Seed merchants
-
పత్తి విత్తు... రైతు చిత్తు
ఎన్ని నిబంధనలు పెట్టినా విత్తన వ్యాపారుల ఆగడాలు ఆగడం లేదు. రైతును చిత్తు చేసి అందిన కాడికి దోచుకోవడమే లక్ష్యంగా వ్యాపారులు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇన్నాళ్లూ కొన్ని రకాల కంపెనీల విత్తనాలను వ్యూహాత్మకంగా కొరతగా చూపి ఎక్కువ ధరకు అమ్మే వ్యాపారులు తాజాగా కొత్త దందాకు తెరతీశారు. రూ.500 లభించే హైబ్రీడ్ పత్తి విత్తనాలను బీజీ-2 బీటీ విత్తనంగా చలామణి చేస్తూ రూ.930 విక్రయిస్తున్నారు.అంతేకాకుండా 125 గ్రాములు కందుల మిశ్రమంతో ఉండే బీజీ-2 విత్తన ప్యాకెట్‌ను రూ.862 విక్రయించాల్సి ఉండగా రూ.930 విక్రయిస్తూ దండుకుంటున్నారు. ఈ వ్యవహారం సాక్షాత్తూ వ్యవసాయశాఖ అధికారుల తనిఖీల్లోనే బుధవారం వెలుగుచూసింది. గజ్వేల్: ఎన్ని నిబంధనలు పెట్టినా విత్తన వ్యాపారుల ఆగడాలు ఆగడం లేదు. రైతును చిత్తు చేసి అందిన కాడికి దోచుకోవడమే లక్ష్యంగా వ్యాపారులు ప్రణాళికలు రచిస్తున్నారు. రెండేళ్ల క్రితం వరకు ఒకటి రెండు రకాల బీటీ పత్తి విత్తనాలకు మాత్రమే వ్యూహాత్మకంగా డిమాండ్‌ను సృష్టించిన వ్యాపారులు ఒక్కో ప్యాకెట్‌పై మూడు రెట్ల ధరలను వసూలు చేశారు. అయితే ‘సాక్షి’ వరుస కథనాలు, వ్యవసాయశాఖ అధికారుల చర్యల ఫలితంగా ఈ ప్యాకెట్లను ఎమ్మార్పీ కంటే తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీన్ని జీర్ణించుకోలేని వ్యాపారులు జిల్లాలో సింహభాగం పత్తి సాగయ్యే గజ్వేల్ కేంద్రంగా మరో అక్రమానికి తెరలేపారు. రూ.500 లభించే హైబ్రీడ్ పత్తి విత్తనాలను బీజీ-2 బీటీ విత్తనంగా చలామణి చేస్తూ రూ.930 విక్రయిస్తున్నారు. అంతేకాకుండా 125 గ్రాములు కందుల మిశ్రమంతో ఉండే బీజీ-2 విత్తన ప్యాకెట్‌ను రూ.862 విక్రయించాల్సి ఉండగా రూ.930 విక్రయిస్తూ దండుకుంటున్నారు. ఈ వ్యవహారం సాక్షాత్తూ వ్యవసాయశాఖ అధికారుల తనిఖీల్లోనే బుధవారం వెలుగుచూసింది. రెండేళ్ల క్రితం వరకు ప్రతి ఖరీఫ్ సీజన్లోనూ బీటీ పత్తి విత్తనాల బ్లాక్ మార్కెట్ రైతులకు తలనొప్పిగా మారింది. సాధారణంగా రూ.930 విక్రయించాల్సిన ప్యాకెట్ విత్తనాలను వ్యాపారులు బ్లాక్ మార్కెట్‌కు తరలించి ఇష్టారీతిగా విక్రయించేవారు. ఒక్కో ప్యాకెట్‌ను రూ.3 వేలకుపైగా విక్రయించి లక్షలు దండుకున్నారు. శాస్త్రీయంగా అన్ని రకాల విత్తనాలు ఒకే రకమైన ఫలితాలనిస్తుండగా వ్యాపారులు మాత్రం వ్యుహాత్మంగా కొన్ని రకాలే మంచి దిగబగడులనిస్తాయని అపోహలు సృష్టించి