సిద్ధు, పరమేశ్వరలకు సోనియా పిలుపు
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ర్ట మంత్రి వర్గ విస్తరణపై చర్చించడానికి ఢిల్లీకి రావాల్సిందిగా కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వర, ముఖ్యమంత్రి సిద్ధరామయ్యలను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆహ్వానించారు. వచ్చే నెల మూడో తేదీన ఢిల్లీలో ఉండేట్లు కార్యక్రమాన్ని రూపొందించుకోవాలని సూచించారు. మంత్రి వర్గంలో ఖాళీగా ఉన్న నాలుగు స్థానాలకు ఎవరిని ఎంపిక చేయాలనే విషయమై పార్టీ అధ్యక్షురాలితో జరిగే సమావేశంలో ఉభయులూ చర్చించనున్నారు.
మరో వైపు పరమేశ్వర ఉప ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నారు. దీని వల్ల మరో అధికార కేంద్రం ఏర్పడే అవకాశాలున్నందున, ముఖ్యమంత్రి ససేమిరా అంటున్నారు. మంత్రి వర్గంలో ఆయనను చేర్చుకోవడానికి ఆయనకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. మంత్రి వర్గాన్ని పునర్వ్యవస్థీకరించాలని పార్టీలో గట్టిగా డిమాండ్లు వినిపిస్తున్నప్పటికీ, తేనె తుట్టెను కదల్చడం ఆయనకు ఇష్టం లేదు. ఈ నేపథ్యంలో పార్టీ అధినేత్రితో జరిగే సమావేశం నిర్ణయాత్మకం కానుంది.