కెనడా వీసా పేరుతో దోచేశారు..
హైదరాబాద్: నగరానికి చెందిన ఓ వ్యక్తికి క్వికర్ వెబ్సైట్ ద్వారా పరిచయమైన కొందరు వ్యక్తులు వర్క్ పర్మిట్ వీసా పేరుతో టోకరావేశారు. పోలీసుల తెలిపిన వివరాలు.. ఫలక్‌నుమా సంజయ్‌గాంధీనగర్‌కు చెందిన సయ్యద్ గౌస్ వృత్తిరీత్యా టైలర్. ఇతడికి 2015 నవంబర్‌లో క్వికర్ వెబ్సైట్ ద్వారా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన ది వీసా హబ్ నిర్వాహకుల వివరాలు తెలిశాయి. దీంతో వారిని సంప్రదించిన గౌస్ తనకు కెనడాలో వర్క్ పర్మిట్ వీసా కావాలని కోరాడు. దీనికి అంగీకరించిన నిందితులు మొత్తం రూ.3.8 లక్షలు ఖర్చవుతోందని చెప్పారు. ఇందులో రూ.70 వేలు ఇక్కడ, మరో మిగిలిన మొత్తం కెనడా వెళ్ళిన తర్వాత అక్కడి తమ లాయర్‌కు చెల్లించాలని చెప్పారు.
దీనికి అంగీకరించిన గౌస్ తొలుత రూ.10 వేలు నిందితులు సూచించిన బ్యాంకు ఖాతాల్లోకి జమ చేశారు. ఓ ఒప్పందం పత్రాన్ని పంపిన నిందితులు దానిపై సంతకం చేసి పంపాల్సిందిగా కోరారు. వారు చెప్పినట్లే సంతకాలు చేసిన గౌస్ కొరియర్ ద్వారా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఉన్న ది వీసా హబ్ కార్యాలయానికి పంపారు. దీన్ని అందుకున్న తర్వాత రెండు నెలల్లో వీసా వస్తుందని నమ్మించిన మోసగాళ్ళు మరో రూ.60 వేల బ్యాంకు ఖాతాల్లో జమ చేయించుకున్నారు. ఆపై గౌస్ దాదాపు ఆరు నెలల పాటు ఎదురు చూసినా.. వాయిదాలే మిగిలాయి.
చివరకు విసిగిపోయిన బాధితుడు తాను చెల్లించిన మొత్తం తిరిగి ఇవ్వాల్సిందిగా కోరాడు. దీంతో అనేక వాయిదాలు వేసిన నిందితులు చివరకు తమతో చేసుకున్న కాంట్రాక్టు రద్దు చేసుకోవాలని, ఆపై 45 రోజుల్లో నగదు తిరిగి చెల్లిస్తామంటూ చెప్పుకొచ్చారు. గౌస్ అలానే చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. చివరి సారిగా గత ఏడాది సెప్టెంబర్‌లో నిందితుల్ని సంప్రదించిన గౌస్‌కు నిరాశే ఎదురైంది. ఆ తర్వాత ఎన్నిసార్లు సంప్రదించడానికి ప్రయత్నించినా వారి నుంచి స్పందన కరువైంది. చివరకు తాను మోసపోయానని గుర్తించిన బాధితుడు సీసీఎస్ ఆధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ప్రాథమిక ఆధారాలను బట్టి సమీర్ హుస్సేన్, జి.మీఠావాలాల్ని నిందితులుగా చేర్చారు. దర్యాప్తు ప్రారంభించిన ఇన్స్పెక్టర్ పి.రవికిరణ్ నేతృత్వంలోని బృందం నిందితుల కోసం గాలిస్తోంది.