహించారు. అనంతరం శని, ఆదివారాల్లో దేవస్థానంలో నిర్వహించే శ్రీరామ పాదుకా పట్టాభిషేకం, లక్షదీపారాధన కార్యక్రమాలకు అంకురారోపణం గావించారు. యాగశాలలో ప్రత్యేకంగా హోమాలు నిర్వహించారు. ఇదిలా ఉండగా చినజీయరుస్వామిని దర్శించుకునేందుకు పలుగ్రామాలనుంచి పెద్ద ఎత్తున భక్తులు రామతీర్థం తరలివచ్చారు. దీంతో గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది.