Real estate agency
-
HYD: రియల్ ఎస్టేట్ కంపెనీల్లో ఐటీ సోదాలు
సాక్షి, హైదరాబాద్: నగరంలో ప్రముఖ రియల్ ఎస్టేట్‌కు చెందిన కంపెనీల్లో ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. బంజారాహిల్స్, చేవెళ్ల, షాద్‌నగర్ సహా పలు ప్రాంతాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి.వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లో ఐటీ శాఖ అధికారులు సోదాలు చేపట్టారు. నగరంలోని స్వస్తిక్ రియల్టర్ కంపెనీలో తనిఖీలు కొనసాగుతున్నాయి. బంజారాహిల్స్, చేవెళ్ల, షాద్ నగర్లో కంపెనీ చెందిన నివాసాల్లో సోదాలు చేస్తున్నారు అధికారులు. కల్పన రాజేంద్ర, లక్ష్మణ్ నివాసాల్లో ఏక కాలంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇటీవల ఓ ఎంఎన్సీ కపెంనీకి రూ.300 కోట్లతో భూమి విక్రయించిన సదరు సంస్థ. షాద్ నగర్లో ఈ భూమిని అమ్మిన స్వస్తిక్ గ్రూప్. అయితే, ఈ భూమి విక్రయానికి సంబంధించి బ్యాలెన్స్ షీట్స్‌లో చూపలేదని అధికారులు ఆరోపిస్తున్నారు. ఇక, ఐటీ సోదాలపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్‌లో 52 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: దేశంలో ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్ మార్కెట్ 53.4 మిలియన్ చదరపు అడుగులుగా (ఎస్ఎఫ్టీ) ఉండగా, 2025 నాటికి 52 శాతం పెరిగి 81 మిలియన్ చదరపు అడుగులకు చేరుకుంటుందని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ వెస్టిన్ పేర్కొంది. ఏటా 23 శాతం చొప్పున కాంపౌండెడ్ (సీఏజీఆర్) వృద్ధి నమోదవుతుందని అంచనా వేసింది. కరోనా మహమ్మారి ఈ మార్కెట్‌కు ప్రేరణగా నిలిచినట్టు పేర్కొంది. దేశవ్యాప్తంగా 1,000కి పైగా కేంద్రాల్లో ఆపరేటర్ల నిర్వహణలో ప్రస్తుతం 7.6 లక్షల సీట్లు అందుబాటులో ఉన్నాయని వెస్టిన్ నివేదిక తెలిపింది. ఈ రంగంలో 50 పెద్ద సంస్థలు ఉండగా, టాప్–10 సంస్థల నిర్వహణలోనే 84 శాతం ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్ పరిమాణం ఉన్నట్టు పేర్కొంది. యూఎస్, యూరప్ దేశాలతో పోలిస్తే భారత్‌లో ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్ (తక్షణ కార్యాలయ ఏర్పాటుకు అనుకూలమైన) ఆరంభ దశలో ఉన్నట్టు వెస్టిన్ సీఈవో శ్రీనివాసరావు తెలిపారు. అన్ని విధాల వృద్ధి 2015–16 నుంచి ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్ వినియోగం విస్తృతమైందని (వివిధ రంగాలు, కంపెనీలు), అప్పటి వరకు ఈ మార్కెట్ అసంఘటితంగా, పరిమితంగా ఉండేదని వెస్టిన్ నివేదిక వివరించింది. ఆ తర్వాత నుంచి వేగంగా పెరుగుతూ, మరింత సంఘటితంగా మారినట్టు తెలిపింది. కేవలం స్టార్టప్‌ల నుంచే కాకుండా, చిన్న, మధ్య తరహా సంస్థలు, పెద్ద సంస్థలు సైతం వినియోగించుకోవడం మొదలైనట్టు వివరించింది. ‘‘ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్‌ను లీజుకు తీసుకునే సంస్థలు తక్కువ వ్యయం, సౌకర్యాలు, సాంకేతికంగా అత్యాధునిక వసతులను కోరుకుంటున్నాయి. స్థూల ఆర్థిక అనిశి్చతులు, మాంద్యం భయాలతో 2023 ఈ మార్కెట్‌కు సవాలే’’అని శ్రీనివాసరావు వివరించారు. కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులను తిరిగి కార్యాలయాలకు హైబ్రిడ్ నమూనాలో రప్పిస్తున్నాయని, దీంతో ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్‌కు డిమాండ్ పెరుగుతుందని వెస్టిన్ నివేదిక అంచనా వేసింది. 2025 నాటికి మొత్తం ఆఫీస్ స్పేస్ (కార్యాలయ స్థలాలు )లో ఫ్లెక్సిబుల్ స్పేస్ 25 శాతంగా ఉంటుందని పేర్కొంది. హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ, బెంగళూరులోని వైట్‌ఫీల్డ్, పుణెలోని బనేర్, ముంబైలోని అంధేరి, గురుగ్రామ్‌లోని డీఎల్ఎఫ్ సిటీ ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్‌కు ప్రధాన కేంద్రాలుగా ఉన్నాయి. -
నటుడికి రియల్టీ గ్రూప్ కుచ్చుటోపీ!
