‘సాక్షి’ ప్రాపర్టీ షో షురూ
♦ తొలిరోజు భారీగా సందర్శకులు
♦ స్టాళ్లను ఏర్పాటు చేసిన 22 ప్రముఖ నిర్మాణ సంస్థలు
♦ నేటి సాయంత్రం వరకు కొనసాగనున్న ప్రదర్శన
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్ వ్యాప్తంగా అందుబాటు ధరల ఇళ్ల నుంచి మెగా లగ్జరీ ఇళ్ల వరకు వివిధ ప్రాజెక్టులు చేపడుతున్న రియల్ ఎస్టేట్ సంస్థలు ‘సాక్షి’ ప్రాపర్టీ షోలో కొలువుదీరాయి. శనివారం మాదాపూర్‌లోని ‘హోటల్ ఆవాస’లో ఈ షో ఘనంగా ప్రారంభమైంది. భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్) తెలంగాణ అధ్యక్షుడు జి.రాంరెడ్డి, అపర్ణా కన్‌స్ట్రక్షన్స్ బ్రాండ్ ప్రమోషన్ మేనేజర్ శ్రీనివాస్ దివాకర్ల, ఆదిత్య కన్‌స్ట్రక్షన్స్ జనరల్ మేనేజర్ సాయికుమార్, రాంకీ ఎస్టేట్స్ అండ్ ఫామ్స్ లిమిటెడ్ జీఎం శరత్‌బాబు, ‘సాక్షి’ ప్రకటనల విభాగం వైస్‌ప్రెసిడెంట్ శ్రీధర్, జీఎం రమణకుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
‘తెలంగాణ ప్రభుత్వం వచ్చాక స్థిరాస్తి రంగం ఏమవుతుందో.. ఆంధ్రా ప్రాంతం వాళ్లు ఇక్కడి ఆస్తులమ్ముకుని వెళ్లిపోవాలేమో అనే అపోహలుండేవి. కానీ, ఇప్పుడవన్నీ పూర్తి గా తొలగిపోయాయి. ఇక్కడ పారి శ్రామికాభివృద్ధికి తీసుకుంటున్న నిర్ణయాలే ఇందుకు నిదర్శనం. అందుకే 2016-17 సంవత్సరం హైదరాబాద్ స్థిరాస్తి వ్యాపారానికి గోల్డెన్ ఇయర్‌గా నిలవబోతోంది’ అని రాంరెడ్డి అన్నారు.
మెట్రో, ఓఆర్‌ఆర్‌లతో అన్ని వైపులా వృద్ధి...
ఇప్పటివరకు హైదరాబాద్‌లో స్థిరాస్తి వ్యాపారం మాదాపూర్, గచ్చిబౌలి వంటి కొన్ని ప్రాంతాలకే పరిమితమైందని, మెట్రో, ఔటర్ రింగ్‌రోడ్లతో తూర్పు, ఉత్తర ప్రాంతాల్లోనూ బాగానే సాగుతోందని రాంరెడ్డి చెప్పారు. ప్రభుత్వం ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతులు అభివృద్ధి చేస్తే ఐటీ, ఫార్మా కంపెనీలు వచ్చేందుకు అవకాశం ఉంటుందని, దీంతో హైదరాబాద్ నలువైపులా వృద్ధి చెందుతుందన్నారు. ‘స్థిరాస్తి వ్యాపారానికి కేంద్ర బిందువైన ఐటీ హబ్‌లోనే ప్రాపర్టీ షో నిర్వహించడం సాక్షి ప్రాపర్టీ షో విజయానికి తొలిమెట్టు’ అని రాంరెడ్డి చెప్పారు.
సందర్శకులతో కిటకిట...
శనివారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ ప్రాపర్టీ షో రాత్రి 7 గంటల వరకు సాగింది. సందర్శకులతో ప్రాంగణమంతా కిటకిటలాడింది. సిరి సంపద ఫామ్ ల్యాండ్స్, మ్యాక్ ప్రాజెక్ట్స్ బనియన్ ట్రీ రిట్రీట్ సంస్థలు.. బంపర్, లక్కీ డ్రాలు నిర్వహించాయి. షోలో హైదరాబాద్‌కు చెందిన 22 ప్రముఖ నిర్మాణ సంస్థలు 40 పైగా స్టాళ్లను ఏర్పాటు చేశాయి. వాటి ప్రాజెక్ట్‌లు, వెంచర్లు, ధరలు, రాయితీలు, ప్రస్తుత దశ, భవిష్యత్తు అభివృద్ధి వంటి వివరాలను వివరించాయి. ఆదివారం సాయంత్రం వరకూ ‘సాక్షి ప్రాపర్టీ షో’ కొనసాగుతుంది. కార్యక్రమంలో ‘సాక్షి’ ప్రకటనల విభాగం జీఎం కమల్ కిశోర్‌రెడ్డి, డీజీఎం సురేందర్‌రావు, ఏజీఎం వినోద్, ప్రతినిధులు నాగరాజు, మధు, పాపారావు తదితరులు పాల్గొన్నారు.