రెవెన్యూ సేవలు వేగవంతం చేయాలి
ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు
అనకాపల్లిరూరల్, న్యూస్‌లైన్: రెవెన్యూ సేవలు వేగవంతం చేయాలని, సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేయాలని అనకాపల్లి ఎంపీగా ఎన్నికైన ముత్తంశెట్టి శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. ఆర్డీఓ కార్యాలయంలో శనివారం డివిజన్ తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లతో ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికలు అయిపోయాయి కాబట్టి ఉద్యోగులంతా విధులకు అంకి తం కావాలని సూచించారు. నియోజకవర్గంలోని పేదలను గుర్తించి వారికి ఇళ్లందిస్తామని, ప్రతి పౌరునికి రేషన్ కార్డు సత్వరం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగులను రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తున్న టీఆర్ఎస్ అధినేత వ్యాఖ్యలను ఖండించారు. నూతన ఎమ్మెల్యే గోవింద మాట్లాడుతూ ఎన్నికల ప్రచారం సందర్భంగా పాసుపుస్తకాల్లేవని ఎక్కువ మంది తన దృష్టికి తీసుకువచ్చారని, అర్హులైన వారందరికీ పాసుపుస్తకాలు అందేలా చూడాలని కోరారు. ప్రజలు ఏ సమస్యపైనైనా తనను నేరుగా సంప్రదించవచ్చునన్నారు. తన పేరు చెప్పుకుని ఎవరైనా అధికారుల వద్దకు వచ్చి సిఫారసులు చేస్తే వాటిని పట్టించుకోవాల్సిన పనిలేదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఆర్డీఓ వసంతరాయుడు పాల్గొన్నారు.