Rs. 2
-
రూ.2కే ‘స్పైస్’జెట్!
టిక్కెట్టు కాదండీ... కంపెనీయే జాక్‌పాట్ కొట్టేసిన అజయ్ సింగ్ ♦ చరిత్రలో అత్యంత చౌకగా చేతులు మారిన లిస్టెడ్ కంపెనీ ఇదే ♦ 15 రోజుల్లోనే యాజమాన్య హక్కుల బదలాయింపు ♦ స్టాక్ మార్కెట్లకు ధర వెల్లడించకుండానే డీల్ పూర్తి ♦ రెండున్నరేళ్ల తర్వాత కోర్టు జోక్యంతో వెలుగులోకి (న్యూఢిల్లీ) రెండు రూపాయలకు ఏం వస్తాయో ఒకసారి ఠక్కున చెప్పండి చూద్దాం.. పిప్పర్మెంటో, చాక్లెట్టో తప్ప మరే భారీదీ గుర్తుకురావడం లేదు కదా!! అలాంటిది .. బోలెడన్ని విమానాలు, ఆస్తులు.. (అఫ్కోర్స్ అప్పులు కూడా ఉన్నా) ఒక పెద్ద విమానయాన కంపెనీ రెండే రూపాయలకు అమ్ముడైపోయిందన్న సంగతి మీకు తెలుసా!! ఆ కంపెనీ మరేదో కాదు.. స్పైస్జెట్టే!! అంత చౌకగా దాన్ని దక్కించుకున్నది ఆ కంపెనీ ఒకప్పటి వ్యవస్థాపకుడు, ప్రస్తుత చైర్మన్ అజయ్ సింగ్. సుమారు రెండున్నరేళ్ల క్రితం మూసివేతకు సిద్ధంగా ఉన్న చౌక టికెట్ల విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌ను అప్పట్లో మళ్లీ తన చేతుల్లోకి తీసుకున్నారు సంస్థ వ్యవస్థాపకుడు అజయ్ సింగ్. కంపెనీని నిలబెట్టారు. క్రమంగా మళ్లీ లాభాల బాట పట్టించారు. అయితే, స్పైస్‌జెట్‌ను మారన్ల నుంచి కొనుగోలు చేసేందుకు సింగ్ ఎంత చెల్లించారన్నది తెలిస్తే ఆశ్చర్యం కలగక మానదు. స్పైస్‌జెట్‌లో 58.46% వాటాలను ఆయన కేవలం రూ.2కే దక్కించుకున్నారు!! అవును! అక్షరాలా రెండే రూపాయలు!! దేశీ కార్పొరేట్ చరిత్రలో ఏ లిస్టెడ్ కంపెనీ కూడా ఇలాంటి ధరకు అమ్ముడవలేదు. 2015 జనవరిలో కేవలం 15 రోజుల్లోనే పూర్తయిపోయిన ఈ డీల్‌కు.. ఓపెన్ ఆఫర్ కూడా ప్రకటించాల్సిన అవసరం లేకుండా సింగ్‌కు వెసులుబాటు లభించింది. అప్పట్లో ఇది బయటకు కూడా రాలేదు!!. కానీ.. సుమారు రెండున్నరేళ్ల తర్వాత బయటికొచ్చిన ఈ విషయాలు మార్కెట్ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తాయి. అప్పట్లో స్పైస్‌జెట్ షేరు ధర రూ. 21.8గా ఉండేది. దాని ప్రకారం చూస్తే ప్రమోటర్ మారన్ వాటా విలువ రూ.765 కోట్లు. కానీ దీన్ని సింగ్ అత్యంత చౌకగా రెండే రూపాయలకు దక్కించుకున్నారు. ప్రస్తుతం షేరు ధర రూ. 125కి చేరింది. అంటే స్పైస్‌జెట్‌లో సింగ్ వాటాల విలువ ప్రస్తుతం సుమారు రూ.4,400 కోట్ల మేర ఉంటుంది. బయట పడిందిలా.. అప్పట్లో డీల్ విలువ గురించి ఇటు సింగ్, స్పైస్‌జెట్, అటు మారన్ ఎవరూ కూడా బైటపెట్టలేదు. లిస్టెడ్ కంపెనీలకు సంబంధించిన ప్రతి విషయమూ ఇన్వెస్టర్లకు తెలిసి తీరాల్సిందే అనే మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ సైతం ఈ వివరాలు వెల్ల