తలపాగా విప్పి నలుగురిని కాపాడాడు...
సంగ్రూర్ (పంజాబ్): మత ఆచారాన్ని సైతం పక్కన పెట్టి నలుగురు యువకుల ప్రాణాలు కాపాడేందుకు ఓ యువకుడు చేసిన ప్రయత్నం అతడిని హీరోని చేసింది. అతడే 24 ఏళ్ల ఇందర్ పాల్ సింగ్. మత ఆచారాన్ని మించి అతడు చూపించిన మానవత్వానికి అందరూ జేజేలు కొడుతున్నారు. సిక్కులు అనే కాదు ఎవరైనా సరే వారి మత ఆచారాలను పక్కన పెట్టాలంటే ఒకటికి పది సార్లు ఆలోచిస్తారు. కానీ ఈ యువకుడు మాత్రం సాటి వ్యక్తులను కాపాడటమే తన ప్రథమ కర్తవ్యంగా భావించి తలపాగాను తీసి, మరో సిక్కు యువకుడి సహాయంతో వారిని రక్షించాడు.
గణేష్ నిమజ్జనంలో భాగంగా సునం గ్రామానికి చెంవదిన నలుగురు యువకులు ఇంద్రపాల్ సింగ్, జీవన్ సింగ్, కమల్ ప్రీత్ సింగ్, ఇందర్ తివారీ కెనాల్ గోడపై నిలుచున్నారు. అనుకోకుండా ఒకే సారి పెద్ద ఎత్తున నీరు రావడంతో అదుపుతప్పి వాళ్లు నీళ్లలో పడిపోయారు. కెనాల్ లో నలుగురు యువకులు చిక్కుకుని కొట్టుకుపోవడాన్ని ఇందర్ పాల్ సింగ్ గమనించాడు.
వీరిని కాపాడటానికి తొలుత ఒక వైరుని వీళ్లకి అందించాడు. కానీ అది తెగిపోవడంతో మరోదారిలేక అక్కడే గట్టుపై కూర్చున్న ఇంద్రపాల్ సింగ్ తన తలపాగాని తీసి వారికి ఇచ్చాడు. ఒడ్డు పైనే ఉన్న మరో సిక్కు యువకుడు ఆ తల పాగా సహాయంతో నలుగురు యువకులు నీళ్లలో కొట్టుకు పోకుండా ఒక్కొక్కరిని ఒడ్డుకు లాగి కాపాడాడు. ఈ సంఘటనను అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. ఈ వీడియోని చూసిన వారందరు ఇందర్ పాల్ చూపించిన మానవత్వానికి జేజేలు కొడుతున్నారు.