భోజ్‌పురి హీరో, ‘రేసుగుర్రం’ ఫేం రవికిషన్ ముంబైకి చెందిన రియల్టీ సంస్థ కమలా ల్యాండ్ గ్రూప్ తనను మోసగించిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జుహులో ఫ్లాట్ నిర్మిస్తామని చెప్పడంతో తాను కోటిన్నర రూపాయలు చెల్లించానని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు సదరు రియల్టీ గ్రూపు డైరెక్టర్లు జితేంద్ర జైన్, జినేంద్ర జైన్, కేతన్ షాలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. రవి కిషన్ కూడా నాలాగే మోసపోయాడు.. ‘కమలా ల్యాండ్ గ్రూప్‌ను నమ్మి రవికిషన్ కూడా నాలాగే మోసపోయాడు. రెండు ఫ్లాట్ల కోసం వాళ్లు నా దగ్గర నుంచి ఆరున్నర కోట్ల రూపాయలు తీసుకున్నారు. రవి నుంచి కూడా కోటిన్నర రూపాయలు వసూలు చేసి, సిద్ధాంత్ ప్రాజెక్టులో 3165 చదరపు మీటర్ల ఫ్లాట్ ఇస్తామన్నారు. ఇందుకు సంబంధించి అలాట్మెంట్ లెటర్ కూడా ఇచ్చారు. కానీ ఇంతవరకు ఫ్లాట్ ఇవ్వలేదు. అందుకే ఇద్దరం కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశాం అని ముంబైకి చెందిన వ్యాపారి సునీల్ నాయర్ వ్యాఖ్యానించారు. కాగా వీరిద్దరి ఫిర్యాదు మేరకు జితేంద్ర, జనేంద్ర, కేతన్‌లపై చీటింగ్, బ్రీచింగ్ కేసు నమోదు చేసినట్లు ఈవోడబ్ల్యూ ఆఫీసర్ ఒకరు తెలిపారు. -
‘సాక్షి’ ప్రాపర్టీ షో షురూ
♦ తొలిరోజు భారీగా సందర్శకులు ♦ స్టాళ్లను ఏర్పాటు చేసిన 22 ప్రముఖ నిర్మాణ సంస్థలు ♦ నేటి సాయంత్రం వరకు కొనసాగనున్న ప్రదర్శన హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్ వ్యాప్తంగా అందుబాటు ధరల ఇళ్ల నుంచి మెగా లగ్జరీ ఇళ్ల వరకు వివిధ ప్రాజెక్టులు చేపడుతున్న రియల్ ఎస్టేట్ సంస్థలు ‘సాక్షి’ ప్రాపర్టీ షోలో కొలువుదీరాయి. శనివారం మాదాపూర్‌లోని ‘హోటల్ ఆవాస’లో ఈ షో ఘనంగా ప్రారంభమైంది. భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్) తెలంగాణ అధ్యక్షుడు జి.