డించాలని ఆదేశించలేదు. ఆ విధంగా అసలు డీల్ విలువ ఎంతనేది ఎవ్వరికీ తెలియకుండా ఒక లిస్టెడ్ కంపెనీ చేతులు మారిపోయింది. నిజానికి ఈ డీల్ విలువ రూ.2 అని అప్పట్లో మార్కెట్లో తెలిస్తే చరిత్ర వేరే విధంగా ఉండేదన్నది విశ్లేషకుల మాట. ఎందుకంటే కేవలం రెండ్రూపాయలకు స్పైస్‌జెట్‌ను ప్రమోటర్ విక్రయించేశారంటే దానికి విలువ లేదనేగా అర్థం!! అపుడు ఇన్వెస్టర్లు కూడా తమ షేర్లను అమ్ముకుని బయటపడటానికి ప్రయత్నించి ఉండేవారు. అదే జరిగితే షేరు ధర కుప్పకూలేది. కానీ డీల్ విలువ బయటపడకపోవటంతో సింగ్ చేతుల్లోకి కంపెనీ వెళ్తోందని తెలిసిన దగ్గరి నుంచీ షేరు ధర పెరగటం మొదలెట్టింది. డీల్ నిబంధనలను సింగ్ గౌరవించడం లేదంటూ మారన్ న్యాయపోరాటం సాగిస్తున్న దరిమిలా ఈ సమాచారం బయటికొచ్చింది. దీన్ని బ్లూమ్‌బర్గ్ వెల్లడించింది. ఈ వివరాల ప్రకారం స్పైస్‌జెట్ యాజమాన్య హక్కులు కేవలం 14 రోజుల్లో మారన్, కాల్ ఎయిర్వేస్ నుంచి సింగ్ చేతికి వచ్చాయి. అప్పులు, నష్టాల నుంచి లాభాల్లోకి .. ప్రస్తుతం మళ్లీ లాభాలు కళ్లజూస్తున్న స్పైస్‌జెట్... సుమారు రెండున్నరేళ్ల క్రితం 2014 డిసెంబర్లో నిధుల కటకటతో మూసివేత అంచున నిలబడింది. బాకీలు కట్టలేక చేతులెత్తేసింది. 2014–15లో కంపెనీ నష్టం రూ.687 కోట్లు. అదే ఏడాది నికర విలువ కూడా తుడిచిపెట్టుకుపోయి మైనస్ రూ.1,329 కోట్లకు పడిపోయింది. మొత్తం రుణ భారం రూ.1,418 కోట్లు కాగా, స్వల్పకాలిక వ్యవధుల కోసం తీసుకున్న రుణాలు రూ. 2,000 కోట్ల మేర ఉండేవి. కంపెనీని గట్టెక్కించే వ్యూహాత్మక ఇన్వెస్టర్ల కోసం ప్రమోటర్ మారన్ కుటుంబం అన్వేషించింది. చివరికి సింగ్ ముందుకొచ్చి కంపెనీని టేకోవర్ చేశారు. నష్టాలకు అడ్డుకట్ట వేసి మళ్లీ క్రమంగా లాభాల్లోకి మళ్లించారు. ఓపెన్ ఆఫర్ మినహాయింపు...! సెబీ నిబంధనల ప్రకారం ఏదైనా సంస్థను టేకోవర్ చేసి, యాజమాన్య హక్కులు దక్కించుకునేవారు కచ్చితంగా మిగతా పబ్లిక్ షేర్హోల్డర్లకు వైదొలిగే వెసులుబాటు కల్పిస్తూ ఓపెన్ ఆఫర్ ఇవ్వాలి. కానీ స్పైస్‌జెట్ కేసులో మాత్రం ఎయిర్‌క్రాఫ్ట్ చట్టం 1937 కింద డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్... 26% ఓపెన్ ఆఫర్ నుంచి సింగ్‌కు అసాధారణంగా మినహాయింపునిచ్చింది. సెబీని కాదని ఇలా మినహాయింపునిచ్చే హక్కు ఉందా? అనేది ఇప్పటికీ ప్రశ్నార్థకమే. -
అంచనాలను బీట్ చేసిన వేదాంత
