బస్సుల్లో స్వైప్ మిషన్లు తప్పనిసరి
అనంతపురం సెంట్రల్ : పెద్ద నోట్ల రద్దు వల్ల ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా అన్ని బస్సుల్లోనూ స్వైప్ మిషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్టీఓ శ్రీధర్ తెలిపారు. ఆయన బుధవారం ఆర్టీఓ కార్యాలయంలోని తన ఛాంబర్లో జిల్లాలోని ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఆర్టీసీ బస్సుల్లోనూ స్వైప్ మిషన్లు ఏర్పాటు చేస్తున్నారని, మీరు కూడా సమకూర్చుకోవాలని ఆదేశించారు. దీనివల్ల అకౌంట్లలో డబ్బులున్న ప్రయాణికులు ఆన్లైన్లో టికెట్ ధర చెల్లించే వీలు ఉంటుందన్నారు.
శుభకార్యాలు, టూర్లకు వెళ్లేవారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. అందువల్ల ప్రభుత్వ ఆదేశాలనుసరించి ప్రతి ఒక్కరూ స్వైప్ మిషన్లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. అలా కాకుండా ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ మధుసూదన్, ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులు మోహన్‌రాజు, సుధీర్‌కుమార్, ఖాన్, రఘునాథ్, అలీఖాన్ తదితరులు పాల్గొన్నారు.