దండుకున్నారు. ఈనేపథ్యంలో ఆత్మ(అగ్రికల్చర్ టెక్నాలజీ మెనేజ్మెంట్ ఏజెన్సీ), వ్యవసాయశాఖ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వివిధ రకాల విత్తనాలను వేసిన పత్తి క్షేత్రాలపై అధ్యయనానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే మెదక్ జిల్లాలో గజ్వేల్ మండలం రిమ్మనగూడ గ్రామంలో గతేడాది, ఈసారికూడా పలువురు రైతుల భూముల్లో నాలుగైదు రకాలకు చెందిన విత్తనాలను సాగు చేయించిన అన్నీ ఒకే రకమైన ఫలితాలనిస్తాయని ప్రయోగాత్మకంగా నిరూపించారు. ఈ ప్రయోగ ఫలితాలను కరపత్రాల ద్వారా అధికారులు రైతులకు వివరించారు. ఈ ప్రచారంలోనూ ‘సాక్షి’ తనదైన పాత్రను పోషించింది. ఎన్నోసార్లు ప్రత్యేక కథనాలను ప్రచురించి రైతుల ఆలోచనా విధానంలో మార్పునకు నాంది పలికింది. ఈ క్రమంలోనే ఈసారి జిల్లాలో 1.73 లక్షల హెక్టార్లకుపైగా పత్తి సాగయ్యే అవకాశముందని వ్యవసాయశాఖ అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం 6 లక్షల విత్తనాల ప్యాకెట్లు అవసరమవుతాయని అంచనా వేసి 40కి పైగా వివిధ కంపెనీలకు అనుమతులు ఇచ్చారు. ప్రస్తుతం జిల్లాలో ఎక్కడా కూడా విత్తనాల కొరత లేదు. దీంతో విత్తనాలను ఎమ్మార్పీకే విక్రయించాల్సి రావడంతో విత్తన వ్యాపారులు మరో పథకం పన్నారు. అందులో భాగంగా జిల్లాలో పత్తి అధికంగా సాగయ్యే గజ్వేల్ కేంద్రంగా ఓ ప్రధాన కంపెనీకి చెందిన ప్యాకెట్లు అధిక దిగుబడులనిస్తాయనే అపోహను సృష్టించారు. ఆ కంపెనీ కి చెందిన ప్యాకెట్లు ఇవ్వడానికి టోకెన్ అమౌంట్ పేరిట రైతుల నుంచి రూ.100 నుంచి రూ.150 వసూలు చేశారు. ఇది పసిగట్టిన ‘సాక్షి’ ఈనెల ‘పక్కాగా బ్లాక్ దందా’ పేరిట మే 4న ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. దీంతో వ్యవసాయశాఖ అప్రమత్తమైంది. ముందస్తు వసూళ్లను కట్టడి చేయగలిగింది. ఇక కొత్త తరహా అక్రమం.... బీటీ పత్తి విత్తనాల ప్యాకెట్లను బ్లాక్ మార్కెట్ చేయడానికి అన్ని దారులు మూసుకుపోవడంతో వ్యాపారులు కొత్త తరహా అక్రమానికి తెరలేపారు. రూ.500 మాత్రమే విక్రయించాల్సిన హైబ్రీడ్ బీటీ విత్తన ప్యాకెట్‌ను బీజీ-2గా చలామణి చేస్తూ, 125 గ్రాముల కందుల మిశ్రమంతో ఉన్న బీజీ ప్యాకెట్‌ను రూ.862 విక్రయించాల్సి ఉండగా దాన్ని రూ.930 విక్రయిస్తున్నారు. బుధవారం వ్యవసాయశాఖ తనిఖీల్లో ఈ విషయం బయటపడటం, ఈ క్రమంలోనే అక్రమానికి పాల్పడిన వ్యాపారిపై కేసు నమోదు కావడం కలకలం రేపుతోంది. బీటీ పత్తి విత్తనాలు, ఎరువుల పంపిణీలో బ్లాక్ మార్కెట్‌ను సహించేదిలేదని