ముంబై: ప్రముఖ మైనింగ్ సంస్థ వేదాంత లిమిటెడ్ క్యూ4 లో మెరుగైన ఫలితాలను ప్రకటించింది. అనిల్ అగర్వాల్ గ్రూప్ డైవర్సిఫైడ్ దిగ్గజం వేదాంత కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 2,988 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత ఏడాది రూ.21,104కోట్ల నష్టాలతో పోలిస్తే , మార్చి 31 తో ముగిసిన నాల్గవ త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ నికర లాభం 466.09 మిలియన్ డాలర్లుగా నమోదైంది. కమోడిటీ ధరలు, జింక్ వాల్యూములు పుంజుకున్న నేపథ్యంలో విశ్లేషకులు అంచనాలను బీట్ చేసింది. ముఖ్యంగా కైయిర్న్ ఇండియా లిమిటెడ్ కొనుగోలు తర్వాత రూ. 2,667 కోట్ల లాభాన్ని ఆర్జించనుందని విశ్లేషకులు అంచనా వేశారు. మొత్తం ఆదాయం సైతం 40 శాతం పెరిగి రూ. 23,691 కోట్లకు చేరింది. కన్సాలిడేటెడ్ ఆదాయం 35 శాతం పెరిగి రూ .24,612 కోట్లకు చేరింది. నిర్వహణ లాభం(ఇబిటా) రూ. 7,350 కోట్లు కాగా మార్జిన్లు 32.7 శాతంగా నమోదయ్యాయి. స్టాండెలోన్ ప్రాతిపదికన రూ. 1410 కోట్ల నికర లాభం ప్రకటించింది. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం బీఎస్ఈలో వేదాంతా షేరు 2 శాతం లాభపడింది. -
కేరళలో హవాలా రాకెట్ గుట్టు రట్టు
మలప్పురం: ఒకవైపు రద్దయిన నోట్ల డిపాజిట్లకు గడువు దగ్గర పడుతోంది. మరోవైపు నగదు మార్పిడిలో అక్రమార్కుల జోరు పెరిగింది. రద్దయిన పాతనోట్లుసహా కొత్త నోట్లు కూడా కోట్ల కొద్దీ పట్టుపడుతుండటం ఐటీ వర్గాలను సైతం కలవరపరువస్తోంది. ఈనేపథ్యంలో తాజాగా కేరళలోమరో హవాలా రాకెట్ ను ఛేదించిన పోలీసులు భారీ ఎత్తున కొత్త నోట్లను స్వాధీనం చేసుకున్నారు. రూ.39.98లక్షల విలువజేసే రూ.2వేల నోట్లను సీజ్ చేశారు. భారీ ఎత్తున నగదు మార్పిడికి పాల్పడుతున్నాడనే ఆరోపణలతో సోదాలు నిర్వంచగా ఈ నగదు పట్టుబడింది. ప్పటికే హవాలా కేసు ఎదుర్కొంటున్న స్థానిక వ్యాపారి షాబీర్ బాబు నుంచి వీటిని స్వాధీనం చేసుకున్నారు. మలప్పురం జిల్లాలో తిరురూ ప్రాంతంలో అక్రమాలకు పాల్పతుండగా ఈ నగదునుస్వాధీనం చేసుకున్నారు. షాబీర్ పాత రూ.500,1000నోట్ల మార్పిడిలో భాగంగా రూ.3 లక్షల కొత్త నోట్లను షాకత్ అలీకి (63)ఇచ్చిన కేసు విచారణలో రాకెట్ వెలుగు చూసింది. దీంతోపాటుగా అలీతో సహా మరో తొమ్మిదిమందికి కొత్త కరెన్సీ నోట్లను పంపిణీచేసినట్టు తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు చెప్పారు. కాగా తిరూర్ బస్సు స్టాండ్ వద్ద షౌకత్ ఆలీ రూ.3 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. పాలక్కాడ్ జిల్లాకు చెందిన ఆలీని అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ కోర్టులో హాజరు పర్చారు.అనంతరం జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించారు. -
నోట్లు తడపడంపై సుప్రీం సీరియస్!