రాంరెడ్డి, అపర్ణా కన్స్ట్రక్షన్స్ బ్రాండ్ ప్రమోషన్ మేనేజర్ శ్రీనివాస్ దివాకర్ల, ఆదిత్య కన్స్ట్రక్షన్స్ జనరల్ మేనేజర్ సాయికుమార్, రాంకీ ఎస్టేట్స్ అండ్ ఫామ్స్ లిమిటెడ్ జీఎం శరత్‌బాబు, ‘సాక్షి’ ప్రకటనల విభాగం వైస్‌ప్రెసిడెంట్ శ్రీధర్, జీఎం రమణకుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ‘తెలంగాణ ప్రభుత్వం వచ్చాక స్థిరాస్తి రంగం ఏమవుతుందో.. ఆంధ్రా ప్రాంతం వాళ్లు ఇక్కడి ఆస్తులమ్ముకుని వెళ్లిపోవాలేమో అనే అపోహలుండేవి. కానీ, ఇప్పుడవన్నీ పూర్తి గా తొలగిపోయాయి. ఇక్కడ పారి శ్రామికాభివృద్ధికి తీసుకుంటున్న నిర్ణయాలే ఇందుకు నిదర్శనం. అందుకే 2016-17 సంవత్సరం హైదరాబాద్ స్థిరాస్తి వ్యాపారానికి గోల్డెన్ ఇయర్‌గా నిలవబోతోంది’ అని రాంరెడ్డి అన్నారు. మెట్రో, ఓఆర్‌ఆర్‌లతో అన్ని వైపులా వృద్ధి... ఇప్పటివరకు హైదరాబాద్‌లో స్థిరాస్తి వ్యాపారం మాదాపూర్, గచ్చిబౌలి వంటి కొన్ని ప్రాంతాలకే పరిమితమైందని, మెట్రో, ఔటర్ రింగ్‌రోడ్లతో తూర్పు, ఉత్తర ప్రాంతాల్లోనూ బాగానే సాగుతోందని రాంరెడ్డి చెప్పారు. ప్రభుత్వం ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతులు అభివృద్ధి చేస్తే ఐటీ, ఫార్మా కంపెనీలు వచ్చేందుకు అవకాశం ఉంటుందని, దీంతో హైదరాబాద్ నలువైపులా వృద్ధి చెందుతుందన్నారు. ‘స్థిరాస్తి వ్యాపారానికి కేంద్ర బిందువైన ఐటీ హబ్‌లోనే ప్రాపర్టీ షో నిర్వహించడం సాక్షి ప్రాపర్టీ షో విజయానికి తొలిమెట్టు’ అని రాంరెడ్డి చెప్పారు. సందర్శకులతో కిటకిట... శనివారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ ప్రాపర్టీ షో రాత్రి 7 గంటల వరకు సాగింది. సందర్శకులతో ప్రాంగణమంతా కిటకిటలాడింది. సిరి సంపద ఫామ్ ల్యాండ్స్, మ్యాక్ ప్రాజెక్ట్స్ బనియన్ ట్రీ రిట్రీట్ సంస్థలు.. బంపర్, లక్కీ డ్రాలు నిర్వహించాయి. షోలో హైదరాబాద్‌కు చెందిన 22 ప్రముఖ నిర్మాణ సంస్థలు 40 పైగా స్టాళ్లను ఏర్పాటు చేశాయి. వాటి ప్రాజెక్ట్‌లు, వెంచర్లు, ధరలు, రాయితీలు, ప్రస్తుత దశ, భవిష్యత్తు అభివృద్ధి వంటి వివరాలను వివరించాయి. ఆదివారం సాయంత్రం వరకూ ‘సాక్షి ప్రాపర్టీ షో’ కొనసాగుతుంది. కార్యక్రమంలో ‘సాక్షి’ ప్రకటనల విభాగం జీఎం కమల్ కిశోర్‌రెడ్డి, డీజీఎం సురేందర్‌రావు, ఏజీఎం వినోద్, ప్రతినిధులు నాగరాజు, మధు, పాపారావు తదితరులు పాల్గొన్నారు.