'ఇప్పటికీ పశ్చాత్తాపం కనిపించడం లేదు'
గుంటూరు: ‘ఓ అమ్మాయికి అంతటి అన్యాయం జరిగినా.. ఇప్పటికీ మీలో పశ్ఛాతాపం కనిపించడం లేదు..’అంటూ రిషితేశ్వరి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్కిటెక్చర్ కళాశాల పూర్వ ప్రిన్సిపాల్ బాబూరావును ఉద్దేశించి న్యాయసేవాధికార సంస్ధ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి జి.లక్ష్మీనరసింహారెడ్డి వ్యాఖ్యానించారు. ఆచార్య నాగార్జున యూనివర్సీటీ విద్యార్ధిని రిషితేశ్వరి కేసులో ఆర్కిటెక్చర్ కళాశాల ప్రిన్సిపాల్ బాబూరావు, వార్డెన్ స్వరూపారాణిలు శుక్రవారంలో జిల్లా న్యాయసేవాధికార సంస్ధల ఎదుట హాజరయ్యారు. రిషితేశ్వరి మృతి కేసులో సాక్షి కధనాల ఆధారంగా సుమోటోగా తీసుకుని వారిద్దరికి ప్రీలిటికేషన్ కేసు కింద నోటీసులు పంపిన విషయం విదితమే.
నోటీసులు అందుకున్న ఇద్దరు ఈనెల 1న సంస్థ ఎదుట హాజరై వివరణ ఇచ్చారు. మరింత సమగ్ర సమాచారంతో రావాలని న్యాయమూర్తి వారిని ఆదేశిస్తూ 7వ తేదీకి వాయిదా వేశారు. ఇద్దరూ హాజరుకాగా ఇప్పటికే ఈ కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని, ప్రభుత్వం సుబ్రమణ్యం కమిటీ సైతం విచారణ జరుపుతున్న తరుణంలో ప్రిలిటికేషన్ కేసును కొనసాగించాల్సిన అవసరం లేదంటూ ఈ కేసును మూసివేస్తున్నట్లు న్యాయమూర్తి తెలిపారు.
మహిళా న్యాయవాదులు అధిక సంఖ్యలో హాజరై ప్రిన్సిపాల్ బాబూరావుకు విద్యార్ధిని మృతిపై ఎటువంటి పశ్ఛాతాపం కనపడటం లేదని న్యాయమూరి దృష్టికి తీసుకుని వచ్చారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి ప్రిన్సిపాల్ పదవిలో ఎవరూ ఉన్నా కానీ విద్యార్దిని మృతిపై పశ్ఛాతాపం వ్యక్తం చే స్తారని, కానీ మీలో అధి కనపడటంలేని బాబూరావుని ప్రశ్నించారు. సమాధానంగా బాబూరావు మాట్లాడుతూ జరిగిన సంఘటనపై తాను తీవ్రంగా పశ్ఛాతాపం చెందుతున్నానని తెలిపారు. పక్కనే ఉన్న ప్రిన్సిపాల్ కుమారుడిని నీవు ఏం చేస్తున్నావని యువకుడిని ప్రశ్నించగా ఇంటీరియల్ డెకరేషన్ చేస్తున్నట్లు సమాధానం తెలిపారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి లక్ష్మీనరసింహారెడ్డి ‘ముందు మీ తండ్రిని డెకరేట్ చేయాల్సిన అవసరం ఉంది’ అని వ్యాఖ్యానించారు. కేసు ముగిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.