గాలివానకు 100 సైబీరియా కొంగలు మృత్యువాత
మహబూబాబాద్ రూరల్ (వరంగల్) : మహబూబాబాద్ మండలం మల్యాల గ్రామంలో శుక్రవారం సుమారు వంద సైబీరియా కొంగలు చనిపోయాయి. గత ఏడాది డిసెంబర్లో ఈ కొంగలు మల్యాలకు వచ్చి ఇక్కడి కృషి విజ్ఞాన కేంద్రంలోని చెట్లపై, గ్రామంలోని చెట్లపై నివాసం ఉంటున్నాయి. చెట్లపైనే గూళ్ళు ఏర్పాటు చేసుకుని పొదుగుతున్నాయి. రెండు రోజులుగా వీచిన ఈదురు గాలికి గూళ్లు ధ్వంసం కావడంతో పక్షులు చెల్లాచెదురయ్యాయి. గాలి దుమారంతోపాటు వర్షంతో సుమారు వంద కొంగలు కింద పడి మృతి చెందాయని స్థానికులు తెలిపారు. వాటి కళేబరాల వద్ద మరికొన్ని పక్షులు చేరి వాటి వద్ద కాపలా ఉండడం కనిపించింది.