వర్ణం
పద్ధతైన ప్రణాళిక
ఆకులు అల్లుకున్నట్టున్న రాతి భవనాల దారిలో నడుస్తున్న వృద్ధుడిని ఫొటోలో చూడవచ్చు. ఇటలీలోని టస్కనీ ప్రాంతంలోని పియెంజా పట్టణ శివారు దృశ్యం ఇది. కొండను కేంద్రంగా చేసుకుని, దానిచుట్టూ ఇలా ఊరి నిర్మాణం జరిగింది. ఆ లోయంతా కూడా సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవడంలో ముందుంది. పునరుజ్జీవన కాలంలో నిర్మాణమైన పియెంజా, 1996లో, పద్ధతైన నగర నిర్మాణానికిగానూ యునెస్కో ‘ప్రపంచ వారసత్వ సంపద’ జాబితాలో చోటుచేసుకుంది.
సంప్రదాయ వేట
ఫొటోలో ఉన్నది చేపలవేటకు ఉచ్చులు పెడుతున్న ఒక వియత్నాం రైతు. ఈ ప్రాచీనమైన పద్ధతిలో, చేపలు ఈదేమార్గంలో వీటిని ఉంచుతారు. ఒకసారి ఇందులోకి ప్రవేశించిందంటే చేప ఇక వెనక్కి మళ్లలేదు. ఈ దృశ్యం హంగ్ యెన్ రాష్ట్రంలోని ఖొవాయి చౌ జిల్లాలోనిది. చాలామంది రైతులు వ్యవసాయం చేస్తూనే అదనపు ఆదాయం కోసం చేపలు, పీతల వేటకు దిగుతుంటారక్కడ.
విశ్వాస ప్రకటన
స్పెయిన్ రాజధాని మాడ్రిడ్లో, సామూహికంగా పశ్చాత్తాపం (కన్ఫెషన్) ప్రకటిస్తున్న విశ్వాసులు వీరు. రోమన్ కాథలిక్కుల చర్చికి చెందిన ‘ఓపస్ డెయి’ (దైవ కార్యం) మాజీ నాయకుడు, బిషప్ అయిన ‘బ్లెస్డ్’ అల్వారో డెల్ పోర్టిల్లో(1914-94) ‘బీటిఫికేషన్’ సందర్భంగా చోటుచేసుకున్న దృశ్యం ఇది.