ఏదో అనుకుంటే.. ఇంకేదో జరిగిందే..
జామీనుదారులకు భారీ జరిమానా
ఒక్కొక్కరికి రూ.50 వేలు
తిరుపతిలో నాలుగో అదనపు జడ్జి తీర్పు
డబ్బుకు కక్కుర్తిపడి ముక్కూ ముఖం తెలియని నిందితులకు.. జామీను ఇస్తే.. మొదటికే మోసం వస్తుందన్న విషయం మరోసారి తిరుపతి కోర్టు సాక్షిగా.. తేటతెల్లమైంది. మహిళా చైన్ స్నాచర్లు ఇచ్చిన మొత్తానికి ఆశపడిన ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు.. మొదట వారికి జామీను ఇచ్చారు. చివరికి వారిని సకాలంలో తిరిగి కోర్టులో ప్రవేశపెట్టలేకపోయారు. దీంతో ఏకంగా ఒక్కొక్కరు రూ. 50 వేలు జరిమానాగా చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడింది.
తిరుపతి లీగల్: ప్రభుత్వ ఉద్యోగులై ఉండి చిన్న మొత్తానికి ఆశపడి తెలియని వ్యక్తులకు జామీను ఇచ్చి, నిందితులను కోర్టులో హాజరుపరిచని ఒక్కొక్కరికీ రూ. 50 వేలు జరిమానా చెల్లించాలని తిరుపతి అదనపు జూనియర్ జడ్జి సన్యాసినాయుడు మంగళవారం తీర్పు ఇచ్చారు. కేసు వివరాల్లోకి వెళితే ఢిల్లీకి చెందిన ఇందుమతి, తాయమ్మ 2014లో శ్రీనివాసమంగాపురంలో బ్రహ్మోత్సవాలు జరుగుతుండగా ఆరుగురు మహిళా భక్తుల వద్ద బంగారు చైన్లను అపహరించుకెళ్లారు.
దీనిపై చంద్రగిరి పోలీసులు ఆ ఇద్దరి మహిళలపై కేసులు నమోదు చేశారు. అనంతరం రిమాండ్‌కు తరలిం చారు. ఇద్దరి తరఫున ఓ న్యాయవాది బెయిల్ పిటీషన్ దాఖలు చేయగా కోర్టు ఒకొక్క క్రైంలో రూ.10 వేలు, ఇద్దరు జామీనుదారుల పూచీకత్తుపై విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తిరుపతి అగ్రికల్చరల్ కళాశాలలో ఉద్యోగులుగా ఉన్న తిరుపతి రూరల్ మండలం పేరూరుకు చెందిన మునికృష్ణయ్య, రంగనాథ్ నిందితులకు జామీను ఇచ్చారు. ఆ తర్వాత నిందితులు ఇద్దరూ జైలు నుంచి విడుదలై పరారయ్యారు. ఇంతవరకు కోర్టుకు హాజరు కాలేదు.
దీంతో న్యాయమూర్తి ఆ ఇద్దరికి జామీను ఇచ్చిన మునికృష్ణయ్య, రంగనాథ్‌కు నోటీసులు ఇచ్చారు. అరుునా కూడా ఇద్దరు నిందితురాళ్లను కోర్టులో హాజరుపరచలేక పోయారు. దీంతో న్యాయమూర్తి జామీనుదారులు ఒక్కొక్కరికి రూ.50 వేలు చొప్పున జరిమానా చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేశారు. మంగళవారం ఇద్దరూ కోర్టులో జామీను సొమ్ము చెల్లించారు. అలాగే వీరు మరో కేసులో కూడా సొమ్ము చెల్లించాల్సి ఉండడం గమనార్హం.