న్యూఢిల్లీ: దేశంలో ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్ మార్కెట్ 53.4 మిలియన్ చదరపు అడుగులుగా (ఎస్‌ఎఫ్‌టీ) ఉండగా, 2025 నాటికి 52 శాతం పెరిగి 81 మిలియన్ చదరపు అడుగులకు చేరుకుంటుందని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ వెస్టిన్ పేర్కొంది. ఏటా 23 శాతం చొప్పున కాంపౌండెడ్ (సీఏజీఆర్) వృద్ధి నమోదవుతుందని అంచనా వేసింది. కరోనా మహమ్మారి ఈ మార్కెట్‌కు ప్రేరణగా నిలిచినట్టు పేర్కొంది.
దేశవ్యాప్తంగా 1,000కి పైగా కేంద్రాల్లో ఆపరేటర్ల నిర్వహణలో ప్రస్తుతం 7.6 లక్షల సీట్లు అందుబాటులో ఉన్నాయని వెస్టిన్ నివేదిక తెలిపింది. ఈ రంగంలో 50 పెద్ద సంస్థలు ఉండగా, టాప్–10 సంస్థల నిర్వహణలోనే 84 శాతం ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్ పరిమాణం ఉన్నట్టు పేర్కొంది. యూఎస్, యూరప్ దేశాలతో పోలిస్తే భారత్‌లో ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్ (తక్షణ కార్యాలయ ఏర్పాటుకు అనుకూలమైన) ఆరంభ దశలో ఉన్నట్టు వెస్టిన్ సీఈవో శ్రీనివాసరావు తెలిపారు.
అన్ని విధాల వృద్ధి
2015–16 నుంచి ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్ వినియోగం విస్తృతమైందని (వివిధ రంగాలు, కంపెనీలు), అప్పటి వరకు ఈ మార్కెట్ అసంఘటితంగా, పరిమితంగా ఉండేదని వెస్టిన్ నివేదిక వివరించింది. ఆ తర్వాత నుంచి వేగంగా పెరుగుతూ, మరింత సంఘటితంగా మారినట్టు తెలిపింది. కేవలం స్టార్టప్‌ల నుంచే కాకుండా, చిన్న, మధ్య తరహా సంస్థలు, పెద్ద సంస్థలు సైతం వినియోగించుకోవడం మొదలైనట్టు వివరించింది. ‘‘ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్‌ను లీజుకు తీసుకునే సంస్థలు తక్కువ వ్యయం, సౌకర్యాలు, సాంకేతికంగా అత్యాధునిక వసతులను కోరుకుంటున్నాయి.
స్థూల ఆర్థిక అనిశి్చతులు, మాంద్యం భయాలతో 2023 ఈ మార్కెట్‌కు సవాలే’’అని శ్రీనివాసరావు వివరించారు. కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులను తిరిగి కార్యాలయాలకు హైబ్రిడ్ నమూనాలో రప్పిస్తున్నాయని, దీంతో ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్‌కు డిమాండ్ పెరుగుతుందని వెస్టిన్ నివేదిక అంచనా వేసింది. 2025 నాటికి మొత్తం ఆఫీస్ స్పేస్ (కార్యాలయ స్థలాలు )లో ఫ్లెక్సిబుల్ స్పేస్ 25 శాతంగా ఉంటుందని పేర్కొంది. హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ, బెంగళూరులోని వైట్‌ఫీల్డ్, పుణెలోని బనేర్, ముంబైలోని అంధేరి, గురుగ్రామ్‌లోని డీఎల్‌ఎఫ్ సిటీ ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్‌కు ప్రధాన కేంద్రాలుగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment