తెలంగాణ ఉద్యోగిపై దాడి చేయలేదు: సమైక్యాంధ్ర విద్యుత్ జేఏసీ
'మేము ఏ తెలంగాణ ఉద్యోగిపై దాడి చేయలేదు' అని సమైక్యాంధ్ర విద్యుత్ జేఏసీ ఓ ప్రకటనలో తెలిపింది. తెలంగాణ ఉద్యోగులు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదు అని విద్యుత్ జేఏసీ నాయకులు ఖండించారు. తెలంగాణ ప్రాంతం నేతలు ఎంత రెచ్చగొట్టినా తాము సమైక్యాంధ్ర నినాదాన్నే వినిపిస్తామని సమైక్యాంధ్ర విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నాయకులు స్పష్టం చేశారు.
విద్యుత్‌సౌధలో తెలంగాణ ఉద్యోగిపై సీమాంధ్ర ఉద్యోగులు దాడి చేశారని ఆరోపిస్తూ సోమవారం మధ్యాహ్నం తెలంగాణ ఉద్యోగ సంఘాలు ధర్నా చేపట్టాయి. విద్యుత్ సౌధలో తెలంగాణ సంఘాల ధర్నా నేపథ్యంలో అక్కడికి వచ్చిన టీఆర్ఎస్ నేతలు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్, విద్యాసాగర్ కార్యాలయం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో గందరగోళం నెలకొంది. హరీశ్, ఈశ్వర్, విద్యాసాగర్ లను పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. పరిస్థితి అక్కడ విషమించడంతో వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.
నగరంలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో సీమాధ్ర ఉద్యోగుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాల ఉద్యోగులు భావోద్వేగాలతో కార్యాలయాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. అబిడ్స్‌లోని దేవాదాయశాఖ కార్యాలయంలో ఉద్యోగులు తెలంగాణకు అనుకూలంగా వ్యతిరేకంగా పోటాపోటీ నినాదాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.