sheep dies
-
గొర్రెల మందపై చిరుత దాడి
మడకశిర రూరల్ : కదిరేపల్లి సమీపంలో హంద్రీనీవా కాలువ వద్ద శుక్రవారం తెల్లవారుజామున కాపరి రంగనాథ్‌కు చెందిన గొర్రెల మందపై చిరుత దాడి చేసింది. మందలోకి చిరుత ప్రవేశించిన వెంటనే కేకలు వేయడంతో మేకను చంపివేసి అక్కడే వదిలి గొర్రెను కొండప్రాంతంలోకి ఎత్తుకెళ్లి వదలేసిందని బాధితుడు తెలిపాడు. దీంతో దాదాపు రూ.13 వేల నష్టం వాటిల్లిందన్నాడు. రెండు నెలల వ్యవధిలో నరసప్ప, తిప్పేరంగప్ప, రంగధామప్ప తదితరులకు చెందిన దాదాపు పది మేకలు, గొర్రెలను చిరుత చంపివేసిందని గ్రామస్తులు తెలిపారు. అటవీ శాఖాధికారులు చర్యలు తీసుకుని చిరుత దాడిలో మృతి చెందిన మేకలు, గొర్రెల కాపరులకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలని కోరుతున్నారు. -
గొర్రెను చంపిన చిరుత
కళ్యాణదుర్గం : కళ్యాణదుర్గం మండలం మల్లాపురంలో నల్లప్ప అనే రైతుకు చెందిన గొర్రెను ఓ చిరుత గురువారం చంపేసింది. కళ్యాణదుర్గం సమీపంలోని వన్నూరుస్వామి కొండ వెనుక భాగంలో ఈ ఘటన జరిగింది. గొర్రెలను మేపుకుని వచ్చేందుకు కొండ వద్దకు వెళ్లగా అనూహ్యంగా చిరుత మందపై దాడిచేసి గొర్రెను ఎత్తుకెళ్లినట్లు గ్రామస్తులు తెలిపారు. అటవీ శాఖ అధికారిణి రామేశ్వరి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కాగా అదే గ్రామానికి చెందిన మరో రైతు గొర్రెను రెండ్రోజుల కిందట చిరుత చంపేసినట్లు గ్రామస్తులు తెలిపారు. దీంతో ఆయా గ్రామస్తులతో పాటు పశువుల కాపరులు అటువైపు మందను తోలుకెళ్లాలంటేనే భయపడిపోతున్నారు.