కోటు అమ్ముకొని మరీ చదువుకున్నాడు
శ్రీనగర్: కాస్తంత కలిగి ఉండి పక్కనే ఉన్న తెలివైనవారిని పట్టించుకునే తీరిక ఉండాలి గానీ.. కళ్లముందే మహావృక్షాల్లా ఎదిగేస్తారు. ఆ వృక్ష ఫలాలు అందకున్నా దానికి నీరు పోసింది తానే అన్న ఆనందం అలా నిలిచిపోతుంది. ఇలాంటి అనుభూతి ఇప్పుడు జమ్మూకశ్మీర్లో ఓ విద్యార్థికి సహాయం చేసిన వ్యక్తుల్లో కనిపిస్తోంది. కశ్మీర్లోని షాగుండ్ అనే గ్రామంలో షకీల్ అహ్మద్ అనే విద్యార్థి ఓ నిరుపేద. అతడికి ఇద్దరు సోదరులు. తండ్రి చనిపోవడంతో ఇంట్లో వాళ్లతో కలిసి కూలికి వెళ్లే వాడు. కానీ, వాళ్ల అమ్మ మాత్రం అతడికి ఎప్పటికప్పుడు చదువుపై బలవంత పెడుతూనే ఉండేది.
అందులో భాగంగానే ఓ పక్క పనిచేసుకుంటూనే షకీల్ చదువుకునేవాడు. అతడి చదువులు కొనసాగించేందుకు అప్పుడప్పుడు ఇంట్లో వస్తువులు.. తాను చలికి తట్టుకోలేక వేసుకునే కోటుతో సహా అమ్మేశాడు. అలా కష్టపడి చదువుకున్న ఆ విద్యార్థి ఇప్పుడు దేశంలోనే అత్యున్నత ఇంజినీరింగ్ విభాగం అయిన ఐఐటీలో సీటు సాధించాడు. కానీ, అతడికి ఫీజుల భారం మొదలైంది. దాదాపు రూ.6లక్షలు కట్టాల్సిన పరిస్థితి ఎదురైంది. దీంతోపాటు అదనపు ఫీజులు కూడా.
ఇతడి పేదరిక విషయం బయటకు తెలియడంతో శ్రీనగర్ కు చెందిన ఐఐటీ సంస్థ ముందుకొచ్చింది. అతడు తమ ఐఐటీలో చేరితే ఫీజు కోసం ఎలాంటి ఇబ్బంది పెట్టబోమని ఐఐటీ ప్రకటించింది. దీంతోపాటు ఇతడి గురించి తెలిసిన మానవతా వాదులు ఇప్పటికే అతడి పేరిట దాదాపు రూ.2లక్షలకు పైగా డిపాజిట్లు చేశారు. మరో విశేషమేమిటంటే షాగుండ్ చుట్టుపక్కల ప్రాంతాలనుంచి ఐఐటీకి ఎంపికైన తొలి విద్యార్థి షకీలే.