ఈనెల 4న గజ్వేల్‌లో నిర్వహించిన సమీక్షలో సీఎం స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఈ మేరకు జిల్లా ఇన్చార్జి కలెక్టర్ శరత్ ఈనెల 13న గజ్వేల్‌లో సమీక్ష నిర్వహించి వ్యాపారులకు హెచ్చరికలు చేశారు. అంతకు ముందు వ్యవసాయశాఖ జాయింట్ డెరైక్టర్ హుక్యానాయక్తోపాటు పలువురు అధికారులు సైతం తనిఖీలు నిర్వహించి వారు కూడా హెచ్చరికలు చేశారు. అయినా వ్యాపారులు మాత్రం తమ తీరు మార్చుకోలేదు. రైతును చిత్తు చేయడమే లక్ష్యంగా హైబ్రీడ్ పత్తి విత్తనాలను బీజీ-2 పేరిట చలామణి చేస్తూ అందిన కాడికి దండుకుంటున్నారు. -
దగాపై కన్నెర్ర
- నాసిరకం వరి విత్తనాలను - అంటగట్టారంటూ రైతన్న ఆగ్రహం - ఫర్టిలైజర్ దుకాణం ఎదుట ఆందోళన - పట్నం చౌరస్తాలో రాస్తారోకో.. - విత్తనాలను తగులబెట్టి నిరసన ఇబ్రహీంపట్నం రూరల్: అయితే అతివృష్టి లేకుంటే అనావృష్టితో ప్రకృతి వికటాట్టహాసం చేస్తుండడంతో ఇప్పటికే పుట్టెడు క ష్టాలతో కాలం నెట్టుకొస్తున్న అన్నదాతను విత్తన వ్యాపారులూ దగా చేస్తున్నారు. నాసిరకం విత్తనాలను అంటగట్టి నిలువునా దోచుకుంటున్నారు. దీంతో రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వ్యాపారుల దగాపై కన్నెర్రజేశారు. సోమవారం ఇబ్రహీంపట్నంలో ఓ ఫర్టిలైజర్ దుకాణం యజమాని నాసిరకం విత్తనాలను విక్రయి స్తూ మోసం చేస్తున్నారని రైతులు రాస్తారోకో చేశారు. నాసిరకం విత్తన బ్యాగులను తగులబెట్టారు. పాలకుల నుంచి అధికారుల వరకు అందరూ రైతుల జీవితాలతో ఆడుకునేవారే.. ఒక్కరూ పట్టించుకోరంటూ ఆగ్రహోదగ్రులయ్యారు. వెంటనే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతుల కథనం ప్రకారం ఇదీ మోసం..ఇబ్రహీంపట్నంలోని రాఘవేంద్ర ఫర్టిలైజర్ దుకాణంలో పలువురు రైతులు కొన్నాళ్ల క్రితం ఒక్కో వరి విత్తన బస్తాను రూ.750కి కొనుగోలు చేశారు. సాధారణ రకం కాకుండా లక్ష్మీగణపతి, అర్ణపూర్ణ కంపెనీలకు చెందిన బీపీటీ 1010, ఐఈఆర్64, తెల్లహంస విత్తనాలను కొన్నారు. నెలలు గడుస్తున్నా నారు మొలక కూడా రాలేదు. ‘ఇప్పటికే తాము సమస్యలతో సతమతమవుతుంటే సందట్లో సడేమియాలాగా ఫర్టిలైజర్ దుకాణాల వారూ నిండాముంచారు. మొలకెత్తని నాసిరకం విత్తనాలను అంటగడతారా’ అంటూ రైతులు కన్నెరజేశారు. ఫర్టిలైజర్ షాపులోని నాసిరకం విత్తనాలను రోడ్డుపై పోసి తగులబెట్టారు. రైతులకు సకాలంలో విత్తనాలు, ఎరువులు అందేలా కృషి చేస్తామని ప్రజాప్రతినిధులు, అధికారులు చెబుతున్న మాటలు ప్రకటనలకే పరిమితమవుతున్నాయని సోమవారం