న్యూఢిల్లీ : కొత్త రూ.2000 నోట్లు తడిపితే, రంగుపోతున్నాయంటూ నమోదైన పిటిషన్లపై అత్యున్నత ధర్మాసనం సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. నోట్లను ఎందుకు తడపారంటూ న్యాయవాదిని ప్రశ్నించింది. నోట్లను నీళ్లలో తడపవద్దంటూ చీఫ్ జస్టిస్ టీఎస్ థాకూర్, పిటిషనర్ల తరుఫు లాయర్ ఎంఎల్ శర్మకు సూచించారు. తడిపితే కొత్తనోట్లు రంగు పోతున్నాయంటూ.. ప్రధాని మోదీ ప్రకటించిన రూ.500, రూ.1000 నోట్ల రద్దును నిలిపివేయాలని కోరుతూ పలు పిటిషన్లు సుప్రీంలో దాఖలయ్యాయి. ఈ నోట్లలో రెండో రంగుగా కుసుంభ వర్ణం ఉందని, అది తడిపితే రంగుపోతుందని అధికారులు సైతం దృవీకరించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో జోక్యం చేసుకోవడానికి తిరస్కరించిన సుప్రీంకోర్టు, బ్యాంకులు, ఏటీఎంల వద్ద కట్టిన క్యూలైన్లు, అసౌకర్య పరిస్థితులపై ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రూ. 500, వెయ్యినోట్లను రద్దుచేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ప్రజలు నగదు మార్చుకోవడానికి బ్యాంకుల ముందు పడిగాపులు పడుతున్న సంగతి తెలిసిందే. సరికొత్త టెక్నాలజీ ఉపయోగించి తయారుచేసిన ఈ నోట్లను వాషింగ్ మెషిన్లో వేసిన ఓ వీడియో సైతం వైరల్ అయింది. నోట్లపై పలువురుకు ఉన్న అనుమానాలు ఈ వీడియో చూస్తే పటాపంచలవుతాయని, పేర్కొంటూ ఈ వీడియో పోస్టు అయింది. -
ఓలాలో భారీ పెట్టుబడులు
న్యూఢిల్లీ: దేశీయ ఆన్లైన్ ట్యాక్సీ సేవల సంస్థ ఓలా తన సర్వీసులను మరింతగా విస్తరించేందుకు పావులు కదుపుతోంది. ముఖ్యంగా ప్రధాన ప్రత్యర్థి ఉబెర్ కు చెక్ చెప్పాలని యోచిస్తోంది. ఈ క్రమంలోనే భారీ పెట్టుబడులను సమీకరిస్తోంది. తాజాగా జపాన్ బ్యాంక్ తో భారీ ఆఫర్ ఓలాకు లభించనుంది. జపాన్ కు చెందిన సాఫ్ట్ బ్యాంక్ కార్పొరేషన్ రూ 2,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది .