పరిహారానికీ 1బీ లింక్
- అసమగ్రంగా రికార్డులు
- ఆందోళనలో రైతాంగం
రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం, వ్యవసాయ అధికారుల నిర్లిప్తత రైతుల పాలిట శాపంగా మారాయి. రుణమాఫీ అర్హుల జాబితా తేల్చేందుకు 1బీ రికార్డులకు ముడిపెట్టిన ప్రభుత్వం తాజాగా విడుదలైన పంట నష్టపరిహారానికి కూడా 1బీ రికార్డునే ప్రామాణికం చేసింది. అస్తవ్యస్తంగా ఉన్న రెవెన్యూ రికార్డులతో అర్హులైన రైతాంగానికి సైతం చిక్కులు మొదలయ్యాయి.
ముకరంపుర : ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న పంటనష్టపరిహారం(ఇన్పుట్ సబ్సిడీ) నిధులను విడుదల చేసిన ప్రభుత్వం.. పంపిణీకి రోజుకో నిబంధన విధిస్తోంది. 2009 నుంచి 2014 వరకు వడగళ్లు, అకాల వర్షాలు, తుపాన్లు, అనావృష్టితో పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం గత నెలలో రూ.105.98 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ మంజూరు చేసింది. ఈ నిధులు జిల్లా ఖజానాకు చేరాయి. అధికారులు, ఆదర్శరైతులు కలిసి తుది జాబితాలు రూపొందించారు. ఇందులో అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆందోళనలు జరగడం... జెడ్పీ సర్వసభ్య సమావేశంలో దుమారం లేవడంతో పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని కలెక్టర్ ఆదేశించిన విషయం తెలిసిందే.
1 బీ రిజిష్టర్, పహణీలో రైతుల పేర్లు, జాబితాలో రైతుల పేర్లను సరిచూసి అర్హుల జాబితా తయారు చేయాలని తహశీల్దార్లకు, వ్యవసాయశాఖకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఇప్పటికే విచారణ మొదలుపెట్టారు. ఈ నెల 23 వరకు 1బీ రిజిష్టర్ ఆధారంగా అర్హులను తేల్చి 30 లోగా ఇన్పుట్ సబ్సిడీ పంపిణీ చేయాలని ఆదేశించారు. దీంతో సొంత భూములుండి 1బీ రిజిష్టర్లో పేరు లేకుండా పరిహారం కోసం ఎదురుచూస్తున్న రైతాంగం ఆందోళన చెందుతోంది. భూములు రిజిస్ట్రేషన్ చేయించుకున్నా జమాబందీ అమలు కాక 1బీ రిజిష్టర్లో చాలా మంది రైతుల పేర్లు నమోదు కావడం లేదు.
దీంతో 1బీ రిజిష్టర్లో విక్రయించిన రైతుల పేర్లే ఉంటున్నాయి. ఈ భూములను సాగు చేసి పంటనష్టపోయిన రైతుల పరిస్థితి అయోమయంగా మారింది. పంట నష్టం వాటిల్లినప్పుడు రెవెన్యూ, వ్యవసాయాధికారులు రైతుల పేర్లు, ఎంత స్థలంలో నష్టం జరిగిందనే వివరాలు నమోదు చేసుకుంటారు. కొన్నిచోట్ల భూములు తండ్రి పేరిట ఉంటే తనయులు సాగుచేసుకుంటుంటారు. మరికొన్నిచోట్ల తండ్రి మరణానంతరం వారసత్వంగా సంక్రమించిన ఆస్తి కుమారుల పేరిట విరాసత్ కాకుండా రెవెన్యూ కార్యాలయాల్లో చాలా కేసులు పెండింగ్లో ఉన్నాయి.
కౌలు రైతులకు గుర్తింపుకార్డులు ఉంటేనే పరిహారం ఇవ్వాలని పేర్కొనడంతో కార్డులు లేని వారు ఆందోళన చెందుతున్నారు. మహదేవపూర్, కాటారంలో 70 శాతానికి పైగా 1 బీ రికార్డులే లేవు. ఆ ప్రాంతంలో నిరక్షరాస్యులు, అటవీ ప్రాంతంలో సాగుచేసుకునేవారు, అసలు పాస్పుస్తకాలే లేనివారు ఎందరో ఉన్నారు. అధిక వర్షాలతో ఆ ప్రాంతంలోనే ఎక్కువ నష్టం వాటిల్లినట్లు తెలుస్తున్నా... అక్రమాలు కూడా అక్కడే జరిగాయనే వాదన ప్రజాప్రతినిధుల నుంచి వినిపిస్తోంది.
అతీగతీ లేని ఆన్లైన్
భూముల వివరాలు ఆన్లైన్లో అందుబాటులో ఉంచాలన్న ఆశయం కార్యరూపం దాల్చడం లేదు. క్రయవిక్రయాల అనంతరం రికార్డుల్లో మార్పులు చేపట్టకపోవడంతో సమస్య మరింత జఠిలమవుతోంది. సరిగ్గా ఏడాది క్రితం ఇంటిగ్రేటెడ్ ఆఫ్ రెవెన్యూ అండ్ రిజిస్ట్రేషన్ రికార్డు ద్వారా ఆన్లైన్ జమాబందీని ప్రవేశపెట్టినా సక్రమంగా అమలుకావడం లేదు. ఈ పద్ధతితో వ్యవసాయ భూములకు పట్టా పహణీలు సులభమయ్యే అవకాశమున్నా అమలులో జాప్యం జరుగుతోంది.
భూముల వివరాలు సక్రమంగా కంప్యూటరీకరించకపోవడం... 1బీలో పేర్లు మార్చకపోవడంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటికే రుణమాఫీకి 1బీ రికార్డుల లింకుతో రుణాలు పొందిన అన్నదాతలు ఆందోళన చెందుతుండగా ఇప్పుడు పరిహారం పంపిణీకి కూడా ఇదే నిబంధన విధించడంతో అసలు తమకు పరిహారం అందుతుందా? లేదా? అని ఆవేదన చెందుతున్నారు.