రంజాన్ కు ఎయిర్ సెల్ స్పెషల్ ఆఫర్స్
న్యూఢిల్లీ : రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఎయిర్ సెల్ తన కస్టమర్ల కోసం ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. స్పెషల్ రంజాన్ ప్యాక్ కింద టాక్ టైమ్ లాభాలతో పాటు రాత్రిపూట వాయిస్ కాలింగ్ లో అత్యధిక రాయితీ టారిఫ్ లను కస్టమర్లకు ఆఫర్ చేయనున్నట్టు ఎయిర్ సెల్ తెలిపింది. ఢిల్లీలో ఎయిర్ సెల్ కొత్త ప్రొడక్ట్ కింద రూ.86 రీచార్జ్ కు రూ.86 ఫుల్ టాక్ టైమ్ ఆఫర్ ను అందిస్తోంది. దీంతో పాటు లోకల్, ఎస్ టీడీ కాలింగ్ కు రాత్రి 12 నుంచి ఉదయం 6గంటల వరకు నిమిషానికి 30 పైసల ఆఫర్ ను తీసుకొచ్చింది. ఈ ఆఫర్ 12 రోజుల పాటు వాలిడిటీలో ఉంచింది.
ఐఎస్ డీ కాలింగ్ కూడా రంజాన్ ప్యాక్ కింద ఆఫర్లను ప్రకటించింది. యునిటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), సౌదీ అరేబియాలకు సెకన్ కు 16 పైసలు, బంగ్లాదేశ్ కు సెకన్ కు 4పైసలు మాత్రమే చార్జ్ చేయనున్నట్టు తెలిపింది. ఇఫ్తార్ అనంతరం, అదేవిధంగా తెల్లవారుజామున లోకల్, ఎస్ టీడీ, ఐఎస్ డీ కాల్స్ కోసం యూజర్లు అత్యధికంగా వాడుతుంటారని, వారికోసం స్పెషల్ గా రంజాన్ ప్యాక్ ను తీసుకొచ్చినట్టు ఎయిర్ సెల్ చెప్పింది.
తమ కస్టమర్లకు రంజాన్ స్పెషల్ నెల అని, భారత్ లో, విదేశాల్లో స్నేహితులతో, కుటుంబసభ్యులతో వారు ఎక్కువగా కనెక్ట్ అవుతుంటారని ఎయిర్ సెల్ నార్త్ రీజనల్ బిజినెస్ హెడ్ హరీష్ శర్మ చెప్పారు. ఈ నెలలో రాత్రిపూట ఎక్కువగా కాల్స్ డేటా నమోదవుతుందని పేర్కొన్నారు. ఈ అవర్స్ లో చాలా రిటైల్ అవుట్ లెట్లు మూసేస్తారని, దానివల్ల బ్యాలెన్స్ అయిపోయి కస్టమర్లు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారని తెలిపారు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని కస్టమర్లకు సౌకర్యవంతంగా రంజాన్ ప్యాక్ కింద ఈ ఆఫర్లు ప్రకటించామని హరీష్ అన్నారు.