29 శాతం పెరిగిన ఇండస్ఇండ్ బ్యాంక్ లాభం
ముంబై: హిందుజా గ్రూప్ సారథ్యంలోని ఇండస్ఇండ్ బ్యాంక్ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో 29 శాతం పెరిగింది. ఇతర ఆదాయం ఊతంతో రూ. 447 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో నికర లాభం రూ. 347 కోట్లు. తాజా క్యూ3లో నికర వడ్డీ ఆదాయం (ఎన్ఐఐ) 18% మేర పెరిగి రూ. 861 కోట్లకు, ఇతర ఆదాయం 27% పెరిగి రూ. 611 కోట్లకు చేరింది. ఇక నికర వడ్డీ మార్జిన్ స్వల్పంగా 3.65 శాతం నుంచి 3.67 శాతానికి పెరిగింది. కొన్ని కార్పొరేట్ రుణాలను పునర్వ్యవస్థీకరించినప్పటికీ.. నికర నిరర్ధక ఆస్తులు 0.32 శాతం స్థాయిలోనే ఉన్నట్లు బ్యాంక్ పేర్కొంది. నికర వడ్డీ మార్జిన్లు మెరుగుపడటం, వ్యయాలను తగ్గించుకోగలగడం వంటి అంశాలతో క్యూ3లో లాభాలు గణనీయంగా పెరిగాయని ఇండస్ఇండ్ బ్యాంక్ సీఈవో రమేష్ సోబ్తి తెలిపారు.