జీ హుజూర్
* తెలుగుతమ్ముళ్లు ఏది చెప్పినా.. ఏమి చేసినా ఓకే అంటున్న అధికారులు
* ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్న టీడీపీ నేతలు
* అధికారులను దూషిస్తున్నా కనిపించని సంఘీభావం
సాక్షి ప్రతినిధి, కడప: జిల్లా పోలీసులు, అధికారులు ఏకపక్షంగా ఒక వర్గానికే కొమ్ముకాస్తున్నారు. వారు ఏమి చేసినా జీ హుజూర్ అంటున్నారు. చౌక దుకాణాల డీలర్‌షిప్‌లు రద్దు, నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు. సబ్స్టేషన్లలో అర్హతతో నిమిత్తం లేకుండా ఆపరేటర్ల ఎంపిక. ఇష్టారాజ్యంగా ఇసుక అక్రమ రవాణా... ఇవన్నీ జిల్లా వ్యాప్తంగా నిత్యం చోటుచేసుకుంటున్న ఘటనలు. వీటన్నింటికీ ఏకైక అర్హత అధికార పార్టీ. అక్రమార్జనకు అధికారపార్టీ నేత అయితేనే అర్హతగా యంత్రాంగం భావిస్తోంది. అందు కు అనుగుణంగా యంత్రాం గాన్ని తెలుగు తమ్ముళ్లు మలుచుకుంటున్నారు. కాదు.. కూడదంటే బెదిరింపులు, దూషణలకు దిగుతున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులే పాలకులు.
వారి నేతృత్వంలోనే చట్టాలు, శాసనాలు చేయాల్సి ఉంది. అందుకు అనుగుణంగా యంత్రాంగం మసలుకోవాలి. జిల్లాలోని ప్రజలు వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. తొమ్మిది మంది ఎమ్మెల్యేలను, ఇరువురు ఎంపీలను ఆ పార్టీకి అప్పగించారు. ప్రజలు తిరస్కరించినా అధికార పార్టీ తమదేనన్న ఏకైక ఆలోచనతో తెలుగుదేశం పార్టీ నేతలు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. అందుకు అనువుగా యంత్రాంగాన్ని మలుచుకోవడంలో బిజీగా గడుపుతున్నారు.
బహిరంగంగానే ఆదేశాలు
ప్రజాస్వామ్యబద్ధంగా మెలగాల్సిన యంత్రాంగం తద్భిన్నంగా వ్యవహరిస్తోంది. కొంతమంది నేతలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుండటంతో అందుకు అనుగుణంగా కొంతమంది ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్నారు. జిల్లాలో ఓ ఉన్నతస్థాయి అధికారి బహిరంగంగానే అధికారపార్టీ నేతల అభ్యర్థనలను పరిగణలోకి తీసుకోవాలని సూచిస్తున్నట్లు సమాచారం. దీంతో ఇతర ప్రజాప్రతినిధులతో నిమిత్తం లేకుండా అధికారపార్టీ నేతలు చెప్పిందే వినాలని.. వారిని మెప్పించాలనే తత్వాన్ని కింది స్థాయి యంత్రాంగం వంటబట్టించుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక 125 రేషన్‌షాపుల డీలర్‌షిప్‌లు రద్దు అయ్యాయి. సబ్స్టేషన్లలో నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రకృతి సంపదను అక్రమార్గంలో కొల్లగొట్టేందుకు అస్కారం ఏర్పడుతోంది. వీటిని నియంత్రించాల్సిన యంత్రాంగం నిమ్మకునీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందనే ఆరోపణలు విన్పిస్తున్నాయి.