ఘనంగా శ్రీపాద సార్ధశత జయంతి
రాజమహేంద్రవరం కల్చరల్ :
మహాకవి శ్రీపాద కృష్ణమూర్తి శాస్తి్ర తన ప్రతిభాపాటవాలలో మరో కవిసార్వభౌముడు శ్రీనాథునికి సరితూగుతారని మహామహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణ అన్నారు. రాజమహేంద్రవరం త్యాగరాజ నారాయణదాస ప్రాంగణంలోని ఉపమందిరంలో శుక్రవారం జరిగిన శ్రీపాద సార్ధశతజయంతి (150వ జయంతి) ఉత్సవంలో ఆయన ప్రసంగించారు. వేదం, శ్రౌతం, స్మార్తం చదువుకున్న అరుదైన కవి శ్రీపాద అని కొనియాడారు. రామాయణ, భారత, భాగవతాలను ఒంటిచేత్తో రచించిన మహాకవి శ్రీపాద.. వేదవ్యాస భాగవతాన్ని కేవలం నాలుగు నెలల పరిధిలో ఆంధ్రీకరించారన్నారు. సభకు అధ్యక్షత వహించిన ఆచార్య బేతవోలు రామబ్రహ్మం, ప్రవచన రాజహంస డాక్టర్ ధూళిపాళ మహాదేవమణి, విశ్రాంత ప్రిన్సిపాల్, మహామహోపాధ్యాయ దోర్బల ప్రభాకర శర్మ, సీనియర్ న్యాయవాది పోతుకూచి సూర్యనారాయణ మూర్తి ప్రసంగించారు. అనంతరం సార్థశతజయంతి ప్రత్యేక సంచి కను బేతవోలు రామబ్రహ్మం ఆవిష్కరించారు. శ్రీపాద మునిమనుమడు శ్రీరామ్ మాట్లాడుతూ తిధుల ప్రకారం రాజమహేంద్రవరంలో శ్రీపాద జయంతిని నిర్వహించినట్టే విశాఖలో ఈనెల 29న తేదీల ప్రకారం శ్రీపాద జయంతిని జరుపుతున్నారన్నారు. వీఎస్ఎస్ కృష్ణకుమార్ స్వాగత వచనాలు పలికారు.