సాగర్ సబ్ కాంట్రాక్టర్ చేతివాటం
ప్రతిష్టాత్మకమైన రామతీర్థ సాగర్ పనుల్లో సబ్ కాంట్రాక్టర్ చేతివాటం లారీ యజమానులను రోడ్డెక్కించింది. నెలల తరబడి చెల్లించాల్సిన రూ.లక్షలు ఇవ్వకపోవడంతో విసిగిపోయిన లారీ యజమానులు గురువారం సహనం కోల్పోయారు. పనులు జరిగిన చోటే లారీలను నిలిపివేసి నిరసన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కరించకపోతే నిరసన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. దీంతో పనులు నిలిచిపోయాయి.
పూసపాటిరేగ(నెల్లిమర్ల): మండలంలోని కుమిలి గ్రామ సమీపంలో నిర్మాణంలో ఉన్న రామతీర్థసాగర్ రిజర్వాయరు పనుల్లో భాగస్వాములైన లారీ యజమానులకు సబ్ కాంట్రాక్టర్ టోకరా వేయడంతో పనులు నిలిపివేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. 45 రోజులుగా బిల్లులు చెల్లించకపోవడంతో పనులు జరిగిన చోటే ఆకలి మంటలతో గడుపుతున్నామని లారీ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్చి నెల 24 నుంచి నుండి టిప్పర్లతో నిర్మాణ పనులు చేయడానికి పైడిమాంబ ఇన్ఫ్రా లిమిటెడ్‌కు చెందిన సబ్ కాంట్రాక్టర్ విజయవాడకు చెందిన లక్ష్మీనరిసింహస్వామి లారీ అసోసియేషన్ వద్ద పనులు చేయడానికి ఒప్పందం కుదిరింది.
లారీ ఒక్కింటికి నెల రోజులకు రూ.1.70 లక్షలు చొప్పున ఇవ్వడానికి సబ్‌కాంట్రాక్టర్ అంగీకరించాడు. 50 రోజులవుతున్నా సుమారు రూ.18 లక్షలు బకాయిలు లారీ యజమానులకు ఇవ్వాల్సి ఉన్నప్పటికి సబ్ కాంట్రాక్టర్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి లారీ యజమానులకు బురిడీ కొట్టించాడు. పైడిమాంబ ఇన్ఫ్రాకు చెందిన వెంకటాచలం గూర్చి వాకాబు చేసిన ఫలితం లేకుండా పోయింది. దీంతో లారీ యజమానులు ప్రదాన కాంట్రాక్టర్ ఎస్సీఎల్ కన్‌స్ట్రక్షన్‌ను కలిసి జరిగిన విషయం చెప్పడంతో మాకు సంబందం లేదని చేతులెత్తేశారు.
దీంతో రిజర్వాయర్ పనులు జరిగిన చోట లారీలను నిలిపివేసి ఆకలి మంటలుతో గడుపుతున్నారు. రెండు రోజులులో లారీ అద్దెలు చెల్లించకపోతే ఆత్మహత్యలు చేసుకుంటామని లారీ యజమానులు హెచ్చరించారు. అధికార పార్టీ అండతో బినామీ వ్యక్తులకు కాంట్రాక్టులు ఇచ్చి మోసాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే లారీ యజమానులకు బిల్లులు చెల్లించే ఏర్పాటు చేయకపోతే ఉద్యమిస్తామని లారీ యజమానులు హెచ్చరించారు.