ఇక్కడ జరిగిన ఘటనతో స్పష్టమైంది. రైతులు ఎంత మొత్తుకుంటున్నా వ్యాపారులు పెడచెవినబెట్టి.. నాసిరకం విత్తనాలనే విక్రయిస్తున్నారు. రోహిణి కార్తెలో విత్తనాలు వేస్తే సకాలంలో మొలకెత్తి.. నాటు వేయడానికి వీలుంటుందని భావించిన రైతులను నిలువెల్లా మోసం చేస్తున్నారు. మాకేం సంబంధం లేదు.. ఈ విషయంలో ఫర్టిలైజర్ షాపు నిర్వాహకుల వాదన మరోలా ఉంది. నాసిరకం విత్తనాలతో తమకెటువంటి సంబంధం లేదని.. అది పూర్తిగా ఆయా కంపెనీల తప్పిదమేనని చెబుతున్నారు. వారిచ్చిన విత్తనాలనే తాము విక్రయిస్తున్నట్లు పేర్కొన్నారు. రైతులు మాత్రం ఈ దగాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని.. తమ పొట్టకొట్టిన షాపు నిర్వాహకులే బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు. విత్తనాలను పరిశీలిస్తాం: కంపెనీ ప్రతినిధులు విత్తనాల విషయమై రైతులు ఆందోళన చేపట్టడంతో రంగంలోకి దిగిన వ్యవసాయాధికారులు సదరు విత్తన కంపెనీ ప్రతినిధులతో మాట్లాడారు. మంగళవారం విత్తనాలను పరిశీలించేందుకు వస్తామని కంపెనీ ప్రతినిధులు చెప్పారు. విత్తనాలు తీసుకున్న రైతులకు తిరిగి డబ్బులను వాపసు ఇస్తామని చెప్పగా.. రైతులు దీనికి ససేమిరా అన్నారు. కార్తె బలం ఉన్నప్పుడే విత్తనాలు వేస్తే ఫలితం ఉంటుందని.. ప్రస్తుతం వేస్తే ప్రయోజనం లేదని తేల్చి చెప్పారు. విత్తనాలతోపాటు, ఎరువులు, దున్నడానికి, ఇతరత్రా ఖర్చులు కలుపుకొని సుమారు రూ.4వేలు ఖర్చయ్యిందని.. ఆ డబ్బును ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఫర్టిలైజర్ షాపు నిర్వాకంపై వ్యవసాయాధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆందోళనలో ఆదర్శ రైతు సంఘం అధ్యక్షుడు ఆకుల ఆనంద్‌కుమార్, ఆదర్శ రైతు యాదయ్యతోపాటు సుమారు 40 మంది రైతులు పాల్గొన్నారు. -
చి‘వరి’కి దగా!
యాచారం, న్యూస్‌లైన్ : రైతుల నమ్మకాన్ని విత్తన వ్యాపారులు వమ్ము చేశారు. నాణ్యత లేని విత్తనాలు అంటగట్టి నిలువునా ముంచేశారు. కొత్త రకం విత్తనం, పంట దిగుబడి అధికంగా వస్తుందని చెబితే నమ్మి కొనుగోలు చేసిన అన్నదాతలు దారుణంగా మోసపోయారు. విత్తనాలు నారుమడిలో పోస్తే పక్షం రోజులు దాటినా మొలకెత్తక పోవడంతో ఆందోళన చెందుతున్నారు. వ్యాపారుల మాటల నమ్మి మోసపోయామని రైతన్నలు లబోదిబోమంటున్నారు. మండలంలో మూడేళ్ల తర్వాత సంవృద్ధిగా వర్షాలు కురవడంతో రైతులు అధికంగా వరి సాగు చేయడానికి సిద్ధమయ్యారు. వ్యవసాయాధికారులు అవసరమైన వరి విత్తనాలు అందుబాటులో