క్యాబ్ ప్రపంచంలో ప్రత్యేకమైన పేరును సంపాదించిన ఓలా దేశంలో మరింత విస్తరించేందుకు వీలుగా ఈ పెట్టుబడి పెట్టనున్నట్టు సమాచారం. ప్రధానంగా క్యాబ్ అగ్రిగేటర్, అమెరికాకు చెందిన ప్రత్యర్థి ఉబెర్ కు పోటీగా ఈ పెట్టుబడులు పెట్టనుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే ఏఎన్ లై టెక్నాలజీస్ ప్రయివేట్ లిమిటెడ్ ఓలా జపనీస్ టెలికాం దిగ్గజం, ఇంటర్నెట్ మేజర్ ఇతర పెట్టుబడిదారుల నుంచి మరో 250 నుంచి 300 మిలియన్ డాలర్లనుపెట్టుబడులను సమీకరించనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. మరికొన్ని వారాల్లో దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది అయితే ఈ ఒప్పంద వార్తలపై స్పదించడానికి, ఓలా, సాఫ్ట్ బ్యాంక్ రెండూ నిరాకరించాయి. దేశంలో 4.5 లక్షల వాహనాలతో 100కుపైగా నగరాల్లో టాక్సీ సేవలుఅందిస్తున్న ఓలా సాఫ్ట్ బ్యాంక్ గ్రూప్, టైగర్ గ్లోబల్, మాట్రిక్స్ పార్టనర్స్, స్టెడ్ వ్యూ కాపిటల్, సీక్వోయాఇండియా, యాక్సెల్ పార్టనర్స్, ఫాల్కన్ ఎడ్జ్ సహా వివిధ పెట్టుబడిదారుల నుండి సుమారు రూ. 8,600 కోట్ల పెట్టుబడులను సమీకరించింది. భారత మార్కెట్లో తమ స్థానాన్ని బలోపేతం చేసుకోడానికి మరింత దూకుడుగా పెట్టుబడులు పెట్టేందుకు యోచిస్తున్నట్టు ఇటీవల, సాఫ్ట్ బ్యాంక్ గ్రూప్ అంతర్జాతీయ అధ్యక్షుడు అలోక్ సామ చెప్పారు. ఈ నేపథ్యంలోనే తన దాని రెండు అతిపెద్ద పెట్టుబడులు ఓలా, ఈ కామర్స్ దిగ్గజం స్నాప్ డీల్ ను ఎంచుకున్నట్టు కనిపిస్తోంది. మరోవైపు గతజూలైలో చైనా నిష్క్రమించిన తరువాత భారతదేశం లో దాని కార్యకలాపాలను బాగా విస్తరించనున్నట్టు ఉబెర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
పీఎన్బీ హౌసింగ్ ఫినాన్స్ ఐపీవోకు సెబీ ఓకే
ముంబై: పంజాబ్ నేషనల్ బ్యాంక్ హౌసింగ్ ఫినాన్స్ ఐపీవోకు మార్కెట్ రెగ్యులేటరీ సెబి నుం అనుమతి లభించింది. దీంతో రూ.2,500 కోట్లు సమీకరించేందుకు ఉద్దేశించిన పీఎన్బీ ఐపీవోకు రంగం సిద్ధమైంది. దీనికి సంబంధించిన ప్రాస్పెక్టస్ ను జులైలో సెబీకి సమర్పించారు. అయితే పబ్లిక్ ఆఫర్ కు ముందు అవసరమైన డ్రాప్ట్ డాక్యుమెంట్ అనుమతిపై తుది పరిశీలన పూర్తి చేసిన సెబీ అక్టోబర్ 6న ఈమేరకు అనుమతిని మంజూరు చేసింది. మూలధన అవసరాల నిమిత్తం సుమారు 35-37 శాతం మూలధన వాటాతో ఈ ఐపీవోకు వస్తోంది. అలాగే