పల్లెల స్వచ్ఛతతోనే బంగారు తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: ఆర్థికాభివృద్ధితో పాటు రాష్ట్రంలోని ప్రజలంతా ఆరోగ్యంగా ఉంటేనే బంగారు తెలంగాణ కల సాకారమవుతుందని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత అన్నారు. మంగళవారం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్‌లో యూనిసెఫ్, మారి సంస్థలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన‘స్వచ్ఛ తెలంగాణకు సర్పంచుల సదస్సు’ను ఆమె ప్రారంభించారు. సునీత మాట్లాడుతూ.. మహిళల ఆత్మగౌరవానికి సంబంధించిన మరుగుదొడ్ల నిర్మాణాన్ని ఉద్యమ స్ఫూర్తితో కొనసాగించాలని సర్పంచులకు పిలుపునిచ్చారు. దశాబ్దాల కలగా ఉన్న ప్రత్యేక రాష్ట్రాన్ని సాధిం చుకున్న ప్రజలకు తెలంగాణను బహిరంగ మల విసర్జన రహిత రాష్ట్రంగా మార్చడం పెద్ద కష్టమైనదేమీ కాదన్నారు. సర్పంచ్ అంటే చిన్నస్థాయి అనుకోనక్కర్లేదని, పట్టుదలతో పనిచేస్తే ఢిల్లీదాకా వె ళ్లొచ్చని... అందుకు తానే ఓ ఉదాహరణ అని అన్నారు.
మూడేళ్ల తర్వాత స్వచ్ఛ భారత్ ఫలితాలు
స్వచ్ఛ భారత్ ఉద్యమ ఫలితాలు మూడేళ్ల తరువాత అందరికీ అనుభవంలోకి రానున్నాయని యునిసెఫ్ హైదరాబాద్ చీఫ్ రూత్ లాస్కానో లియానో అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఓడీఎఫ్‌గా మార్చితే ఎంతోమందిని భయంకరమైన వ్యాధుల నుంచి రక్షించగలుగుతామన్నారు. రాష్ట్రంలో ఇప్పటికీ 27.5 లక్షల కుటుంబాల్లో మరుగుదొడ్లు లేవని, గ్రామాల వారీగా లక్ష్యాలను ఏర్పరచుకొని అన్ని కుటుంబాల్లో మరుగుదొడ్లు నిర్మించాలని సూచించారు. సిరిసిల్ల, వేములవాడ, సిద్దిపేట్ నియోజకవర్గాలను ఇప్పటికే ఓడీఎఫ్‌గా ప్రకటించగా, త్వరలో మరో ఐదు నియోజకవర్గాలను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నాయని చెప్పారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ జాయింట్ కమిషనర్ జాన్‌వెస్లీ, స్వచ్ఛ భారత్ మిషన్ ప్రాజెక్ట్ డెరైక్టర్ రాములు నాయక్, ఎస్బీఎం(గ్రామీణ)డెరైక్టర్ రామ్మోహన్, మారి సంస్థ కార్యదర్శి ఆర్.మురళి, వివిధ జిల్లాల నుంచి మండల పరిషత్ అధికారులు, 475గ్రామాల నుంచి సర్పంచులు పాల్గొన్నారు.