ట్రంప్ విస్కీ బాటిల్ అ‘ధర’హో!
లండన్: డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో ఆయన బ్రాండ్ ఇమేజ్ అమాంతంగా పెరిగింది. ఆయన పేరుతో తయారైన విస్కీ బాటిల్ అత్యధిక ధరకు అమ్ముడుపోవడమే ఇందుకు నిదర్శనం. 2012లో ట్రంప్ పేరుతో తయారైన విస్కీ బాటిల్‌ను స్కాట్లాండ్లోని గ్లాస్గోలో మెక్ టియర్స్ సంస్థ వేలం వేసింది. కెనడాకు చెందిన ఓ వ్యక్తి దీనిని ఏకంగా ఆరు వేల పౌండ్లు (దాదాపు రూ.5 లక్షలు) చెల్లించి సొంతం చేసుకున్నాడు. వేలం నిర్వాహకుల అంచనా ధర కంటే రెండింతలు ఎక్కువ ధర పలకడం విశేషం.
ఆబర్దీన్ షైర్ ప్రాంతంలో 2012లో ట్రంప్ ఇంటర్నేషనల్ గోల్ఫ్ లింక్స్ ప్రారంభోత్సవం సందర్భంగా గ్లెన్ డ్రోనార్క్ సంస్థ పరిమిత సంఖ్యలో ఈ విస్కీ బాటిళ్లను తయారు చేసింది. బాటిల్ కవర్ పై ట్రంప్ సంతకం కూడా ఉంది. ‘గ్లెన్ డ్రోనార్క్ తయారు చేసే సింగిల్ మాల్ట్ విస్కీ అద్భుతంగా ఉంటుంది. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో ఆయన పేరుతో తయారుచేసిన విస్కీ బాటిల్ కు రికార్డు ధర వచ్చింద’ని విస్కీ నిపుణుడు లారీ బ్లాక్ పేర్కొన్నారు. ఆబర్దీన్ షైర్, టర్న్ బెరీ ప్రాంతాల్లో ట్రంప్ కు గోల్ఫ్ కోర్టులు ఉన్నాయి.