కిష్ట్వార్లో మళ్లీ హింసాకాండ
జమ్మూ/శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌లోని కిష్ట్వార్ జిల్లాలో సోమవారం మళ్లీ హింసాకాండ చెలరేగింది. ఇక్కడ శుక్రవారం తలెత్తిన మత ఘర్షణలకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొన్న జమ్మూ కాశ్మీర్ హోంశాఖ సహాయ మంత్రి సాజద్ కిచ్లూ సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా హింసాకాండపై జ్యుడీషియల్ దర్యాప్తుకు ఆదేశించారు. ఘర్షణలపై నివేదిక పంపాలని కేంద్రం కాశ్మీర్ సర్కారును కోరింది. కాగా, జమ్మూ ప్రాంతంలో శాంతి సామరస్యాలను కాపాడాలని గవర్నర్ ఎన్.ఎన్.వోరా ప్రజలకు పిలుపునిచ్చారు. మరోవైపు, కిష్ట్వార్ జిల్లా హిద్యాల్ ప్రాంతంలో సోమవారం జరిగిన తాజా ఘర్షణల్లో ఏఎస్పీ కుల్బీర్ సింగ్ సహా పదిమంది గాయపడ్డారు.
కాగా, మంత్రి కిచ్లూ రాజీనామా విషయాన్ని ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ‘ట్విట్టర్’ ద్వారా వెల్లడించారు. కిచ్లూ రాజీనామాను గవర్నర్ ఎన్.ఎన్.వోరా ఆమోదించినట్లు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. కిష్ట్వార్లో శుక్రవారం చెలరేగిన ఘర్షణలకు మంత్రి కిచ్లూనే కారకుడని, ఆయనను పదవి నుంచి తప్పించాలని బీజేపీ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. కిష్ట్వార్ ఘర్షణల దరిమిలా జమ్మూ ప్రాంతంలోని ఏడు జిల్లాల్లో కర్ఫ్యూ విధించగా, సోమవారం ఉధామ్‌పూర్ జిల్లాలో రెండు గంటల సేపు కర్ఫ్యూను సడలించారు. ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయాలని డిమాండ్ చేస్తూ జమ్మూ కాశ్మీర్ నేషనల్ పాంథర్స్ పార్టీ (జేకేఎన్‌పీపీ) ఉధామ్పూర్లో డిప్యూటీ కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా చేసింది.
ఇదిలా ఉండగా, కిష్ట్వార్ జిల్లాలో చెలరేగిన హింసాకాండలో ముగ్గురు మరణించగా, 68 దుకాణాలను, ఏడు హోటళ్లను, 35 వాహనాలను అల్లరి మూకలు ధ్వంసం చేశాయని జమ్మూ కాశ్మీర్ హోంశాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ కుమార్ చెప్పారు. హింసాకాండకు సంబంధించి ఇప్పటి వరకు పదిమందిని అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. కాగా, కిష్ట్వార్, జమ్మూ, రాజౌరీ, ఉధామ్‌పూర్, సాంబా, రియాసీ జిల్లాలతో పాటు దోడా జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ అమలవుతోంది. సైనిక బలగాలు ఈ ప్రాంతాల్లో వీధుల్లో గస్తీ తిరుగుతున్నాయి. ఇదిలా ఉండగా, శ్రీనగర్‌లో సోమవారం నిరసన ర్యాలీ తలపెట్టిన జేకేఎల్ఎఫ్ అధ్యక్షుడు మహమ్మద్ యాసిన్ మాలిక్, ఉపాధ్యక్షుడు బషీర్ అహ్మద్ భట్‌లతో పాటు మరో పాతిక మందిని పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా నిర్బంధంలోకి తీసుకున్నారు.
బీజేపీపై కిచ్లూ ప్రతి విమర్శలు...
తనపై ఆరోపణలు రావడంతో మంత్రి పదవికి రాజీ నామా చేసిన కిచ్లూ, తనపై విమర్శలు చేసిన బీజేపీపై ప్రతి విమర్శలు సంధించారు. దర్యాప్తు నిష్పాక్షికంగా జరిగేందుకు వీలుగా తాను పదవికి రాజీనామా చేశానని ఆయన చెప్పారు. ‘గోధ్రా హింసాకాండ తర్వాత గుజరాత్ సీఎం నరేంద్ర మోడీ రాజీనామా చేశారా?... ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ప్రచారకర్తగా ఉన్న అమిత్ షా సంగతేమిటి? అని ప్రశ్నించారు.
డార్జిలింగ్‌లో 15 నుంచి నాలుగు రోజులు బంద్ సడలింపు
డార్జిలింగ్: గూర్ఖాలాండ్ డిమాండ్‌పై డార్జిలింగ్ పర్వతప్రాంతంలో కొనసాగిస్తున్న నిరవధిక బంద్‌ను ఆగస్టు 15 నుంచి నాలుగు రోజుల పాటు సడలిస్తున్నట్లు గూర్ఖా జనముక్తి మోర్చా (జీజేఎం) సోమవారం ప్రకటించింది. అయితే, మంగళవారం నుంచి రెండు రోజుల పాటు ‘జనతా కర్ఫ్యూ’ చేపడతామని, ప్రజలంతా ఇళ్లకే పరిమితమవుతారని వెల్లడించింది. నిరవధిక బంద్ విరమణకు పశ్చిమ బెంగాల్ సర్కారు విధించిన 72 గంటల గడువు ముగియడంతో జీజేఎం సోమవారం అఖిలపక్ష భేటీని ఏర్పాటు చేసింది.