మరో మజిలీ...
రాజధాని లేని రాష్ట్రంగా... అవశేషాంధ్రప్రదేశ్ ఇప్పుడు మనముందు నిలిచింది. ఎంత త్వరగా జవసత్వాలు కూడదీసుకుని నవ్యోత్సాహంతో ప్రగతి పథంలో దూసుకుపోనుంది అన్నదే ప్రతి తెలుగువాడి మదిలోని ప్రశ్న. రాష్ట్రంలో అధికారం చేపట్టిన తెలుగుదేశం ప్రభుత్వం తమ ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చాలని అయిదున్నర కోట్ల ఆంధ్రులు కోరుకుంటున్నారు.
డాక్టర్ గోపరాజు నారాయణరావు: ఆంధ్రప్రదేశ్‌కు 972 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. విశాఖపట్నం సహా ఈ రేఖ పొడవునా నౌకాశ్రయాలు ఉన్నాయి. ఆర్ధర్ కాటన్ కృషితో వచ్చిన ధవళేశ్వరం బ్యారేజి మొదలు నాగార్జునసాగర్, శ్రీశైలం, తుంగభద్ర, ప్రకాశం, కేసీ కెనాల్ ఇంకా రిజర్వాయర్లు, జల పథకాలు, ప్రాజెక్టులు ఉన్నాయి. తిండిగింజలు పండే భూములే ఎక్కువ. బెరైటీస్, బాక్సైట్, బెరిల్, క్రోమైట్, ఇనుము, మాంగనీసు, అభ్రకం, అపార సహజవాయువు నిల్వలు ఉన్నాయి. ఇక్కడి వజ్రపుగనులూ ప్రసిద్ధిగాంచినవే. నిజానికి ప్రపంచ ప్రఖ్యాత కోహినూర్ ఇక్కడే దొరికింది. వీటి ఆసరాగా పరిశ్రమల ఏర్పాటు, ఉపాధి కల్పన తక్షణ అవసరం.
‘కేపిటల్’ పనిష్మెంట్
ఆంధ్రరాష్ట్రం అవతరించినపుడు మద్రాసును రాజధానిగా కోరవద్దని నెహ్రూ ప్రభుత్వం సలహా ఇచ్చింది. హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఉంచడం సాధ్యం కాదని మన్మోహన్ ప్రభుత్వం వెల్లడించింది. ఈ రెండు పర్యాయాలు సీమాంధ్రులకే రాజధాని సమస్య వచ్చింది. నిజానికి పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్షలో రెండు అంశాలు ఉన్నాయని చెప్పేవారూ ఉన్నారు. ఆంధ్ర రాష్ట్ర సాధనతో పాటు, కొత్తగా ఏర్పడే ఆంధ్ర రాష్ట్రానికి మద్రాసును రాజధానిని చేయాలన్నది కూడా శ్రీరాములుగారి డిమాండ్‌గా చెబుతారు. కానీ అంతకు ముందే జేవీపీ కమిటీ మద్రాసు కోసం పట్టుపట్టవద్దని సూచించింది.
మద్రాసును తాత్కాలికంగా అయినా ఆంధ్రుల రాజధానిగా ఉపయోగించడానికి నాటి ముఖ్యమంత్రి పిఎస్ కుమారస్వామి రాజా నాయకత్వంలోని విభజన కమిటీ కూడా అంగీకరించలేదు. దీంతో కర్నూలులో వేసుకున్న గుడారాల నుంచే కొత్త రాష్ట్ర పాలన ఆరంభమైంది. అరవయ్యేళ్ల కాపురం తరువాత ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయింది. ఇప్పుడు మళ్లీ రాజధాని సమస్య ఆంధ్రప్రదేశ్ మెడకే చుట్టుకుంది. హైదరాబాద్ పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. ఇది ఊరట ఇచ్చే అంశం కూడా కాదు.
విభజనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేశాక కొత్త రాజధానిగా విశాఖపట్నం, విజయవాడ-గుంటూరు, ఒంగోలు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి పేర్లు పత్రికలలో హోరెత్తాయి. వీటిలోనే కొన్ని నగరాలకు శివరామకృష్ణన్ కమిటీ వెళ్లింది. హైదరాబాద్ తరువాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి చెందిన పెద్ద నగరం విశాఖ. ఇక్కడ నౌకాశ్రయం ఉంది. విమానాశ్రయం ఉంది. కానీ ఒక మూలకు విసిరేసినట్టు ఉంటుంది. ముఖ్యంగా రాయలసీమ వాసులకు సుదూర ప్రాంతమన్న అభిప్రాయం ఉంది.
హఠాత్తుగా తెర మీదకు వచ్చిన పేరు ఒంగోలు. ప్రకాశం జిల్లా రాజధాని కేంద్రమైన ఒంగోలు కోస్తాంధ్రకూ, సీమకూ దగ్గరగానే ఉంటుంది. కానీ వేసవిలో ఇక్కడ ఎదుర్కొనవలసి వచ్చే నీటి ఎద్దడి భయపెడుతోంది. కర్నూలుకే రాజధాని అవకాశం రావాలని ఆ ప్రాంత నాయకులు ముందే కోరారు. కానీ మౌలిక వసతుల లేమితో పాటు, 2009 వరదల దెబ్బ నుంచి ఈ నగరం ఇప్పటికీ కోలుకోలేదన్న వాదం ఉంది. రాజమండ్రి పేరు వినిపిస్తున్నా, భూమి సమస్య అడ్డువచ్చే అవకాశం ఎక్కువ. కానీ తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న 7500 ఎకరాల అటవీ భూమిని దృష్టిలో ఉంచుకుని రాజమండ్రిని రాజధానిని చేయాలని ఒక డిమాండ్ ఉంది.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడం ఖాయమని తేలిన తరువాత ఎక్కువగా వినిపించిన పేరు గుంటూరు-విజయవాడ. జిల్లాలో 1,34,420 హెక్టార్ల అటవీ భూములు ఉన్నాయి. ఇంతకీ శివరామకృష్ణన్ కమిటీ సిఫార్సులు ఎలా ఉండబోతున్నాయి? అయితే ఆ సిఫార్సులతోనే రాజధానిపై తుది నిర్ణయం జరిగిపోదు. కొత్త ప్రభుత్వం ప్రతిపాదన, ప్రతిపక్షం సూచనలు, వాదోపవాదాలు తప్పనిసరి. ఏమైనా ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని వ్యవహారం ఇప్పుడే తేలేది మాత్రం కాదు.
కీలక ఘట్టాలు...
1953 అక్టోబర్ 1: మద్రాసు నుంచి విభజన.. కర్నూలు రాజధానిగా ప్రత్యేక ఆంధ్రప్రదేశ్
1956 నవంబర్ 1: తెలంగాణ జిల్లాలతో కలిపి హైదరాబాద్ రాజధానిగా ప్రత్యేక రాష్ట్రం
2009 డిసెంబర్ 9: రాష్ట్ర విభజన ప్రకియ ప్రారంభిస్తున్నట్లు కేంద్రమంత్రి చిదంబరం ప్రకటన
2013 అక్టోబర్ 3: తెలంగాణ బిల్లుకు కేంద్రమంత్రివర్గం ఆమోదం
2014 ఫిబ్రవరి 18: లోక్‌సభలో బిల్లు ఆమోదం, 20న రాజ్యసభలోనూ ఆమోదం
2014 మార్చి 4: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై గెజిట్ జారీ చేసిన రాష్ట్రపతి
2014 జూన్ 2: అపాయింటెడ్ డే.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విభజన ప్రకటన
2014 జూన్ 8: ఆంద్రప్రదేశ్ సీఎంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రమాణం