ఉంచకపోవడంతో అదను పోతుందనే ఆతృతతో రైతులు ప్రైవేట్ వ్యాపారుల వద్ద విత్తనాలు కొనుగోలు చేసుకొని నారుమడులు పోశారు. మండలంలోని మాల్, ఇబ్రహీంపట్నంలతోపాటు మొత్తం 20గ్రామాల రైతులు నగరంలోని వివిధ ప్రాంతాల్లోని వ్యాపారుల వద్ద వరి విత్తనాలు కొనుగోలు చేశారు. అయితే నారుమడులు పోసినా సగానికి పైగా మొలకలు రాకపోవడంతో మళ్లీ కొత్తవి కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. పదిహేను రోజుల క్రితం తమ్మలోనిగూడ గ్రామానికి చెందిన పలువురు రైతులు నగరంలోని మాదాపూర్‌లోని దుకాణంలో ఓం సీడ్స్ కంపెనీకి చెందిన వరి విత్తనాలను 25 కిలోల బ్యాగు రూ.720 చొప్పున కొనుగోలు చేశారు. నారుమడులు పోసిన పక్షం రోజుల వరకు కూడ కరిగట్లలో మొలకలెత్తనే లేదు. దీంతో రైతులు విత్తనాల బ్యాగుపై ఉన్న ఫోన్ నంబర్లో సంప్రదిస్తే నాణ్యమైన విత్తనాలనే ఇచ్చాం...మీరే ఎలా నారుమడి పోశారోనని బదులివ్వడంతో విస్తుపోయారు. కేవలం తమ్మలోనిగూడ గ్రామంలోనే కాకుండా చింతపట్ల, మాల్, నల్లవెల్లి, నక్కర్తమేడిపల్లి, నానక్‌నగర్, నందివనపర్తి తదితర గ్రామాల్లోనూ చాలామంది రైతులు వరి విత్తనాలను ప్రైవేటులోనే కొనుగోలు చేసి నారుమళ్లు పోశారు. కొన్ని చోట్ల ఆలస్యంగా మొలకెత్తగా, మరి కొందరి పొలాల్లో పదిహేను రోజులు దాటినా కూడా మొలకెత్తలేదు. దీంతో రైతులు మళ్లీ రూ.వందలాది ఖర్చులు చేసి విత్తనాలు తెచ్చి నారుమడులు పోసే పరిస్థితులు వచ్చాయి. ఇంత జరుగుతున్న వ్యవసాయాధికారుల్లో మాత్రం చలనం లేకపోవడం అన్నదాతలకు పెద్ద శాపంగా మారింది. నాణ్యమైనవని కొంటే... అందుబాటులో ప్రభుత్వ విత్తనాలు లేకపోవడంతో నగరానికి వెళ్లాల్సి వచ్చింది. వ్యాపారులు వరి విత్తనాలు నాణ్యమైనవని, దిగుబడికి ఢోకా ఉండదని చెప్పడంతో ఓంసీడ్స్ కంపెనీ విత్తనాలు కొనుగోలు చేశాను. నాలుగు సంచులకు రూ.3వేల దాకా ఖర్చు చేశాను. మడి కడితే వారం దాటినా కూడా మొలకలు రాలేదు. రోజూ ఉదయం, సాయంత్రం నీటి తడి అందించినా ఫలితం లేకపోయింది. - హరికృష్ణ, తమ్మలోనిగూడ మోసపోయాను.. ఇరవయ్యేళ్లుగా వ్యవసాయం చేస్తున్నాను. ఎన్నడూ ఇలా జరగలేదు. అందరూ ఓంసీడ్స్ వరి విత్తనాలు నాణ్యమైనవి అంటుంటే వెళ్లి కొనుగోలు చేశాను. ఈసారి విత్తనాల ఎంపికలో దారుణంగా మోసపోయాను. కరిగట్టు పోసి పక్షం రోజులు దాటినా వరి మొలకెత్తలేదు. విత్తనాల కోసం ఖర్చు చేసిన రూ.2వేలు నష్టపోయాను. అధికారులు స్పందించి నాసిరకం విత్తనాలు అంటగట్టిన వ్యాపారులపై చర్యలు తీసుకోవాలి - భంద్రయ్య, తమ్మలోనిగూడ