కొటక్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, మెర్రిల్ లించ్, జెఎం ఫైనాన్షియల్, జెపి మోర్గాన్ , మోర్గాన్ స్టాన్లీ గ్లోబల్ కోఆర్డినేటర్స్ గా ఉన్నాయి. లోన్ పోర్ట్ ఫోలియోలో వ్యాపార విస్తరణ, ఎఫర్డబుల్ హౌసింగ్ సెగ్మెంట్ లో నిర్దిష్ట లక్ష్యంపై దృష్టిపెట్టింది. తమ ఈక్విటీ వాటాల లిస్టింగ్ సంస్థ దూరదృష్టిని, తమ బ్రాండ్ ఖ్యాతి మరింత మెరుగుపడుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేసింది. కాగా పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్‌ను పంజాబ్ నేషనల్ బ్యాంకు ప్రమోట్ చేస్తోంది. 2016 మార్చితో నాటికి పీఎన్ బీ ఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ రూ 2,699.54 ఆదాయాన్ని, రూ 327.57 కోట్ల (పన్ను తర్వాత) లాభాన్ని నమోదు చేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కంపెనీలో 51 శాతం వాటా కలిగి ఉంది. ఉంది. అది జోడించారు. ఆపరేషన్ల నుండి ఆదాయం ఇదే కాలంలో రూ 2,699.54 కోట్లు నమోదైంది. -
టాటామోటార్స్ లాభాల్లో క్షీణత.. షేర్ జంప్
ముంబై: ప్రముఖ మోటారు వాహనాల ఉత్పత్తి సంస్థ టాటామోటార్స్ ఈ ఆర్థిక సంవత్సరానికి క్యూ1 ఆర్థిక ఫలితాలను శుక్రవారం ప్రకటించిది. కన్సాలిడేటెడ్ నికరలాభంలో క్షీణతను నమోదు చేయగా మొత్తం ఆదాయంలో వృద్ధిని సాధించింది. గత ఏడాది రూ.5,254 కోట్ల లాభాలతో పోలిస్తే నికర లాభాల్లో 57శాతం క్షీణించి రూ. 2,260 కోట్లుగా నమోదైంది. విక్రయాల్లో 10 శాతం వృద్ధిని సాధించి రూ. 66,101 కోట్లను ఆర్జించింది. మొత్తం ఆదాయం 9 శాతం పెరిగి రూ. 67,230 కోట్లుగా నమోదుచేసింది. గత ఏడాది జూన్ 30, 2015 తో ముగిసిన త్రైమాసికంలో ఇది 61,734 కోట్లుగా ఉంది. నిర్వహణ లాభం(ఇబిటా) 31 శాతం క్షీణించి రూ. 7613 కోట్లకు చేరగా, ఇబిటా మార్జిన్లు 17.9 శాతం నుంచి 11.4 శాతానికి బలహీనపడ్డాయి. ఈ కాలంలో పన్ను వ్యయాలు రూ. 1649 కోట్ల నుంచి రూ.720 కోట్లకు తగ్గగా, ఇతర ఆదాయం కూడా రూ. 220 కోట్ల నుంచి రూ. 174 కోట్లకు క్షీణించింది. అయితే మార్కెట్ లో టాటా మోటార్స్ షేర్ 4 శాతం జంప్ అయింది. -
'ఎంఐ నోట్ 5' ధర తగ్గిందోచ్!
చైనా స్మార్ట్ ఫోన్ మేకర్ షియోమి తన కొత్త ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ ధరను తగ్గించుకుంది. ఊహించినట్టుగానే షియామి ఎంఐ నోట్ 5 పేరుతో భారత్ లో లాంచ్ అయిన ఈ మొబైల్ ధరను రెండువేల రూపాయలు తగ్గించింది. ఈ మేరకు కంపెనీ ఇండియా హెడ్ మను జైన్ మంగళవారం ట్విట్ చేశారు. ఫ్లిప్ కార్ట్, ఎంఐ. కాం ద్వారా అందుబాటులో వున్న దీని ధరను 22,999 లుగా ప్రకటించింది. గత రెండు సంవత్సరాలలో భారతదేశం లో తమ అమ్మకాలు 72 శాతం పెరిగాయని ప్రకటించిన తర్వాత ఈ తగ్గింపు ఆఫర్ ఇచ్చింది. మార్చి లో లాంచ్ సందర్బంగా దీని ధరను రూ. 24, 999 గా కంపెనీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. 820 క్వాల్కం స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్, 5.5 ఫుల్ హెచ్ డీ స్క్రీన్ (1080x1920 ఎంపీ) 32జీబీ 3000 ఎంఏహెచ్ బ్యాటరీ 16 మెగాపిక్సెల్ కెమెరా తదితర ఫీచర్లు ఈ ఫోన్ లో అందుబాటులో ఉన్నాయి. #Mi5 for Rs. 22,999 ☺️☺️ Starting today, we are announcing a permanent price drop for Mi 5. Buy it from Mi. com and @Flipkart. @XiaomiIndia — Manu Kumar Jain (@manukumarjain) August 23, 2016 -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లాభం 23% అప్
ముంబై: ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ4(జనవరి-మార్చి)లో రూ. 2,327 కోట్ల నికర లాభాన్ని సాధిం చింది. గతేడాది ఇదే క్వార్టర్లో ఆర్జించిన రూ. 1,890 కోట్లతో పోలిస్తే ఇది 23% అధికం. గత పదేళ్ల కాలంలో ఒక క్వార్టర్లో సాధించిన అతి తక్కువ వృద్ధి ఇదే కావడం గమనార్హం. బ్యాంకు గత 37 క్వార్టర్లుగా నికర లాభాల్లో 30%పైగా వృద్ధిని సాధిస్తూరాగా, మూడు క్వార్టర్లుగా 25%పైబడ్డ వృద్ధి నమోదైంది. ఇక ఇదే కాలానికి బ్యాంకు ఆదాయం కూడా దాదాపు 15% పుంజుకుని రూ. 12,790 కోట్లను తాకింది. నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) సైతం 15%పైగా ఎగసి రూ. 4,953 కోట్లకు చేరింది. వాటాదారులకు షేరుకి రూ. 6.85 డివిడెండ్‌ను చెల్లించనుంది. ఈ బాటలో పూర్తి ఏడాదికి(2013-14) బ్యాంకు 26% వృద్ధితో రూ. 8,478 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఇక మొత్తం ఆదాయం రూ. 41,917 కోట్ల నుంచి రూ. 49,055 కోట్లకు పెరిగింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన కూడా బ్యాంకు నికర లాభం 27% జంప్‌చేసి రూ. 8,743 కోట్లను అధిగమించింది. నికర వడ్డీ మార్జిన్లు(ఎన్ఐఎం) 4.4%గా నమోదయ్యాయి. తగ్గిన ప్రొవిజన్లు... బ్యాంకు ఆస్తులకు సంబంధించి పునర్వ్యవస్థీకరించిన రుణాలు లోన్‌బుక్‌లో 0.2%గా నమోదయ్యాయి. మొండిబకాయిలకు కేటాయింపులు(ప్రొవిజన్లు) రూ. 300 కోట్ల నుంచి రూ. 286 కోట్లకు తగ్గాయి. గత కొన్ని క్వార్టర్లుగా సమస్యలు తె చ్చిపెడుతున్న వాణిజ్య వాహనాలు, కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ ఫైనాన్సింగ్ కుదుటపడుతున్నట్లు బ్యాంక్ తెలిపింది. క్యూ4లో అడ్వాన్సులు 21.8% పుంజుకోగా, డిపాజిట్లు 16.9% పెరిగాయి. ఫలితాల నేపథ్యంలో బ్యాంకు షేరు బీఎస్ఈలో 1.4% లాభపడి రూ. 726 వద్ద ముగిసింది.